Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ తెలుగు 10లో పొలిటికల్ లెక్కలు ఎక్కువయ్యాయి.. శివాజీ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు..!

బిగ్ బాస్ తెలుగు 10లో కంటెస్టెంట్లు గేమ్ కంటే రాజకీయ వ్యూహాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని శివాజీ వ్యాఖ్యానించారు. ఆలీతో సంభాషణలో ఈ సీజన్ ఆటతీరుపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. మరోవైపు తాజా ఎలిమినేషన్‌లో నీతూ మాస్టర్ బయటకు వెళ్లగా, సుధీర్ సేఫ్ అయ్యారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   23 Nov 2026 11:30 PM IST
బిగ్ బాస్ తెలుగు 10లో పొలిటికల్ లెక్కలు ఎక్కువయ్యాయి.. శివాజీ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు..!
X

బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, గ్రూప్ గేమ్స్, కెప్టెన్సీ పోటీలు, ఎలిమినేషన్లు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే ఈ సీజన్‌లో గత సీజన్లతో పోలిస్తే గేమ్ ఆడే విధానం పూర్తిగా మారిపోయిందనే శివాజీ చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హౌస్‌లో కనిపిస్తున్న రాజకీయ వ్యూహాలు, కంటెస్టెంట్ల ప్రవర్తనపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, ప్రస్తుత బిగ్ బాస్ బజ్ హోస్ట్ శివాజీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈమధ్య ఒక కార్యక్రమంలో ఆలీతో జరిగిన సంభాషణలో శివాజీ ఈ సీజన్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. గత సీజన్లకు, ప్రస్తుత సీజన్‌కు మధ్య ఏమైనా తేడా ఉందా అని ఆలీ అడిగారు. దీనికి సమాధానంగా శివాజీ మాట్లాడుతూ.. ఈసారి హౌస్‌లో గేమ్ కంటే పొలిటికల్ ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అన్నారు. ఎవరు ఎవరితో తిరగాలి? ఒక అమ్మాయి చుట్టూ ఒక అబ్బాయి తిరిగితే అతని ఆట ఎలా ఉంటుంది? ఇలాంటి లెక్కలతో కంటెస్టెంట్లు ఆలోచిస్తున్నారని అభిప్రాయపడ్డారు.

సాధారణంగా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లు తమ ఆట, ప్రవర్తన, టాస్కుల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈసారి మాత్రం రాజకీయ నాయకులు వ్యూహాలు వేసినట్లు ప్రతి విషయాన్ని లెక్కలు వేసుకుంటున్నారని శివాజీ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఆలోచనలు గేమ్‌కు పెద్దగా ఉపయోగపడవని కూడా చెప్పారు.

అంతేకాదు, ఈ వ్యూహాల వెనుక అసలు ఎవరు ఉన్నారనే విషయంపై కూడా ఆయన ఆసక్తికరంగా స్పందించారు. ఇవన్నీ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లే ఆలోచిస్తున్నారా? లేక బయట నుంచి ఎవరైనా ప్రభావితం చేస్తున్నారా? అనే ప్రశ్నకు సమాధానంగా బయట ఏం జరుగుతుందో లోపల ఉన్న వాళ్లకి అసలు తెలియదు అని. ఇదంతా ఎక్కడో ముంబైలో జరుగుతోంది అని, ఇక్కడి నుంచి చూస్తే పీఆర్ ప్రభావం ఉందని అనిపించినా, అసలు పరిస్థితి ఏమిటో చెప్పలేమని పేర్కొన్నారు.

మరోవైపు, బిగ్ బాస్ తెలుగు 10లో తాజా ఎలిమినేషన్ కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఆదివారం ఎపిసోడ్‌లో నీతూ మాస్టర్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఆమె కంటే సుధీర్ ఎలిమినేట్ అవుతారని ఏడుగురు హౌస్‌మేట్స్ అంచనా వేశారు. కానీ ఫలితం మాత్రం అందుకు భిన్నంగా వచ్చింది. సుధీర్ సేఫ్ కాగా, నీతూ మాస్టర్ ప్రయాణం ముగిసింది.

ఇక కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం జరిగిన టాస్కుల్లో త్రిగుణ్, రామ్ ప్రసాద్, శివ, దేవజాని, ఆర్కే విజయం సాధించారు. మరోవైపు రష్మిక మందన్న హౌస్‌లోకి వచ్చి కంటెస్టెంట్లతో సరదాగా గడపడం ఎపిసోడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.