క్యాన్సర్ కారణంగా 'పెద్ది' ఆఫర్ వదులుకోవాలనుకున్నా!
కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ తాజాగా చెన్నైలో జరిగిన `పెద్ది` చిత్ర ప్రమోషన్స్ వేదికగా ఎంతో ఎమోషన్‌కి గురయ్యారు.
By: Sivaji Kontham | 31 May 2026 12:36 PM ISTకన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ తాజాగా చెన్నైలో జరిగిన `పెద్ది` చిత్ర ప్రమోషన్స్ వేదికగా ఎంతో ఎమోషన్‌కి గురయ్యారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రంలో ఆయన ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. జూన్ 4న సినిమా విడుదల కానుంది. చెన్నై ప్రమోషన్స్ లో శివరాజ్ కుమార్ తనకు క్యాన్సర్ నిర్ధారణ అయిన కష్టసమయంలో`పెద్ది1 చిత్రబృందం తనకు అండగా నిలిచిన విధానాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
ఈ వేదికపై శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. 2024లో తనకు క్యాన్సర్ నిర్ధారణ కాకముందే ఈ సినిమా కోసం చిత్రబృందం తనను సంప్రదించిందని వెల్లడించారు. దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది.. ఆ రోజు రామ్ చరణ్‌తో కూడా మాట్లాడాను. కానీ ఆ తర్వాత దురదృష్టవశాత్తూ నాకు క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. దాంతో చికిత్స కోసం నేను అమెరికా వెళ్లాల్సి వచ్చింది! అని చెప్పారు. ఆ సమయంలో ఆరోగ్యం సహకరించక ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని తాను అనుకున్నట్లు పేర్కొన్నారు.
అయితే తన స్థానంలో వేరే నటుడిని తీసుకోకుండా చిత్రబృందం చూపించిన ఓపిక, ప్రేమ తనను ఎంతగానో కదిలించిందని శివన్న అన్నారు. ``నేను వద్దనుకున్నా.. లేదు సార్.. మాకు మీరే కావాలి`` అంటూ బుచ్చిబాబు, రామ్ చరణ్ నా కోసం చాలా కాలం పాటు వేచి చూశారు. వారు చూపించిన ఈ గుణానికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతుడనై ఉంటాను. ఇదొక అద్భుతమైన ప్రయాణమని శివరాజ్ కుమార్ కొనియాడారు.
ఇదే ఈవెంట్‌లో రామ్ చరణ్ సైతం శివరాజ్ కుమార్ నటనపై ప్రశంసల జల్లు కురిపించారు. రజనీకాంత్ `జైలర్` సినిమాలో శివన్న చేసిన క్యామియో పాత్రను తాను కేవలం అతడి కోసమే ఎన్నోసార్లు చూశానని చరణ్ తెలిపారు. ``స్క్రీన్‌పై శివన్న కనిపిస్తే ఒక అగ్నిపర్వతం బద్దలైనట్లు ఉంటుంది. ముఖ్యంగా కారులో సిగరెట్ కాలుస్తూ వచ్చే ఆ స్లో-మోషన్ షాట్ ఒక ఐకానిక్ పర్ఫార్మెన్స్. ఆయన కళ్లే ఎన్నో భావాలను పలికిస్తాయి`` అంటూ చరణ్ తన అభిమానాన్ని చాటుకున్నారు
శివరాజ్ కుమార్ 2024 డిసెంబర్‌లో అమెరికాలోని మయామి ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స (బ్లాడర్ సర్జరీ) చేయించుకున్నారు. కుటుంబ సభ్యులు, వైద్యులు అభిమానుల మద్దతుతో ఆ మహమ్మారిపై విజయం సాధించారు. చికిత్స పొందుతూనే ఎంతో అలసటగా ఉన్నా తన కన్నడ చిత్రం `45` షూటింగ్‌ను పూర్తి చేసినట్లు గతంలో వెల్లడించిన శివన్నకు ఆ సినిమా తర్వాత విడుదలవుతున్న మొదటి చిత్రం `పెద్ది` కావడం విశేషం. శివరాజ్ కుమార్ జైలర్ 2లోను నటిస్తున్నారు.
