ఆ క్రికెటర్ బయోపిక్.. శర్వానంద్ మనసులో మాట!
శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘బైకర్’ మూవీ ట్రైలర్ ఆదివారం విడుదలైన విషయం తెలిసిందే.
By: M Prashanth | 23 March 2026 11:17 AM ISTశర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘బైకర్’ మూవీ ట్రైలర్ ఆదివారం విడుదలైన విషయం తెలిసిందే. అలాగే లాంచ్ ఈవెంట్ సందడిగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్‌లో శర్వాకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. గతంలో ఆయన ఉన్న ఫిజిక్ చూసి టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బయోపిక్ చేస్తే బాగుంటుందని చాలామంది అన్నారని, కానీ ఇప్పుడు ‘బైకర్’ కోసం శర్వా స్లిమ్‌గా మారిన తీరు చూస్తుంటే విరాట్ కోహ్లీ బయోపిక్ కు సెట్ అవుతారని ఒక రిపోర్టర్ అభిప్రాయపడ్డారు. దీనిపై శర్వానంద్ చాలా కూల్‌గా స్పందించారు.
తన బయోపిక్ చాయిస్ గురించి శర్వా మాట్లాడుతూ.. "నాకు ఆ విషయం అంతగా తెలియదు కానీ, రోహిత్ శర్మ.. రోహిత్ శర్మ అని మాత్రం చాలా కాలంగా వింటున్నాను. ఆయన కథ అంటే నాకు కూడా ఇష్టమే. ఒకవేళ ఫ్యూచర్‌లో అలాంటి అవకాశం వస్తే తప్పకుండా ఆలోచిస్తాను" అని చెప్పారు. రోహిత్ శర్మ లైఫ్ జర్నీ చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుందని, అది తన మనసుకు దగ్గరైన విషయమని ఆయన వెల్లడించారు.
ముఖ్యంగా ఈ సినిమాలో శర్వానంద్ తన ఫిజిక్ విషయంలో తీసుకున్న కేర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక రేసర్‌కు ఉండాల్సిన కటౌట్‌ను తీసుకురావడం కోసం చాలా కష్టపడ్డారు. ఒకప్పుడు కాస్త బొద్దుగా కనిపించిన శర్వా, ఇప్పుడు విరాట్ కోహ్లీ అంత ఫిట్‌గా ఉన్నారంటూ మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు ఆయన చిరునవ్వుతో బదులిచ్చారు. కథ డిమాండ్ చేస్తే ఏ స్పోర్ట్స్ స్టార్ బయోపిక్ లోనైనా నటించడానికి తాను సిద్ధమేనని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.
సినిమా షూటింగ్ సమయంలోనే శర్వా ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి ఇండస్ట్రీలో చర్చ జరిగింది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ 'బైకర్' కోసం శర్వా కేవలం లుక్ మాత్రమే కాదు, బైక్ రేసింగ్ మెలకువలు కూడా నేర్చుకున్నారు. ఈ ప్రాసెస్ లో తన బాడీ షేప్ పూర్తిగా మారిపోయిందని, అందుకే ఇప్పుడు కోహ్లీ బయోపిక్ కు సరిపోతారనే టాక్ వస్తోందని ఆయన సరదాగా అన్నారు. ఏది ఏమైనా ఒక మంచి స్పోర్ట్స్ డ్రామా కథ దొరికితే నటుడిగా నిరూపించుకోవడానికి తాను ఎప్పుడూ రెడీ అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ‘బైకర్’ ట్రైలర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూసి శర్వా చాలా హ్యాపీగా ఉన్నారు. మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని ఆయన నమ్ముతున్నారు. సినిమాలో యాక్షన్ తో పాటు తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషన్స్ కూడా హైలైట్‌గా ఉండబోతున్నాయని, ఏప్రిల్ 3న థియేటర్లలో అది కనిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
స్పోర్ట్స్ సినిమాలపై తనకున్న ఇష్టమే తనను ఇలాంటి కథల వైపు నడిపిస్తోందని వివరించారు. మొత్తానికి శర్వానంద్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు క్రికెట్, సినిమా అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ భవిష్యత్తులో రోహిత్ శర్మ బయోపిక్ వస్తే, అందులో శర్వా హీరోగా నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. హిట్ మ్యాన్ పాత్రలో శర్వా ఇంటెన్సిటీ ఎలా ఉంటుందో అని అప్పుడే సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. మరి ఈ ‘బైకర్’ సక్సెస్ తర్వాత శర్వా నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో వేచి చూడాలి.
