రవితేజ కూతురు కథ వినలేక..
దానికి శివ సమాధానమిస్తూ.. ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు మనకు అవార్డులు, చాలా గొప్ప పేరు తీసుకువస్తాయని, కానీ కమర్షియల్ గా వర్కవుట్ అవ్వవని అన్నారు.
By: M Prashanth | 25 Aug 2026 9:42 AM ISTమాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన 'ఇరుముడి' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరూ చూస్తూనే ఉన్నారు. కేవలం మాస్ ఆడియన్స్ మాత్రమే కాకుండా ఫ్యామిలీస్ అంతా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ ఒక గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ వేదికపై దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ కొన్ని ఎమోషనల్ విషయాలను పంచుకున్నారు. సినిమా వసూళ్లు చూసి నిర్మాతలు ఎలా ఫీల్ అయ్యారో అనే విషయాన్ని వివరించారు.
సినిమా రిలీజ్ అయిన తర్వాత సోమవారం ఉదయం నిర్మాత నవీన్ తనకు కాల్ చేశారని శివ చెప్పారు. ఫోన్ చేయగానే.. ఏంటి శివ ఈ సినిమా, నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటిది చూడలేదు అని ఆశ్చర్యపోయారట. ఒక వర్కింగ్ డే రోజు ఉదయం పూట గంటల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో టికెట్లు బుక్ అవ్వడం చూసి నవీన్ షాక్ అయ్యారని డైరెక్టర్ గుర్తుచేసుకున్నారు. ఎక్కడ చూసినా థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు పడటం ఆయనకు చాలా కొత్తగా అనిపించిందని చెప్పారు.
దానికి శివ సమాధానమిస్తూ.. ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు మనకు అవార్డులు, చాలా గొప్ప పేరు తీసుకువస్తాయని, కానీ కమర్షియల్ గా వర్కవుట్ అవ్వవని అన్నారు. ఇంకొన్ని సినిమాలు విపరీతమైన డబ్బులు తెచ్చిపెడతాయి, కానీ రెండు రోజుల తర్వాత అది రొటీన్ ఫార్ములా సినిమానే కదా అని జనాలు తీసిపారేస్తారని చెప్పారు. కానీ మన 'ఇరుముడి' సినిమా మాత్రం అటు గౌరవం, ఇటు డబ్బులు రెండూ ఇస్తుందని తాను నవీన్ కి చెప్పానని శివ క్లారిటీ ఇచ్చారు. ఒక సినిమా ప్రపంచానికి ఎంత ఇవ్వాలో అంతా ఇచ్చేసిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
అలాగే రవితేజ కూతురు మోక్ష ఈ కథ వినడానికి ఆఫీస్ కు వచ్చినప్పుడు, ఆమెకు కథలో ఉన్న డెప్త్ అర్థమవుతుందా లేదా అనే చిన్న డౌట్ తనకు ఉండేదట. ఆమె ఒక మోడ్రన్ అప్రోచ్ ఉన్న అమ్మాయి అని, ఈ ఎమోషన్స్ కు, తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ కు ఎలా కనెక్ట్ అవుతుందని తాను కొంచెం ఆలోచించానని డైరెక్టర్ చెప్పారు.
కానీ ఆఫీస్ లో ఆమెను కూర్చోబెట్టి కథ చెప్పడం మొదలుపెట్టగానే వాతావరణం పూర్తిగా మారిపోయిందని అన్నారు. తాను కథ చెబుతున్నప్పుడు పక్కనుంచి చిన్నగా ఏడుపు సౌండ్ వినిపించిందని, చూస్తే మోక్ష కథలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకుందని చెప్పారు. ఆ స్టోరీ వింటున్నప్పుడు ఆమె తన సొంత తండ్రిని ఆ పాత్రలో ఊహించుకుని బాగా ఎమోషనల్ అయిందని శివ తన స్పీచ్ లో చాలా డీటెయిల్ గా వివరించారు.
కథలో సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి ఆ ఎమోషన్ తట్టుకోలేక మోక్ష చేతులు పట్టుకుని "సార్ ఆపండి, ఈ సీన్స్ నేను థియేటర్ లో చూడలేను" అని చెప్పిందని ఆయన పంచుకున్నారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆమె కనీసం ఎడిటింగ్ రూమ్ వైపు కూడా రాలేదని, ఆ ఒక్క సంఘటనతోనే తన కథలో ఎంత బలం ఉందో తనకు పూర్తిగా అర్థమైందని డైరెక్టర్ శివ నిర్వాణ గర్వంగా చెప్పారు. ఆరోజు మోక్ష ఫీల్ అయిన అదే ఎమోషన్ ఈరోజు థియేటర్లలో కోట్లాది మంది ప్రేక్షకులను కదిలిస్తోందని ఆయన క్లారిటీ ఇచ్చారు.
