మహమ్మారిని వెండి తెరకెక్కిస్తోన్న డైరెక్టర్!
శౌనక్ సేన్ `ఆల్ దట్ బ్రీత్స్` చిత్రాన్ని రూపొందిస్తున్న సమయంలోనే కాన్సర్ బారిన పడ్డారు. ఒకవైపు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం సినిమా పనులు చేస్తూనే..
By: Sivaji Kontham | 7 Sept 2026 12:00 AM ISTఆస్కార్ నామినేషన్ సాధించిన `ఆల్ దట్ బ్రీత్స్` చిత్ర దర్శకుడు శౌనక్ సేన్ తదుపరి ప్రాజెక్ట్ గురించి వివరాలను వెల్లడించారు. రాబోయే ప్రాజెక్ట్‌లో తన సొంత జీవిత అనుభవాన్ని.. ప్రత్యేకించి ఆయన క్యాన్సర్‌తో పోరాడిన కఠినమైన ప్రయాణాన్ని కథగా మలచబోతున్నారు. దీంతో వార్త పరిశ్రమలో..అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. శౌనక్ సేన్ గతంలో రూపొందించిన `ఆల్ దట్ బ్రీత్స్` డాక్యుమెంటరీ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్) లో నామినేషన్ సాధించడమే కాకుండా అంతర్జాతీయ వేదికలపై ఎన్నో ప్రశంసలను అందుకుంది.
ప్రకృతి, పక్షులు , మానవ సంబంధాల కలబోతగా ఆ చిత్రాన్ని మలిచిన తీరు విమర్శకులను సైతం మెప్పించింది. ఆ అద్భుత విజయం తర్వాత శౌనక్ చేయబోయే తదుపరి చిత్రం ఏమై ఉంటుందా ? అని సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ కథని రివీల్ చేసి సర్ ప్రైజ్ చేసారు. `ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదని.. తన వ్యక్తిగత జీవితంలోని అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టమని శౌనక్ తెలిపారు. తాను క్యాన్సర్ బారిన పడినప్పుడు ఎదుర్కొన్న శారీరక, మానసిక పోరాటం నేపథ్యంలో చిత్రం తెరకెక్కుతుందన్నారు.
శౌనక్ సేన్ `ఆల్ దట్ బ్రీత్స్` చిత్రాన్ని రూపొందిస్తున్న సమయంలోనే కాన్సర్ బారిన పడ్డారు. ఒకవైపు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం సినిమా పనులు చేస్తూనే.. మరొకవైపు అత్యంత క్లిష్టమైన వైద్య చికిత్సలు, కీమోథెరపీలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ రెండు భిన్నమైన పరిస్థితులను ఒకే సమయంలో అనుభవించడం ఆయన జీవితంలో మర్చిపోలేని అధ్యాయంగా మిగిలిపోయింది. కొత్త చిత్రంలో శౌనక్ కేవలం కాన్సర్ వ్యాధి తీవ్రతను మాత్రమే కాకుండా రోగి మానసిక వేదనను, శారీరక మార్పులను చాకచక్యంగా చూపించనున్నారు.
చికిత్స సమయంలో ఆసుపత్రి వాతావరణం, తోటి రోగుల అనుభవాలు, ఆ క్లిష్ట సమయంలో జీవితంపై కలిగే దృక్పథం ఎలా మారుతుందనే? విషయాలను లోతుగా చర్చించనున్నారు. ఈ సినిమా శౌనక్ సేన్ స్వీయ చరిత్ర తరహాలో కనిపించినా? ఇందులో ప్రతీ ఒక్కరూ తమను తాము పోల్చుకునే విధంగా మానవీయ కోణాన్ని జోడించనున్నారు. కష్టసమయాల్లో మనుషులు చూపే ధైర్యం, ఆశావహ దృక్పథం చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇది కేవలం ఒక వ్యాధి గురించిన కథ మాత్రమే కాదు. మనుగడ కోసం సాగించే పోరాటంగా నిలుస్తుంది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. శౌనక్ జీవితంలో ఎదురైన అతిపెద్ద సవాలును అద్భుతమైన దృశ్యకావ్యంగా మలిచి.. వీక్షకులలో కొత్త ఆశను, ధైర్యాన్ని నింపేందుకు శౌనక్ సేన్ సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెలువ డనున్నాయి.
