ఏడు దశాబ్దాల నట ప్రస్థానం.. నలుగురు సీఎంలతో నటించిన మహానటి షావుకారు జానకి
దక్షిణాది చిత్రసీమలో తన నటనతో చెరగని ముద్ర వేసిన మహానటి షావుకారు జానకి మరణం సినీ రంగానికి తీరని లోటు.
By: Madhu Reddy | 21 Aug 2026 6:33 PM ISTదక్షిణాది చిత్రసీమలో తన నటనతో చెరగని ముద్ర వేసిన మహానటి షావుకారు జానకి మరణం సినీ రంగానికి తీరని లోటు. 1950లో ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ‘షావుకారు’ సినిమాతో వెండితెరకు పరిచయమై, ఆ మొదటి చిత్రంతోనే తన ఇంటిపేరును మార్చుకున్నారు. 1959లో ‘మహిషాసుర మర్ధిని’తో పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిన ఆమె జీవితం తెరపై ఎంత గ్లామరస్‌గా ఉందో, తెరవెనుక అంతటి కష్టాలతో సాగింది. ఆమె జీవితంలో ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.
15 ఏళ్లకే పెళ్లి.. తీరని ఆర్థిక కష్టాలు:
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో 1931లో జన్మించిన జానకి గారికి చిన్నతనంలోనే సినిమాల్లో అవకాశాలు వచ్చినా కుటుంబం ఒప్పుకోలేదు. 15 ఏళ్ల చిన్న వయసులోనే శంకరమంచి శ్రీనివాస్‌తో పెళ్లి జరిపించారు. వివాహం తర్వాత ఆస్తి పంపకాల్లో జరిగిన మోసం వల్ల వారికి చిల్లిగవ్వ కూడా దక్కలేదు.ఇక కనీసం తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పుట్టింటికి వెళ్లడం ఇష్టం లేక, సంసారాన్ని ఈదేందుకు భర్త అనుమతితో నటన వైపు అడుగులు వేశారు.
ఒంటరి పోరాటం.. పిల్లల పెంపకం:
సినిమాల్లోకి వచ్చిన కొద్దిరోజులకే భర్తతో విభేదాలు రావడంతో ఆయనకు దూరమయ్యారు. ఆ రోజుల్లో ఒక నటిగా ముగ్గురు పిల్లల బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుని ఒంటరిగా పెంచి పెద్ద చేశారు. ఆ కాలంలో సినిమాల్లో నటిస్తోందనే కారణంతో సొంత బంధువులు కూడా ఆమెను ఇళ్లలోకి రానివ్వలేదు. ఇక సమాజం నుంచి ఎదురైన ఎన్ని అవమానాలను, ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని ధైర్యంగా నిలబడి తన పిల్లలకు మంచి భవిష్యత్తును అందించారు.
నలుగురు సీఎంలతో స్క్రీన్ షేర్:
ఏడు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో షావుకారు జానకి గారు సాధించిన అరుదైన రికార్డులు ఎన్నో ఉన్నాయి. తెలుగులో ఎన్.టి.రామారావు, తమిళంలో ఎంజీఆర్, జయలలిత వంటి దివంగత ముఖ్యమంత్రులతో కలిసి పలు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించారు. ఇక అంతేకాకుండా ప్రముఖ తమిళ సీఎం ఎం. కరుణానిధి స్క్రిప్ట్ అందించిన సినిమాల్లోనూ ఆమె పాత్రలు పోషించి, అత్యధికంగా సీఎంలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక కథానాయికగా ప్రత్యేక గుర్తింపు పొందారు.
అక్కాచెల్లెళ్లు.. కానీ కలిసి నటించలేదు:
షావుకారు జానకి మరియు మరో స్టార్ హీరోయిన్ కృష్ణకుమారి సొంత అక్కాచెల్లెళ్లు అనే విషయం తెలిసిందే. వీరిద్దరూ ఒకే సమయంలో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా వెలిగినప్పటికీ, తమ కెరీర్‌లో ఎప్పుడూ కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ప్రొఫెషనల్ లైఫ్‌ను, పర్సనల్ లైఫ్‌ను వేరుగా ఉంచాలనే నియమంతో పాటు జానకి గారు తమిళంలో, కృష్ణకుమారి గారు తెలుగులో బిజీగా ఉండటంతో వీరిద్దరినీ ఒకే తెరపై చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కలేదు.
జీవితం విసిరిన సవాళ్లను ఎదుర్కొని, కష్టాల నుంచి శిఖరాగ్ర స్థాయికి ఎదిగిన షావుకారు జానకి గారి ప్రయాణం ఎందరికో ఆదర్శం. నటిగా ఏడు దశాబ్దాల పాటు అలరించి, నలుగురు సీఎంలతో నటించిన ఏకైక నటిగా నిలిచిన ఆమె మృతితో ఒక సువర్ణ యుగం ముగిసింది. ఎంతమంది నటీమణులు వచ్చినా షావుకారు జానకి గారి స్థానం భర్తీ చేయలేనిది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం..
