Begin typing your search above and press return to search.

వరుసగా సీనియర్ హీరోలనే టార్గెట్ చేస్తున్న శివ

ఒకప్పుడు ప్రేమకథలతో యంగ్ హీరోలను మెప్పించిన దర్శకుడు శివ నిర్వాణ, ఇప్పుడు సీనియర్ స్టార్ల వైపు వెళ్తున్నారు.

By:  M Prashanth   |   28 Oct 2026 12:10 PM IST
వరుసగా సీనియర్ హీరోలనే టార్గెట్ చేస్తున్న శివ
X

ఒకప్పుడు ప్రేమకథలతో యంగ్ హీరోలను మెప్పించిన దర్శకుడు శివ నిర్వాణ, ఇప్పుడు సీనియర్ స్టార్ల వైపు వెళ్తున్నారు. శివ కెరీర్ చూస్తే ఈ మార్పు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. నానితో 'నిన్ను కోరి', 'టక్ జగదీష్', నాగచైతన్యతో 'మజిలీ', విజయ్ దేవరకొండతో 'ఖుషి' చిత్రాలు చేశారు. ఈ సినిమాల్లో ప్రేమ, కుటుంబ బంధాల చుట్టూ కథలు నడిపించారు. ఇప్పుడు మాత్రం హీరో వయసుకు తగ్గ ఎమోషన్‌తో పాటు మాస్‌ను కలిపే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఆయన తర్వాతి సినిమా ఎవరితో ఉంటుందనేది ఆసక్తి పెంచుతోంది.

రవితేజతో చేసిన 'ఇరుముడి' ఈ మార్పుకు బలమైన కారణం. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న హీరోను అయ్యప్ప భక్తుడిగా చూపించారు. తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని కథకు ప్రధాన బలంగా మార్చారు. సినిమా భారీ విజయం సాధించడంతో శివకు కొత్త అవకాశాలు వస్తున్నాయి. స్టార్ ఇమేజ్ కోసం అనవసరమైన ఎలివేషన్లు పెట్టకుండా కథను నమ్ముకున్నానని దర్శకుడు కూడా చెప్పారు.

ఆ విజయం తర్వాత చిరంజీవితో శివ సినిమా చేస్తారనే ప్రచారం మొదలైంది. మెగాస్టార్‌కు మాస్ ఇమేజ్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాలను పండించే అనుభవం ఉంది. ఆ బలాన్ని ఉపయోగించుకునే కథ దొరికితే కాంబినేషన్ ఆసక్తికరంగా ఉంటుంది. అయితే వీరి మధ్య సినిమా ఖరారైందని ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. చిరంజీవి ఇప్పటికే ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కానీ మంచి కథ సెట్టయితే మెగాస్టార్ శివకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది.

ఇప్పుడు బాలకృష్ణ పేరు కూడా వినిపిస్తోంది. 'దాదా' షూటింగ్ జరుగుతున్న మైసూరులో శివ వెళ్లి బాలయ్యను కలిశారనే టాక్ బయటకు వచ్చింది. ఒక కథాంశం చెప్పగా పూర్తి కథ వినిపించాలని బాలయ్య కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక చిరు, బాలయ్య సినిమాల దగ్గర శివకు అసలైన పరీక్ష కథతోనే ఉంటుంది. రవితేజను ప్రేక్షకులు ఒక తరహా పాత్రల్లో చూసి అలవాటుపడ్డారు. 'ఇరుముడి'లో ఆ ఇమేజ్‌ను మార్చి విజయం సాధించారు.

కానీ చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో అభిమానుల అంచనాలు మరోలా ఉంటాయి. వారి మార్క్ సన్నివేశాలను పూర్తిగా వదిలేయకుండా, మాస్ కలర్ ను కథలో కలపగలిగితేనే ఈ ప్రయత్నం పనిచేస్తుంది. మరోవైపు బాలయ్య ఇప్పటికే కొరటాల శివ సినిమాకు కమిట్ అయ్యారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో చేస్తున్న 'దాదా' డిసెంబర్ 24న విడుదల కానుంది. కాబట్టి శివ నిర్వాణతో సినిమా కుదిరినా వెంటనే సెట్స్‌పైకి వెళ్లే పరిస్థితి ఉండకపోవచ్చు. శివకు షైన్ స్క్రీన్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలతో కూడా కమిట్‌మెంట్స్ ఉన్నాయి. మరి ముందుగా ఏ బ్యానర్‌లో, ఏ హీరోతో సినిమా మొదలవుతుందనేది చూడాలి.