నటీమణుల బట్టలపై కామెంట్.. నటుడు శివాజీపై విమర్శలు!
అందం అనేది బట్టలు విప్పడంలో లేదు.. హుందాతనం, గౌరవంలో ఉందని వ్యాఖ్యానించారు నటుడు శివాజీ.
By: Sivaji Kontham | 23 Dec 2025 9:11 AM ISTఅందం అనేది బట్టలు విప్పడంలో లేదు.. హుందాతనం, గౌరవంలో ఉందని వ్యాఖ్యానించారు నటుడు శివాజీ. కథానాయికలు గ్లామర్ పేరుతో హద్దులు దాటడం సరికాదని, పద్ధతైన దుస్తులలోను అందంగా కనిపిస్తారని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు పూర్తిగా స్త్రీ స్వేచ్ఛకు విరుద్ధంగా ఉండటంతో నెటిజనుల్లో తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. సోమవారం సాయంత్రం `దండోరా` ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొన్న శివాజీ పైవిధంగా కామెంట్ చేసారు. `దండోరా` ఈ నెల 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రచార వేదికపై శివాజీ హద్దు మీరిన నటీమణుల ఎక్స్ పోజింగ్ గురించి కామెంట్ చేసారు. గ్లామర్ పేరుతో హద్దు మీరవద్దని వారికి సూచించారు.
వేడుకకు చీరకట్టులో వచ్చిన యాంకర్ స్రవంతిని అభినందించిన శివాజీ, కథానాయికలు వారి దుస్తుల శైలి హుందాగా లేదని అన్నారు. శరీరాన్ని బహిర్గతం చేసే దుస్తులలో కాకుండా సాంప్రదాయబద్ధంగా ఒళ్లు కప్పి ఉంచే దుస్తులలో అందం బయటపడుతుందనే అర్థంలో శివాజీ చేసిన వ్యాఖ్యలకు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాల్లో ఒక సెక్షన్ ఇప్పుడు ఆయన వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు.
నటీమణులు అసభ్యకరమైన దుస్తుల్లో పబ్లిక్ లోకి వస్తే, ప్రజలు అప్పటికి స్మైలిచ్చినా కానీ, ఇలాంటి దుస్తులు ఎందుకు ధరించారు? అంటూ లోలోన ప్రశ్నించుకుంటారని అన్నారు. నేను ఇలా చెబితే మహిళల స్వేచ్ఛకు వ్యతిరేకంగా మాట్లాడానని అంటారు కానీ, అది నిజం కాదని అన్నారు. మంచి దుస్తుల్లో అందంగా కనపడేప్పుడు అసభ్యకర దుస్తులు ధరించాల్సిన అవసరం లేదని అన్నారు.
మహిళలు ప్రకృతికి ప్రతీక.. హుందాతనం, గౌరవం పెంచుతుందని కూడా వ్యాఖ్యానించారు. తన తల్లిని ఉదహరిస్తూ ఎప్పటికీ ఆమె హుందాతనం తన కళ్ల ముందు మెదులుతుందని అన్నారు. నేటితరంలోను చాలా మంది మహిళలు హుందాగా వ్యవహరిస్తున్నారని కూడా శివాజీ అన్నారు.
ఇటీవల ముక్కు సూటిగా తన అభిప్రాయాలను చెబుతున్న నటుడు శివాజీపై ఒక సెక్షన్ ప్రజలు విరుచుకుపడుతూనే ఉన్నారు. ఇప్పుడు హీరోయిన్ల దుస్తులపై ఆయన చేసిన కామెంట్లకు వ్యతిరేకత వ్యక్తమైంది.
దండోరా సినిమా గురించి మాట్లాడుతూ .. కచ్ఛితంగా ప్రజలు మెచ్చే విషయం ఉన్న చిత్రమిదని అన్నారు. ఈ వారంలో ఏ చిన్న సినిమాలొచ్చాయి? అనడిగేవారి కోసం.. ఇదే ఈ వారంలో పెద్ద సినిమా అని గర్వంగా చెప్పగలను అన్నారు. దండోరా టైటిల్ ఎగ్జయిట్ చేసిందని, స్క్రిప్టు తనకు బాగా నచ్చడంతో వెంటనే అంగీకరించానని అన్నారు. దండోరా సినిమా తర్వాత నిర్మాత చాలా అభిరుచి ఉన్న నిర్మాతగా గుర్తింపు పొందుతాడు. డబ్బులుంటే సినిమా తీయొచ్చు. కానీ కథను సెలెక్ట్ చేయడం అందరి వల్లా కాదు. కథను ఎంపిక చేయడంలోనే నిర్మాత సక్సెసయ్యారని కూడా అన్నారు.
బిగ్ బాస్ -తెలుగులో ఇంటి సభ్యుడిగా ఆదరణ పొందిన శివాజీ చాలా కాలం పాటు సినిమాల్లేక కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నారు. కోర్ట్ సినిమాలో ప్రతినాయకుడిగా నటించి కంబ్యాక్ ని ఘనంగా చాటుకున్నారు. ఇప్పుడు దండోరా చిత్రంలో అతడు నటుడిగా ఆకట్టుకునే పాత్రలో నటించానని చెబుతున్నారు.
