మారేడుమిల్లి- సీలేరు టూరిజానికి టాలీవుడ్ బిగ్ బూస్ట్!
ఒక సినిమా షూటింగ్ ఒక ప్రాంతంలో జరిగితే.. ఆ లొకేషన్‌కి ప్రపంచవ్యాప్తంగా లభించే గుర్తింపు అపారమైనది.
By: Sivaji Kontham | 21 Aug 2026 9:20 AM ISTఒక సినిమా షూటింగ్ ఒక ప్రాంతంలో జరిగితే.. ఆ లొకేషన్‌కి ప్రపంచవ్యాప్తంగా లభించే గుర్తింపు అపారమైనది. టాలీవుడ్ యంగ్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా లొకేషన్లు- టూరిజం డెవలప్‌మెంట్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రవితేజ హీరోగా తెరకెక్కిన `ఇరుముడి` చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు, పొల్లూరు, డొంకరాయ, చింతూరు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు 35 రోజుల పాటు షూట్ చేశామని.. నాచురల్ లొకేషన్లలో షూటింగ్ చేయడం వల్ల కథకు సరికొత్త జీవం వచ్చిందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప` సినిమాను ఉదాహరణగా చెప్పారు. `పుష్ప` చిత్రం విడుదలైన తర్వాత మారేడుమిల్లి అడవులు ఎంత పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఆ ఒక్క సినిమాతో మారేడుమిల్లికి పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగి అక్కడి స్థానిక టూరిజం రూపురేఖలే మారిపోయాయి. ఒక చిత్రయూనిట్ అడుగుపెడితే చాలు.. ఆ ప్రాంతం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందనడానికి మారేడుమిల్లే నిదర్శనం. పుష్ప సినిమా కంటే ముందే మారేడుమిల్లి టూరిస్ట్ స్పాట్ గా పాపులరైనా కానీ పుష్ప సినిమా ఇచ్చిన బూస్ట్ చాలారెట్లు పెద్దది.
అదే రీతిలో `ఇరుముడి` చిత్రం ద్వారా `సీలేరు`ప్రాంతం కూడా మారేడుమిల్లి తరహాలోనే అత్యంత పాపులర్ లొకేషన్‌గా మారుతుందని శివ నిర్వాణ ధీమా వ్యక్తం చేశారు. కేరళ, పొల్లాచ్చి వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన దగ్గరున్న అద్భుతమైన సీలేరు అందాలను నవతరం దర్శకులు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. చుట్టూ దట్టమైన అడవులు, డ్యామ్‌లు, పొగమంచుతో నిండి ఉండే సీలేరు ప్రకృతి రమణీయత సినిమాల ద్వారా వెలుగులోకి రావడం స్థానిక టూరిజం రంగానికి ఎంతో బూస్టింగ్‌గా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. సీలేరు ఇప్పటికే పర్యాటక ప్రాంతం.. కానీ సినిమా షూటింగ్ తో పెరిగే ఇమేజ్ వేరేగా ఉంటుదనేది శివ నిర్వాణ అభిప్రాయం.
అయితే మన తూర్పు కనుమల్లో వెలుగులోకి రావాల్సిన.. పాపులర్ చేయాల్సిన అందమైన లొకేషన్లు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే అరకు, లంబసింగి వంటి ప్రాంతాలు పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. కానీ వాటితో పాటు తాండవ డ్యామ్.. చమ్మచింత, అడాకుల, కిష్టవరం, బాలవరం హిల్ ఏరియాలు.. కేడీపేట ఘాట్ రోడ్లు.. నర్సీపట్నం లూప్ ఏజెన్సీలతో పాటు అనేక కొండ ప్రాంతాలు ఇంకా సరైన ప్రచారానికి దూరంగానే ఉన్నాయి. మన దర్శకులు వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తే ఈ ప్రకృతి అందాలు వెండితెరపై మరింత ఆకర్షణీయంగా ఆవిష్కృతమవుతాయి. ఒక పెద్ద సినిమా షూటింగ్ తో ఇలాంటి లూప్ ఏరియాలకు ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఏపీ టూరిజం విభాగానికి బూస్ట్ ఇవ్వడంలో సినీ పరిశ్రమ పాత్ర అత్యంత కీలకమైనది. షూటింగ్‌ల పేరుతో చిత్రబృందాలు లొకేషన్‌లోకి దిగితే.. ఆటోమేటిక్‌గా ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా ద్వారా ఆ ప్రదేశాలు ప్రజల్లోకి వెళ్తాయి. ఆ తర్వాత పర్యాటకులు అక్కడికి క్యూ కట్టడం వల్ల స్థానికులకు ఉపాధి పెరగడమే కాకుండా రాష్ట్ర టూరిజం ఆదాయం కూడా పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం రంగాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టడానికి మన సినిమా వాళ్లు మరిన్ని కొత్త లొకేషన్లను అన్వేషిస్తూ తమ వంతు సహాయం అందిస్తారని ఆశిద్దాం.
