శివ రీరిలీజ్ ట్రైలర్.. గూస్‌బంప్స్ గ్యారెంటీ!
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులు సృష్టించింది.
By: Sravani Lakshmi Srungarapu | 4 Nov 2025 6:32 PM ISTటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్లో కల్ట్ క్లాసిక్ మూవీ శివ. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులు సృష్టించింది. ఎవర్ గ్రీన్ ఫిల్మ్ గా నిలిచిపోయిన ఈ సినిమా అప్పటివరకు ఓ మూస ధోరణిలో వెళ్తున్న ఇండస్ట్రీకి సరికొత్త బాటలు వేసింది. శివ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఎన్నో మార్పులొచ్చాయి
ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన శివ
దర్శకులు సినిమా తీసే విధానాన్ని, ఆడియన్స్ సినిమా చూసే విధానాన్ని శివ మూవీ పూర్తిగా మార్చేసింది. అందుకే తెలుగు మూవీ గురించి మాట్లాడాల్సి వస్తే ఇప్పటికీ శివకు ముందు, శివకు తర్వాత అని అంటుంటారు. అంతటి ట్రెండ్ సెట్టర్ మూవీ ఇప్పుడు మరోసారి థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. 1989లో రిలీజైన ఈ మూవీ ఇప్పుడు 4కె ఫార్మాట్ రిలీజ్ కావడానికి ముస్తాబవుతుంది.
నవంబర్ 14న శివ రీరిలీజ్
శివ మూవీని రీరిలీజ్ చేయమని ఫ్యాన్స్ ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ అది కుదరలేదు. టాలీవుడ్ లో ఏ సినిమా రీరిలీజైనా శివ రీరిలీజ్ ఎప్పుడని ప్రశ్నించేవారు అభిమానులు. వాస్తవానికి అటు నాగ్, ఇటు ఆర్జీవీ కూడా ఎప్పట్నుంచో ఈ మూవీని రీరిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వీలవలేదు. కొన్ని నెలలుగా శివ మూవీని రీమాస్టరింగ్ చేస్తున్న చిత్ర యూనిట్ నవంబర్ 14న దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఈ రీరిలీజ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను నార్మల్ ట్రైలర్ లాగా కాకుండా ముందుగా టాలీవుడ్ లోని కొందరు సెలబ్రిటీల వీడియో బైట్స్ తో మొదలుపెట్టారు. శివ గురించి ఆ సెలబ్రిటీలు చెప్పిన గొప్ప మాటలను ట్రైలర్ కు జోడించి దాన్ని మరింత స్పెషల్ గా మార్చగా, ఈసారి శివ 4కె అట్మాస్ లో రీరిలీజ్ కానున్నట్టు క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
