Begin typing your search above and press return to search.

షెహనాజ్ గిల్ మనసు RCBతోనే.. క్రికెట‌ర్ ఎంత ప‌ని చేసాడు!

దేవదత్ పడిక్కల్- షెహనాజ్ డేటింగ్ పుకార్లపై ఇప్పటివరకు ఇద్దరిలో ఎవరూ అధికారికంగా స్పందించలేదు.

By:  Sivaji Kontham   |   16 May 2026 12:00 AM IST
షెహనాజ్ గిల్ మనసు RCBతోనే.. క్రికెట‌ర్ ఎంత ప‌ని చేసాడు!
X

ప్రముఖ నటి, బిగ్ బాస్ ఫేమ్ షెహనాజ్ గిల్ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో వార్తల్లో నిలుస్తోంది. ఈ సీజన్‌లో ఈ పంజాబీ బ్యూటీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్‌లకు పదే పదే హాజరవుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆమె కేవలం క్రికెట్ అభిమానిగానే కాకుండా.. ఆర్‌సీబీ ఆటగాడు దేవదత్ పడిక్కల్‌తో డేటింగ్‌లో ఉందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఒక మ్యాచ్ సందర్భంగా తన ఫేవరెట్ ఆటగాళ్ల గురించి చెబుతూ, `నాకు విరాట్ అంటే ఇష్టం.. అలాగే దేవదత్ ఆట అంటే చాలా ఇష్టం`` అని వ్యాఖ్యానించడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది.

షెహనాజ్ గిల్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్‌సీబీ జెర్సీ ధరించిన ఫోటోలను షేర్ చేస్తూ, ``దిల్ ఆర్‌సీబీ మే హై`` (నా మనసు ఆర్‌సీబీలోనే ఉంది) అనే క్యాప్షన్ ఇచ్చారు. దీనికి తోడు జట్టు విజయం సాధించిన ప్రతిసారి ఈ భామ‌ గ్యాలరీలో ఉత్సాహంగా కేకలు వేస్తూ సందడి చేస్తోంది. తాజాగా గురువారం నాటి మ్యాచ్ ముగిసిన తర్వాత ``మజా ఆగయా`` అంటూ వీడియోను షేర్ చేయ‌గా, అది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. షెహ‌నాజ్ గిల్ మ్యాచ్‌కు వచ్చిన ప్రతిసారి ఆర్‌సీబీ గెలుస్తుండటంతో అభిమానులు త‌న‌ను జట్టుకు `లక్కీ గర్ల్` అని కితాబిచ్చేస్తున్నారు.

దేవదత్ పడిక్కల్- షెహనాజ్ డేటింగ్ పుకార్లపై ఇప్పటివరకు ఇద్దరిలో ఎవరూ అధికారికంగా స్పందించలేదు. అయితే మ్యాచ్‌లలో ఈ భామ‌ దేవదత్ ఆటకు చూపిస్తున్న మద్దతు చూస్తుంటే వీరి మధ్య ఏదో ఉందనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌సీబీ విజయాలను ఎంజాయ్ చేస్తూ షెహ‌నాజ్ పెడుతున్న పోస్టులు ఆన్‌లైన్ చాటింగ్‌ను మరింత వేడెక్కిస్తున్నాయి. కేవలం ఆటగాళ్ల పట్ల ఉన్న గౌరవమా లేక మరేదైనా ప్రత్యేక బంధమా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

షెహనాజ్ గిల్ కెరీర్ ప్రస్థానం పంజాబీ చిత్ర పరిశ్రమతో మొదలైంది. అయితే బిగ్ బాస్ సీజన్ 13 ద్వారా దేశవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ షోలో షెహ‌నాజ్ చూపించిన చలాకీతనం, అమాయకత్వం ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఆ తర్వాత బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ నటించిన `కిసీ కా భాయ్ కిసీ కీ జాన్` చిత్రంతో హిందీ తెరకు పరిచయమయ్యారు. పూజా హెగ్డే, వెంకటేష్ వంటి స్టార్లతో కలిసి నటించిన షెహ‌నాజ్ సౌత్ లోను తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు.

ఇటీవల భూమి పెడ్నేకర్, కుషా కపిల వంటి వారితో కలిసి `థాంక్యూ ఫర్ కమింగ్` అనే చిత్రంలో కూడా షెహ‌నాజ్ మెరిశారు. ఈ సినిమా 2023లో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే... మరోవైపు క్రికెట్ గ్రౌండ్‌లో సందడి చేస్తూ షెహనాజ్ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. దేవదత్ పడిక్కల్‌తో ఈ సినీతార‌కు ఉన్న అనుబంధంపై వస్తున్న వార్తలు నిజమో కాదో తేలాల్సి ఉన్నా త‌ను మాత్రం ప్రస్తుతానికి `ఆర్‌సీబీ` విజయాలను ఎంజాయ్ చేస్తూ ఫుల్ జోష్‌లో ఉంది.