స్టార్ కపుల్‌పై లుకౌట్ నోటీస్.. దేశం వదిలి పోకుండా నిర్భందం!
భారత న్యాయవ్యవస్థలో `లుకౌట్ నోటీస్` ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ. దేశం వదిలి పారిపోయే మోసగాళ్లను చొక్కా కాలర్ పట్టుకుని ఆపేంత శక్తి ఈ చట్టానికి ఉంది
By: Sivaji Kontham | 2 Oct 2025 11:51 AM ISTభారత న్యాయవ్యవస్థలో `లుకౌట్ నోటీస్` ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ. దేశం వదిలి పారిపోయే మోసగాళ్లను చొక్కా కాలర్ పట్టుకుని ఆపేంత శక్తి ఈ చట్టానికి ఉంది. అందాల కథానాయిక, రియాలిటీ క్వీన్ శిల్పా శెట్టి- రాజ్ కుంద్రా కుటుంబ సమేతంగా థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేయగా, బాంబే హైకోర్టు అనుమతి నిరాకరించింది. స్టార్ కపుల్ కొన్ని నెలలుగా తీవ్రమైన ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసుల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. 60 కోట్ల మోసం కేసులో దర్యాప్తు సందర్భంగా ఇప్పుడు లుకౌట్ నోటీస్ జారీ అయింది. ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఇవోడబ్ల్యూ) జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్‌ను నిలిపివేయాలని కోరుతూ ఈ జంట కోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 2 - అక్టోబర్ 5 మధ్య ఫుకెట్‌లో ప్రయాణం, వసతి కోసం తాము ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసామని వారి న్యాయవాదులు బాంబే హైకోర్టులో వాదించారు. అయితే దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉందని పేర్కొంటూ హైకోర్టు వారి అభ్యర్థనను తోసిపుచ్చింది.
బెస్ట్ డీల్ టీవీ విస్తరణ నేపథ్యంలో అప్పు, పెట్టుబడుల పేరుతో దీపక్ కొఠారి అనే వ్యాపారి నుంచి సుమారు 60 కోట్లు పైగా వసూలు చేసిన శిల్పాశెట్టి- రాజ్ కుంద్రా అతడికి రిటర్నులు ఇవ్వడంలో విఫలమయ్యారు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించగా, ఆర్థిక నేరాల విభాగం కేసులను నమోదు చేసింది. ఈ కేసులో డబ్బును వారు వ్యక్తిగతంగా వినియోగించారని, దుర్వినియోగం చేసారని, హవాలా మార్గంలో తప్పు దారి పట్టించారని తీవ్రమైన అభియోగాలను మోపడంతో ఇప్పుడు వారిని కట్టడి చేసేందుకు కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నలుగురు నటీమణులు, నిర్మాణ సంస్థలతో అనుబంధంపైనా పోలీసులు ఆరా తీసారు. ఈ ఆరాల్లో బిపాషా బసు, నేహా ధూపియా, ఏక్తాకపూర్ పేర్లు కూడా వినిపించాయి.
ఓవైపు 60 కోట్ల మోసానికి సంబంధించిన విచారణ కొనసాగుతుండగానే, క్రిప్టోకరెన్సీ లావాదేవీలకు సంబంధించి రాజ్ కుంద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు సాగుతోంది. రూ. 150 కోట్లకు పైగా విలువైన 285 బిట్‌కాయిన్‌లను కుంద్రా దాచి పెట్టాడని ఈడీ ఆరోపించింది. క్రిప్టో స్కామ్ మాస్టర్‌మైండ్ అమిత్ భరద్వాజ్ నుండి ఈ కాయిన్ లను కుంద్రా అందుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు రాజ్ కుంద్రా తన ఐఫోన్ ని ధ్వంశం చేసాడని, ఉద్ధేశపూర్వకంగా అతడు సాక్ష్యాలు నాశనం చేసాడని కూడా ఈడీ ఆరోపించింది. ప్రస్తుతం దర్యాప్తు శరవేగంగా సాగుతోంది.
