శర్వా రిస్క్ కు కారణమదేనా?
కథను నమ్మి సినిమాలు చేసే నటులు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు శర్వానంద్ కూడా ఒకరు.
By: Sravani Lakshmi Srungarapu | 10 Oct 2025 5:00 PM ISTకథను నమ్మి సినిమాలు చేసే నటులు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు శర్వానంద్ కూడా ఒకరు. గతేడాది మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శర్వానంద్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలుండగా, అందులో నారీ నారీ నడము మురారి కూడా ఒకటి. మామూలుగా అయితే ఈ మూవీ ఇప్పటికే రిలీజవాల్సింది.
ఓటీటీ డీల్ వల్లే డిలే
కానీ పలు కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఓటీటీ డీల్ ఇంకా ఫైనలైజ్ అవకపోవడం వల్లే ఇంకా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఏ నిర్ణయమూ తీసుకోలేదని కూడా వార్తలు వినిపించాయి. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రానున్న ఈ మూవీ ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందగా, ఇందులో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.
పండగ రేసులో శర్వా
అయితే ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీపావళికి రిలీజ్ డేట్ కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ రావొచ్చని అంటున్నారు. ఇదే నిజమైతే సంక్రాంతి పోటీ మరింత తీవ్రంగా మారడం ఖాయం. అసలే 2026 సంక్రాంతికి పలు సినిమాలు రేసులో ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, రవితేజ, నవీన్ పోలిశెట్టి నటించిన సినిమాలు పండగ బరిలో ఉన్నాయి.
శర్వా ఆ రిస్క్ చేస్తాడా?
చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు, ప్రభాస్ రాజా సాబ్ సినిమాలకు భారీ హైప్ ఉండగా, రవితేజ- కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గురించి కూడా బాగానే చెప్తున్నారు. ఇక నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మంచి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కినట్టు అర్థమవుతుంది. ఇవి కాకుండా మరో రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా సంక్రాంతికి వచ్చే వీలుంది. మరి ఇంత పోటీలో సంక్రాంతికి తన సినిమాను రిలీజ్ చేసి శర్వానంద్ రిస్క్ చేస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.
సంక్రాంతికి వచ్చి రెండుసార్లు హిట్ కొట్టిన శర్వానంద్
ఎంత పెద్ద పోటీ ఉన్నా కంటెంట్ బావుంటే సినిమా బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అవుతుందనే ఆలోచనతో తమ సినిమాను కూడా పండక్కే తీసుకుని రావాలనుకుంటున్నారా? లేక గతంలో శర్వానంద్ హీరోగా సంక్రాంతికి వచ్చిన ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానం భవతి సినిమాలు పోటీని తట్టుకుని కూడా హిట్ గా నిలవడంతో ఆ సెంటిమెంట్ తో ఈ మూవీని ఏమైనా రిలీజ్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజంగా నారీ నారీ నడుమ మురారి సంక్రాంతి బరిలో నిలిస్తే శర్వా కు ఆ సెంటిమెంట్ ఏ మేర కలిసొస్తుందో చూడాలి.
