Begin typing your search above and press return to search.

ముదురుతున్న వివాదం.. శివాజీపై మండిపడ్డ నాగబాబు!

తాజాగా శివాజీ కామెంట్స్ ఇష్యూపై నటుడు, జనసేన నేత నాగబాబు స్పందించారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో లాంగ్ వీడియో షేర్ చేశారు.

By:  M Prashanth   |   27 Dec 2025 12:45 PM IST
ముదురుతున్న వివాదం.. శివాజీపై మండిపడ్డ నాగబాబు!
X

టాలీవుడ్ నటుడు శివాజీ.. హీరోయిన్స్ వస్త్రధారణ గురించి ఇటీవల చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆ వివాదం ఇంకా ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు స్పందిస్తూ తమ ఒపీనియన్ ను చెబుతున్నారు. కొందరు శివాజీకి సపోర్ట్ గా నిలుస్తుంటే.. మరికొందరేమో ఖండిస్తున్నారు.

తాజాగా శివాజీ కామెంట్స్ ఇష్యూపై నటుడు, జనసేన నేత నాగబాబు స్పందించారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో లాంగ్ వీడియో షేర్ చేశారు. "వస్త్రధారణ స్త్రీల వ్యక్తిగత హక్కు. దేశంలో మోరల్ పోలీసింగ్ రాజ్యాంగ విరుద్ధం. స్వేచ్ఛ, గౌరవం, గోప్యత, సమానత్వం వంటి మౌలిక హక్కులు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21 కింద హరించేస్తుందని కోర్టులు పునరావృతంగా తీర్పులు ఇచ్చాయి" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

"నేను దీనిపై రాజకీయ నాయకుడిగా గానీ, సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడిగా గానీ మాట్లాడటం లేదు. ఒక సామాన్య వ్యక్తిగా నా మనసులో ఉన్న మాటలను వీడియో ద్వారా చెబుతున్నా. ఇందులో శివాజీని టార్గెట్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. అయినా ఎవరైనా అలా భావిస్తే నేను ఏం చేయలేను" అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు.

ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే విషయాలపై ప్రతి ఒక్కరూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానించడం సరైంది కాదని నాగబాబు అభిప్రాయపడ్డారు. "ఆడవాళ్లు ఇలాంటి దుస్తులే వేసుకోవాలి అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. అలాంటి వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం" అని అన్నారు.

"ప్రతి మహిళకు ఆత్మగౌరవం ఉంటుంది. ప్రపంచంలో ఫ్యాషన్ కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలి" అని కోరారు. మహిళలను కుటుంబ సభ్యుల్లాగే గౌరవంగా చూడాలని నాగబాబు సూచించారు. "ప్రతి ఆడపిల్లను మీ ఇంట్లోని ఆడవారిలాగా చూడండి. మహిళలకు కూడా మగవారితో సమానంగా జీవించే హక్కు ఉంది. ఆ హక్కును ఎవ్వరూ కాలరాయలేరు" అని ఆయన స్పష్టం చేశారు.

అదే సమయంలో మహిళల భద్రతపై కూడా నాగబాబు మాట్లాడారు. ఆత్మరక్షణ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోవాలని ఆడపిల్లలకు సూచించారు. "మీరు ఎలాంటి దుస్తులైనా ధరించండి. కానీ బయటకు వెళ్ళేటప్పుడు మీ భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. నేను మగ వాళ్లందరినీ తప్పుపట్టడం లేదు. కొందరు మాత్రమే మహిళలను అవమానించే విధంగా ప్రవర్తిస్తున్నారు" అని చెప్పారు.

మహిళలను అవమానించిన వారు ఎప్పుడూ బాగుపడిన దాఖలాలు లేవని నాగబాబు హెచ్చరించారు. మహిళలకు తాను లాంటి వారు ఎప్పుడూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై స్పందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మహిళల గౌరవాన్ని కాపాడటం మన సమాజానికి అవసరమని నాగబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.