శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం.. తప్పిన పెద్ద ముప్పు!
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బుధవారం రాత్రి చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమా పాట షూటింగ్ ముగించుకుని వస్తుండగా శంషాబాద్ సమీపంలో పండ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ ఆయన కారును వెనుక నుంచి ఢీకొట్టింది. కారు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ శేఖర్ మాస్టర్‌కు పెద్దగా గాయాలు కాలేదు. ఆయన క్షేమంగా ఉండటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
By: M Prashanth | 12 Nov 2026 12:21 PM ISTటాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు బాగా దెబ్బతిన్నప్పటికీ అదృష్టవశాత్తూ పెద్దగా గాయాలు కాలేదు. శేఖర్ మాస్టర్ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి.
బుధవారం రాత్రి చిరంజీవి నటిస్తున్న 'కాకా' సినిమాలోని ఓ పాట షూటింగ్ పూర్తి చేసుకుని శేఖర్ మాస్టర్ తిరుగు ప్రయాణమయ్యారు. శంషాబాద్ సమీపానికి చేరుకున్న సమయంలో పండ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ ఆయన కారును వెనుక నుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో కారు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతింది. అయితే శేఖర్ మాస్టర్‌కు పెద్దగా గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇక్కడ మరో విషయం కూడా ఉంది. సినిమాల్లోకి రాకముందు శేఖర్ మాస్టర్ విజయవాడలో పండ్ల వ్యాపారం చేసేవారు. ఇప్పుడు ఆయన ప్రయాణిస్తున్న కారును పండ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టడం యాదృచ్ఛికంగా జరిగింది. మరోవైపు శేఖర్ మాస్టర్ నిన్ననే స్వామి మాల ధరించినట్లు కూడా సమాచారం. శేఖర్ మాస్టర్ ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ కొరియోగ్రాఫర్లలో ఒకరు.
చిరంజీవితో గతంలోనూ పలు సినిమాలకు సాంగ్స్ కొరియోగ్రఫీ చేశారు. ముఖ్యంగా మెగాస్టార్ డ్యాన్స్ స్టైల్‌కు తగ్గట్టుగా పాటలను కంపోజ్ చేయడంలో శేఖర్ మాస్టర్‌కు మంచి పేరుంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కాకా' సినిమాలోని ఓ పాటకు కూడా కొరియోగ్రఫీ అందిస్తున్నారు. 'వాల్తేరు వీరయ్య' తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'కాకా'. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పాటల చిత్రీకరణతో పాటు మిగతా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా పాట షూటింగ్ ముగించుకుని వస్తుండగానే శేఖర్ మాస్టర్ ప్రమాదానికి గురయ్యారు. ఆయన క్షేమంగా ఉన్నారనే సమాచారం రావడంతో అభిమానులు ఊరట చెందారు.
