Begin typing your search above and press return to search.

హ్యాట్రిక్ కి ఒక్క అడుగు దూరంలో!

ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం మేళవించిన సినిమా ప్రేక్షకులను విశేషంగా అల‌రించింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.

By:  Srikanth Kontham   |   7 April 2026 1:00 AM IST
హ్యాట్రిక్ కి ఒక్క అడుగు దూరంలో!
X

యంగ్ హీరో శర్వానంద్ కెరీర్‌లో అత్యంత కీలకమైన దశలో ఉన్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ పక్కింటి అబ్బాయిలా ప్రేక్షకులకు దగ్గరైన శర్వా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద అరుదైన హ్యాట్రిక్ విజయానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో హిట్లు అందుకున్నప్పటికీ వరుసగా మూడు విజయాలు సాధించి హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఆయన ముంగిట ఉంది. ఈ ఏడాది సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అయిన `నారీ నారీ నడుమ మురారి` మంచి విజ‌యం సాధించింది. చాలా గ్యాప్ త‌ర్వాత శ‌ర్వాకు విజ‌యంతో బూస్టింగ్ ఇచ్చిన చిత్ర‌మది.

ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం మేళవించిన సినిమా ప్రేక్షకులను విశేషంగా అల‌రించింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా విజయం శర్వాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తాజాగా విడుదలైన `బైకర్` తో శర్వానంద్ ఖాతాలో మరో హిట్ న‌మోదైంది. స్పోర్స్ట్ డ్రామాగా తెరకెక్కిన సినిమాలో శర్వా నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇలా వరుసగా రెండు విజయాలు సొంతం చేసుకోవడంతో అందరి దృష్టి ఆయన తదుపరి చిత్రం `భోగి`పై పడింది. ఈ సినిమా రిజల్ట్ శర్వానంద్ కెరీర్ గ్రాఫ్‌ను ఒక్కసారిగా మార్చేసే అవకాశం ఉంది.

శర్వానంద్ కెరీర్‌లో ఇప్పటి వరకు అధికారికంగా ఒక్క హ్యాట్రిక్ కూడా నమోదు కాలేదు. గతంలో కొన్ని సినిమాలు వరుసగా ఆడినప్పటికీ సంపూర్ణమైన హ్యాట్రిక్ గుర్తింపు మాత్రం రాలేదు. అప్ క‌మింగ్ రిలీజ్ `భోగి` కనుక బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తే శర్వా కెరీర్‌లో ఇదే తొలి హ్యాట్రిక్ అవుతుంది. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను ఆయన ఎంతో ప్రతిష్టా త్మకంగా తీసుకున్నాడు. సినిమా జ‌నాల‌కు రీచ్ అయ్యేలా ప్ర‌మోష‌న్ ను తెలివిగా ప్లాన్ చేస్తున్నారు.`భోగి` చిత్రంపై చిత్ర యూనిట్ , శర్వానంద్ ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

కథలో ఉన్న వైవిధ్యం, శర్వా మార్క్ నటన ప్రేక్షకులను ఖచ్చితంగా థియేటర్లకు రప్పిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంటే? శర్వానంద్ టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోల జాబితాలో చేరిపోతాడు. మళ్లీ తన పాత ఫామ్‌ను పూర్తి స్థాయిలో అందుకున్నట్లవుతుంది. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ ఎప్పుడూ లేనంత సంతోషంలో క‌నిపిస్తున్నాడు. కొంత కాలంగా ఎంతో ఎఫెర్ట్ పెట్టి చేస్తోన్న సినిమాల‌న్నీ ప్లాప్ అవ్వ‌డంతో? మార్కెట్ కూడా డౌన్ అయింది. తాజా సినిమాలు కూడా ప్లాప్ అయితే ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారేది. ఆ ప‌రిస్థితి నుంచి శ‌ర్వా బ‌య‌ట‌ప‌డ్డాడు. అలాగే ఇండ‌స్ట్రీలో అతిగా ఎవ‌రిని న‌మ్మ‌కూడ‌దు అన్న విష‌యం శ‌ర్వానంద్ కు బాగా అవ‌గ‌త‌మైంది.