నిర్మాతల్ని వైట్ కాలర్ మాఫియాతో పోల్చిన నటి!
టెలివిజన్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో శిల్పా షిండే ఒకరు. `భాబీజీ ఘర్ పర్ హైన్` సీరియల్‌లో అంగూరీ భాబీ పాత్ర తో అమ్మడు దేశవ్యాప్తంగా ఎంతో పేమస్ అయింది.
By: Srikanth Kontham | 19 Jun 2026 11:00 PM ISTటెలివిజన్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో శిల్పా షిండే ఒకరు. `భాబీజీ ఘర్ పర్ హైన్` సీరియల్‌లో అంగూరీ భాబీ పాత్ర తో అమ్మడు దేశవ్యాప్తంగా ఎంతో పేమస్ అయింది. అయితే కెరీర్ పరంగా ఎంతటి గుర్తింపు తెచ్చుకున్నారో? వివాదాలు కూడా శిల్పను అదే స్థాయిలో చుట్టుముట్టాయి. తాజాగా టెలివిజన్ పరిశ్రమలోని అంతర్గత రాజకీయాలు - నిర్మాతల ప్రవర్తనపై శిల్పా షిండే చేసిన వ్యాఖ్యలు బుల్లితెర వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో శిల్పా షిండే టీవీ రంగంలోని కొంతమంది నిర్మాతల తీరును తీవ్రంగా ఎండగట్టారు.
టెలివిజన్ నిర్మాతలను అమ్మడు వైట్ కాలర్ మాఫియా గా అభివర్ణించారు. పరిశ్రమలో నటీనటుల హక్కులను కాలరాస్తూ వారిని తమ నియంత్రణలో ఉంచుకోవడానికి కొందరు నిర్మాతలు తీవ్రమైన ఒత్తిళ్లకు గురిచేస్తారని ఆరోపించారు. నటుడు లేదా నటి తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే? వారిని పరిశ్రమ నుండి దూరం పెట్టేలా కుట్రలు చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో `భాబీజీ ఘర్ పర్ హైన్` సీరియల్ నుండి వివాదాస్పద రీతిలో తప్పుకోవాల్సి వచ్చిన రోజులను ఈ సందర్భంగా శిల్పా గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ప్రొడక్షన్ హౌస్‌తో తలెత్తిన విభేదాల వల్ల తానెంతో మానసిక వేదనను అనుభవించానన్నారు.
నిర్మాతలు అన్యాయంగా ఆంక్షలు విధించారని.. కెరీర్‌ను దెబ్బతీయ డానికి ప్రయత్నించారని నేరుగానే విమర్శలు గుప్పించారు. ఈ సుదీర్ఘ పోరాటంలో తనతో పాటు పనిచేసిన తోటి నటీనటులు ఎవరూ తనకు మద్దతుగా నిలవకపోవడంపై శిల్పా షిండే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కష్టకాలంలో సహోద్యోగుల అండ లభిస్తుందని ఆశించానని, కానీ అందరూ వారి అవకాశాలు ఎక్కడ పోతాయోననే భయంతో మౌనంగా ఉండిపోయారని మండిపడ్డారు. పరిశ్రమలో నిజమైన స్నేహాలు ఉండవని.. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే చూస్తారని వ్యాఖ్యానించారు.
టీవీ పరిశ్రమలో పని గంటలు, వేతనాల చెల్లింపులు ,నటీనటుల భద్రతకు సంబంధించిన సమస్యలు చాలా కాలంగా నడుస్తున్నాయి. అయినప్పటికీ ప్రధాన నటీనటులు ఎవరూ నిర్మాతల భయంతో నోరు విప్పడానికి సాహ సించరు. ఇలాంటి పరిస్థితుల్లో శిల్పా షిండే వంటి పాపులర్ నటి ఇంత బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం, బుల్లితెరపై నటీనటులు ఎదుర్కొంటున్న కఠినమైన పని వాతావరణాన్ని ..అంతర్గత ఒత్తిళ్లను మరోసారి తెరపైకి తెచ్చింది. బిగ్ బాస్ విజేతగా నిలిచిన శిల్పా షిండే లొంగిపోని వ్యక్తిత్వానికి పేరుగాంచారు. కెరీర్ దెబ్బతిం టుందని తెలిసినా? తన గళాన్ని నొక్కేయకుండా పరిశ్రమలోని లోపాలను ఎత్తిచూపడం ఆమె ధైర్యానికి నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు. టెలివిజన్ రంగంలో వ్యవస్థాగత మార్పులు రావాల్సిన అవసరం ఉందని.. నటీనటుల శ్రమను దోపిడీ చేసే విధానానికి స్వస్తి పలకాలనే చర్చను ఈ పరిణామం మళ్లీ ఊపందుకునేలా చేస్తుంది.
