యష్ ఎదుగుదలపై కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ ఎమోషనల్ స్పీచ్!
ట్రైలర్ గురించి శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ``ఇందులో ప్రదర్శించిన విజువల్స్, షాట్స్ , మేకింగ్ క్వాలిటీ ఫెంటాస్టిక్.. సూపర్బ్ అండ్ మైండ్ బ్లోయింగ్`` అని ఆకాశానికెత్తారు.
By: Sivaji Kontham | 9 Aug 2026 10:23 AM ISTసహజంగానే సాటి నటుడు ఎదుగుతుంటే కాలు పట్టుకు లాగాలనే మనస్తత్వాలే ఎక్కువ. కానీ అందుకు భిన్నమైన వ్యక్తిత్వం శివన్నది. శివరాజ్ కుమార్ అలియాస్ శివన్న కన్నడ పరిశ్రమలో లెజెండరీ నటుడు శివరాజ్ కుమార్ వారసుడుగా సినీరంగ ప్రవేశం చేసి అగ్ర హీరోగా ఎదిగి.. నేపోటిజంతో సంబంధం లేని తన సహనటులను ప్రోత్సహించడంలోను ఎప్పుడూ ముందున్నారు. ఈరోజు యష్ లాంటి ఒక సాధారణ డ్రైవర్ కుమారుడు కన్నడ సినీరంగం నుంచి పాన్ ఇండియా రేంజుకు ఎదుగుతుంటే అతడు ఇచ్చిన ప్రోత్సాహం అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది. టాక్సిక్ ప్రచార వేదికపై శివరాజ్ కుమార్ తన తమ్ముడు యష్ అంటూ అతడి ఎదుగుదలను కీర్తించిన తీరు మనసుల్ని గెలుచుకుంది.
కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ `టాక్సిక్` ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బెంగళూరులో ఎంతో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన శాండల్‌వుడ్ కరుణాడ చక్రవర్తి, సీనియర్ నటుడు డాక్టర్ శివరాజ్‌కుమార్ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదికపైకి రాగానే ప్రేక్షకుల వైపు చూస్తూ `ట్రైలర్ ఎలా ఉంది?` అని అడుగుతూ ఆయన నింపిన జోష్ ఈవెంట్ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది.
ట్రైలర్ గురించి శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ``ఇందులో ప్రదర్శించిన విజువల్స్, షాట్స్ , మేకింగ్ క్వాలిటీ ఫెంటాస్టిక్.. సూపర్బ్ అండ్ మైండ్ బ్లోయింగ్`` అని ఆకాశానికెత్తారు. పక్కా వింటేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో గీతూ మోహన్ దాస్ షాట్ మేకింగ్ అద్భుతంగా ఉందన్నారు. ప్రతీ సీన్‌ను ఎంతో క్వాలిటీతో తెరకెక్కించిన విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని కొనియాడారు.
యష్ అంతర్జాతీయ స్థాయిలో సాధించిన విజయాలు .. ఎదుగుదలపై శివరాజ్‌కుమార్ ఎంతో గర్వాన్ని వ్యక్తం చేశారు. ఒక కన్నడిగుడిగా యష్ ఈ స్థాయికి చేరుకోవడం తమ పరిశ్రమ మొత్తానికి ఎంతో గర్వకారణమని చెప్పారు. యష్ కష్టపడే తత్వమే ఆయనను ఈ రోజు ఈ స్థానంలో నిలబెట్టిందని.. ఈ విజయం చూసి తామంతా ఎంతో సంతోషిస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా యష్‌తో ఉన్న బంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. నా సొంత తమ్ముడు ఇంత పెద్ద విజయాన్ని సాధిస్తే నాకు ఎంత ఆనందం కలుగుతుందో.. యష్ సినిమా చూస్తుంటే నాకు అంతటి సంతోషం, సంతృప్తి కలిగింది! అని హృదయాలను హత్తుకునే వ్యాఖ్యలు చేసారు. అలాగే ట్రైలర్‌లో యష్ చెప్పిన ``ఇట్స్ టైమ్.. ఐ యామ్ కమింగ్`` అనే పవర్‌ఫుల్ డైలాగ్‌ను వేదికపై రీక్రియేట్ చేస్తూ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించారు.
యష్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని... దేవుడి ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించారు. కథానాయిక నయనతారతో పాటు చిత్ర దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ .. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాతలకు శివరాజ్‌కుమార్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చూపించిన ప్రేమాభిమానాలు - పవర్‌ఫుల్ స్పీచ్‌తో ఈవెంట్ అత్యంత ఘనంగా ముగిసింది.
