Begin typing your search above and press return to search.

'శివ' 4కె ప‌బ్లిక్ టాక్ అదీ సంగ‌తి

ఈ సినిమాని థియేట‌ర్ల‌లో కంటే టీవీలు, యూట్యూబ్ స‌హా ఇత‌ర‌త్రా డిజిట‌ల్ మాధ్య‌మాల‌లో యువ‌త‌రం ఎక్కువ‌గా వీక్షించారు.

By:  Sivaji Kontham   |   11 Nov 2025 9:09 PM IST
శివ 4కె ప‌బ్లిక్ టాక్ అదీ సంగ‌తి
X

నాగార్జున క‌థానాయ‌కుడిగా, రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన `శివ‌` క‌ల్ట్ క్లాసిక్‌గా భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే. న‌టీన‌టుల మ్యాజిక్ తో పాటు, ఇళ‌య‌రాజా మ్యూజిక్, ఎస్.గోపాల్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ, తోట త‌ర‌ణి ప్రొడ‌క్ష‌న్ డిజైన్, ఎడిటింగ్, స్టంట్స్ ఇలా అన్ని విభాగాల్లో ఇది ఒక అద్భుత‌మైన అనుభ‌వం.

అప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి సినిమా చూసిన అనుభవం ప్రేక్ష‌కుల‌కు లేదు. ఇది స‌రికొత్త అనుభూతిని ఇచ్చిన సినిమా. ముఖ్యంగా ఆర్జీవీ ఈ సినిమా క‌థ‌, క‌థ‌నాన్ని, పాత్ర‌ల్ని ఎలివేట్ చేసిన తీరుకు ప్రేక్ష‌కులు గొప్ప అనుభూతికి లోన‌య్యారు. అలాగే సౌండ్ ని స‌ద్వినియోగం చేయ‌డంలో ఆర్జీవీ టెక్నిక్ గురించి కొన్నేళ్ల పాటు చ‌ర్చ సాగింది. ప్ర‌తి పాత్ర‌ను అత‌డు ప్రాధాన్య‌త‌తో రూపొందించిన విధానం ఎవ‌ర్ గ్రీన్ చిత్రంగా నిల‌బెట్టింది. ఇది ఎప్ప‌టికీ ఫిలింమేకింగ్ విద్యార్థుల‌కు ఒక అద్భుత‌మైన పాఠం.

అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ఎస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నాగార్జున అక్కినేని, అమల, రఘువరన్, తనికెళ్ల భరణి, జితేంద్ర, మురళీ మోహన్, కోట శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతీ రావు, సాయి చంద్, శుభలేఖ సుధాకర్, జెడి చక్రవర్తి, ఉత్తేజ్ లాంటి దిగ్గ‌జ న‌టులు త‌మ పాత్ర‌ల‌కు ప్రాణం పోసారు.

ఈ సినిమాని థియేట‌ర్ల‌లో కంటే టీవీలు, యూట్యూబ్ స‌హా ఇత‌ర‌త్రా డిజిట‌ల్ మాధ్య‌మాల‌లో యువ‌త‌రం ఎక్కువ‌గా వీక్షించారు. 90ల‌లో అద్భుత‌మైన సినిమాల‌లో ఒక‌టిగా నిలిచిన శివ చిత్రాన్ని నేటి యూత్ యూట్యూబ్ లో ఎక్కువ‌గా వీక్షించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని షార్ప్ ఎడిటింగ్, మెరుగు ప‌రిచిన సౌండింగ్ తో 4కే రీమాస్ట‌ర్ వెర్ష‌న్ ని రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. `శివ 4కే` వెర్ష‌న్ కి స్పంద‌న ఎలా ఉంది? అన్న‌ది ప‌రిశీలిస్తే..

మేటి క్లాసిక్ చిత్రం 4కేలో గొప్ప అనుభూతిని క‌లిగిస్తోంద‌ని ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. నాగార్జున సైకిల్ చైన్ లాగే స‌న్నివేశంలోనే కాదు, ప్ర‌తి స‌న్నివేశంలోను మ్యాజిక‌ల్ గా క‌నిపించార‌ని అభిమానులు ప్రశంసిస్తున్నారు. డాల్బీలో మెరుగు ప‌రిచిన సౌండ్ టెక్నిక్ , క‌ల‌ర్ గ్రేడింగ్ తో మ‌రో అద్భుతంలా క‌నిపించింద‌ని ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు.

కాలేజ్ క్యాంప‌స్ రాజ‌కీయాల నుంచి వీధుల్లో గూండాయిజం వ‌ర‌కూ ఎంతో అద్భుతంగా ఆవిష్క‌రించిన ఈ చిత్రానికి బ్రూస్ లీ `రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్` (1972) నుండి స్ఫూర్తి పొందాన‌ని ఆర్జీవీ ఇంత‌కుముందు ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

విదేశీ రెస్టారెంట్ సీన్ ని ఇక్క‌డ క్యాంప‌స్ ఫైట్ సీన్ల‌కు ముడి పెట్టాన‌ని చెప్పారు ఆర్జీవీ. గూండారాజ్ వ్య‌వ‌స్థ‌లో అత్యంత ధైర్య‌వంత‌మైన యువ‌కుడి క‌థ‌ను తెర‌పై అద్భుతంగా ఆవిష్క‌రించిన ఆర్జీవీ తాను ప్ర‌త్య‌క్షంగా చూసిన విద్యార్థి రాజ‌కీయాలు, గూండాయిజం ఆస‌రాగా ఈ సీన్ల‌ను చూపించాన‌ని అన్నారు.

ఒక క‌థ‌ను వినూత్నంగా ఎలా చెప్పాలి? ఏ శ‌బ్ధాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆర్జీవీకి తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలీదేమో! అందుకే ఈ సినిమా ఇప్పుడు థియేట‌ర్ల‌లో మ‌రోసారి ప్ర‌జ‌ల‌ మ‌న‌సుల్ని గెలుచుకుంటోంద‌ని చాలా మంది ప్ర‌శంసిస్తున్నారు. ముఖ్యంగా ఆర్.ఆర్ మ‌రో లెవ‌ల్ లో కుదిరింద‌ని చాలా మంది ప్ర‌శంసిస్తున్నారు. మొద‌టి సారి చూస్తున్నామా? అనిపించేంత‌గా ఈ 4 కే రీమాస్ట‌ర్ వెర్ష‌న్ మ్యాజిక్ చేస్తోంద‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

డాల్బీ అట్మాస్ సౌండింగ్.. . కలర్ గ్రేడింగ్ సినిమా వీక్ష‌ణ అనుభ‌వాన్ని చాలా ఉత్త‌మంగా మార్చాయ‌ని చెబుతున్నారు. దాదాపు మూడున్న‌ర ద‌శాబ్ధాల పాటు ఎన్నోసార్లు చూసేసిన ఈ సినిమాని మ‌రోసారి చూస్తున్నా ఎక్క‌డ బోర్ కొట్ట‌లేద‌ని చెబుతున్నారు. ఇళయరాజా సంగీతంలో అడ్వాన్స్ డ్ టెక్నిక్ ఇప్ప‌టికీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. పాట‌ల్ని కొంత‌వ‌ర‌కూ ట్రిమ్ చేసి సినిమా న‌డ‌త వేగాన్ని పెంచారు. మొద‌టిసారి ఈ సినిమాని చూసే వీక్ష‌కుల‌కు అయినా, ప‌దే ప‌దే చూసేసిన వారికి అయినా ఇది మ‌రో కొత్త సినిమా అన్న అనుభూతిని క‌లిగిస్తోంద‌ని ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.