Begin typing your search above and press return to search.

టికెట్ ధరలు పెంచం.. ప్రేక్షకులకు శిరీష్ రెడ్డి భరోసా!

మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్‌లో నిర్మాత శిరీష్ రెడ్డి పాల్గొని పలు కీలక విషయాలను వెల్లడించారు.

By:  M Prashanth   |   13 May 2026 10:15 AM IST
టికెట్ ధరలు పెంచం.. ప్రేక్షకులకు శిరీష్ రెడ్డి భరోసా!
X

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితిపై ఎగ్జిబిటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా థియేటర్ల నిర్వహణ కష్టతరంగా మారిందని, వ్యవస్థను కాపాడుకోవడానికి తక్షణమే పర్సంటేజీ షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని వారు కోరుతున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్‌లో నిర్మాత శిరీష్ రెడ్డి పాల్గొని పలు కీలక విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా టికెట్ ధరల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇకపై సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా టికెట్ ధరలను పెంచే ఆలోచన లేదని శిరీష్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతినిచ్చే జీవో వచ్చినా సరే, తాము రేట్లు పెంచబోమని ఆయన ప్రేక్షకులకు హామీ ఇచ్చారు. సాధారణ ప్రేక్షకులపై భారం పడకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

సింగిల్ స్క్రీన్లకు వచ్చే ఆడియన్స్ ఎక్కువగా మధ్యతరగతి వారే ఉంటారని, వారిని థియేటర్లకు రప్పించాలంటే అనువైన ధరలకే టికెట్లు అందుబాటులో ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న సమస్యలు కేవలం టికెట్ ధరలతో ముడిపడి లేవని, సిస్టమ్ లోనే మార్పు రావాలని శిరీష్ రెడ్డి పేర్కొన్నారు. థియేటర్ల నిర్వహణకు అయ్యే ఖర్చులు పెరిగాయని, పాత రెంటల్ విధానం వల్ల థియేటర్ యజమానులు నష్టపోతున్నారని ఆయన వివరించారు.

అందుకే మల్టీప్లెక్స్ ల తరహాలో సింగిల్ స్క్రీన్లలో కూడా పర్సంటేజీ విధానం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఎవరినో ఇబ్బంది పెట్టడానికి కాదని, కేవలం సింగిల్ స్క్రీన్ల మనుగడ కోసమేనని ఆయన స్పష్టం చేశారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ శిరీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థియేటర్లు నడవట్లేదని ఒక నిర్మాతతో అంటే, "వర్కౌట్ కాకపోతే మూసుకోండి" అని సలహా ఇచ్చాడట.

చిత్రమేమిటంటే, ఆ మాట అన్న వ్యక్తే ఇప్పుడు పరిశ్రమలో లేరని శిరీష్ గుర్తు చేశారు. సినిమా అనేది అందరికీ సంబంధించిన వ్యాపారమని, హీరోలకి రెమ్యూనరేషన్ అడిగే హక్కు, నిర్మాతలకు సినిమాను అమ్ముకునే హక్కు ఉన్నప్పుడు.. కోట్లు ఖర్చు పెట్టి థియేటర్ కట్టిన ఎగ్జిబిటర్లకు కూడా తమ వాటా అడిగే హక్కు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. చాలా రోజుల తరువాత సింగిల్ స్క్రీన్ థియేటర్ల భవిష్యత్తు కోసం ఎగ్జిబిటర్లు అందరూ ఏకతాటిపైకి వచ్చారు.

టికెట్ రేట్లు పెంచకుండానే, పర్సంటేజీ విధానం ద్వారా లాభాలను పంచుకోవాలనేది వారి ప్రధాన డిమాండ్. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు, నిర్మాతలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సహకరించాలని శిరీష్ రెడ్డి కోరారు. త్వరలోనే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని, తద్వారా ప్రేక్షకులు, థియేటర్ యాజమాన్యాలు ఇద్దరూ లాభపడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శిరీష్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.