శర్వానంద్ కూడా ఆ ఫార్ములాకు సై అన్నట్టేనా?
టాలీవుడ్‌లో గత కొన్ని నెలల కాలంగా కొత్త తరహా ట్రెండ్ మొదలైంది. క్రేజీ స్టార్స్ కొంత మంది ఈ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు.
By: Tupaki Entertainment Desk | 25 Jan 2026 7:00 AM ISTటాలీవుడ్‌లో గత కొన్ని నెలల కాలంగా కొత్త తరహా ట్రెండ్ మొదలైంది. క్రేజీ స్టార్స్ కొంత మంది ఈ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. అదే ప్రాఫిట్ షేర్. బాహుబలి తరువాత తెలుగు సినిమా మార్కెట్ రికార్డు స్థాయికి చేరడం.. తెలుగు సినిమాలు దేశ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తుండటంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు, హీరోయిన్‌ల నుంచి స్టార్ హీరోల వరకు పెరిగిన మార్కెట్‌ని, సినిమాల బడ్జెట్‌లని దృష్టిలో పెట్టుకుని రెమ్యూనరేషన్‌లు భారీగా పెంచేశారు. దీంతో సినిమా బడ్జెట్‌లు కూడా పతాక స్థాయికి చేరాయి.
దానికి తగ్గట్టే స్టార్ హీరోలు పారితోషికాలు డిమాండ్ చేస్తూ అందినంత ప్రొడ్యూసర్స్ నుంచి వసూలు చేసుకుంటున్నారు. అయితే మరి కొంత మంది స్టార్స్ మాత్రం రెమ్యూనరేషన్స్ పక్కన పెట్టి సినిమా లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారు. దీన్నే ప్రాఫిట్ షేర్ సిస్టమ్ అంటున్నారు. ఏ సినిమా చేసినా.. ఎంత బడ్జెట్ భారీగా పెట్టిన వచ్చే లాభాల్లో పారితోషికం స్థానంలో షేర్ డిమాండ్ చేస్తున్నారు. ఈ సిస్టమ్ అందరికి నచ్చడంతో స్టార్స్ అడిగిన ప్రాఫిట్ షేర్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్స్ వెనుకాడటం లేదు.
నిన్న మొన్నటి వరకు అల్లు అర్జున్, చిరంజీవి, ఎన్టీఆర్ వంటి స్టార్స్ మాత్రమే ప్రాఫిట్ షేర్ సిస్టంని అమలు చేస్తూ వస్తున్నారు. వీరి తరహాలోనే స్టార్ బాయ్ సిద్దూ కూడా చేరడం తెలిసిందే. ఈ స్టార్స్ తరహాలోనే హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా తాను నటించే సినిమాల్లో ప్రాఫిట్ షేర్ సిస్టమ్‌ని ఫాలో అవుతోందట. ఇలా ప్రాఫిట్‌లో షేర్ డిమాండ్ చేస్తున్న హీరోయిన్‌గా సంయుక్త నిలిచిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే ఇదే సిస్టమ్‌ని రీసెంట్‌గా ఎనర్జిటిక్ హీరో రామ్, మాస్ మహారాజా రవితేజ ఫాలో అవుతున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు వీరి జాబితాలోకి యంగ్ హీరో శర్వానంద్ కూడా చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. కొంత కాలంగా వరుస ఫ్లాపుల్లో ఉన్న శర్వా ఈ సంక్రాంతికి `నారీ నారీ నడుమ మురారి` సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా అత్యధిక వసూళ్లని రాబడుతూ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ మీట్‌ని ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ విజయ్ విలువ నాకు బాగా తెలుసు. నిర్మాత అనిల్ సుంకర నాకు ఓ గొప్ప విజయాన్నిచ్చారు. తదుపరి ఆయనతో చేయబోయే సినిమాకు రూపాయి కూడా తీసుకోను. హీరో, నిర్మాత కలిసి పని చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో మేం చూపిస్తాం` అన్నాడు. అంటే అనిల్ సుంకరతో చేయబోయే సినిమాకు రెమ్యూనరేషన్ కాకుండా ప్రాఫిట్‌లో షేర్ తీసుకుంటాడనే సంకేతాలు కనిపిస్తున్నాయని, శర్వా కూడా రెమ్యూనరేషన్ పక్కన పెట్టి మిగతా వారిలా ప్రాఫిట్‌లో షేర్‌కు షిఫ్ట్ అవుతున్నాడనే కామెంట్‌లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
