హోటల్స్ రిసార్టుల్లో కళలు.. శర్వానంద్ కొత్త ఆవిష్కరణ
శర్వా తన సొంత బ్రాండ్ OMI ని ప్రారంభించారు. ఇది హోటల్స్, రిసార్ట్స్, ఆతిథ్య రంగంలో కళాత్మకతతో కూడుకున్న బిజినెస్ వెంచర్.
By: Sivaji Kontham | 10 Sept 2025 9:27 AM ISTకళలు కళాత్మకతను ఎవరైతే ఒడిసిపట్టుకుంటారో, సృజనాత్మక పంథాలో ఎవరైతే ఆలోచిస్తారో అలాంటి వ్యక్తులకు ఆరంభ కష్టాలు ఉంటాయేమో కానీ, నెమ్మదిగా ప్రజాదరణ మొదలైతే, బొమ్మ బ్లాక్ బస్టరే. కాన్సెప్టును అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు. కానీ అర్థమైతే, ప్రజలు నిత్యతోరణంలా క్యూ కడతారు. ఇప్పుడు వెర్సటైల్ స్టార్ శర్వానంద్ తన సినిమాల ఎంపికలానే హోటల్స్, రిసార్టుల వ్యాపారంలో క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారు.
శర్వా తన సొంత బ్రాండ్ OMI ని ప్రారంభించారు. ఇది హోటల్స్, రిసార్ట్స్, ఆతిథ్య రంగంలో కళాత్మకతతో కూడుకున్న బిజినెస్ వెంచర్. దీనిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఇది ఆతిథ్య రంగంలో విలక్షణమైనది అని శర్వా చెబుతున్నారు. సృజనాత్మకత, స్థిరత్వం, ఐక్యత అనే కాన్సెప్టుతో రూపొందించిన ఫార్ములా. ఇది ఇతర హోటల్స్ మాదిరి కాదు. రెగ్యులర్ హోటల్ కాదు.. ఎన్నడూ వినని స్వరాలు, సృజనాత్మక మనస్సులను కలిపే ఏకైక స్థలం. OMI-బ్రాండెడ్ హోటళ్ళు లేదా రిసార్ట్‌లను సృజనాత్మక స్వర్గధామాలుగా ఊహించవచ్చు. వీటిలో ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌లు, ప్రదర్శన స్థలాలు సిద్ధంగా ఉంటాయి. ఇక్కడ స్థానిక కళాకారులు, చేతివృత్తులవారికి ప్రోత్సాహం ఉంటుంది.
సహజ జీవనం, ప్రామాణిక జీవనంపై ప్రాధాన్యతనిచ్చే ఏర్పాటు.. పర్యావరణ అనుకూల పద్ధతులు, స్థిరమైన వాస్తుశిల్పం, ప్రకృతితో అనుసంధానం చేస్తూ నిర్మితమయ్యే హోటల్స్-రిసార్ట్స్ అన్నమాట. స్థానికంగా లభించే వస్తువులను ఉపయోగించడం, పొలంలోని స్వచ్ఛమైన ఉత్పత్తులను ఆహారంగా అందించే ఏర్పాటు వీటిలో ఉంటుంది. నగరాల హడావిడి ఇక్కడ ఉండదు. పర్యావరణ సహితమైన హోటల్స్, రిసార్టుల్లో సినిమాల షూటింగులకు కూడా అనుకూలం. సామాజిక - కళాత్మక బాధ్యతతో స్థానిక కళాకారులను ప్రోత్సహిస్తారు.
