బన్నీలా ఎవరూ కష్టపడలేరా? శర్వా ఏమన్నారంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హార్డ్ వర్క్ పై యంగ్ హీరో శర్వానంద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
By: M Prashanth | 6 April 2026 10:39 AM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హార్డ్ వర్క్ పై యంగ్ హీరో శర్వానంద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శర్వానంద్.. బన్నీ వర్క్ డెడికేషన్, డిసిప్లిన్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసి పెరిగిన స్నేహితులమని గుర్తు చేసుకుంటూ, అల్లు అర్జున్ తనకు ఎప్పుడూ ఇన్స్పిరేషన్ గా ఉంటారని చెప్పారు.
"మేమంతా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. కానీ బన్నీలా కష్టపడటం చాలా కష్టం. నిజాయితీగా చెబుతున్నా.. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో బైకర్ వరకు కూడా బన్నీలా అంతగా కష్టపడలేదు. ఇది హోనెస్ట్ గా, జెన్యూన్ గా చెబుతున్నా" అని శర్వానంద్ వెల్లడించారు. ఆయన మాటల్లో కనిపించిన నిజాయితీ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా నిర్మాత అల్లు అరవింద్ తో మాట్లాడుతూ శర్వానంద్ ఆ వ్యాఖ్యలు చేయడం విశేషం. అల్లు అర్జున్ ప్రొఫెషనల్ డెడికేషన్ ను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక సినిమా కోసం బన్నీ చేసుకునే ప్రిపరేషన్, ఫిట్నెస్ పై చూపే శ్రద్ధ, పాత్రలో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వడం తనను ఎంతో ప్రభావితం చేసిందని తెలిపారు. ఇండస్ట్రీలో అలాంటి క్రమశిక్షణ, హార్డ్ వర్క్ చాలా అరుదుగా కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇక శర్వానంద్ రీసెంట్ గా బైకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ సినిమా ప్రమోషన్స్ టైమ్ లో కూడా బన్నీని ప్రస్తావించారు. బైకర్ కోసం తాను దాదాపు 22 కిలోల బరువు తగ్గినట్లు తెలిపారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కు అల్లు అర్జున్ ప్రేరణగా నిలిచారని చెప్పారు. బన్నీ తన ఫిట్నెస్, పాత్ర కోసం చేసే ప్రిపరేషన్ చూసి తాను కూడా అదే మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు.
అయితే బైకర్ చిత్రం విషయంలో శర్వానంద్ ఎంతో శ్రద్ధతో వర్క్ చేసినట్లు సినిమా చూస్తుంటే క్లియర్ గా తెలుస్తోంది. కథ, పాత్ర, ఫిజిక్ ప్రతి అంశంలోనూ కొత్తదనాన్ని చూపించేందుకు ప్రయత్నించారని చెప్పాలి. అదే విధంగా సక్సెస్ కూడా అయ్యారు. అదే సమయంలో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ అల్లు సినిమాస్ లో బైకర్ టీజర్ రివీల్ చేయడం కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఇది ఇద్దరి మధ్య ఉన్న స్నేహం, గౌరవానికి ఒక నిదర్శనంగా అభిమానులు భావిస్తున్నారు.
ఏదేమైనా.. శర్వానంద్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ అల్లు అర్జున్ హార్డ్ వర్క్ ను మరోసారి హైలైట్ చేశాయి. ఇండస్ట్రీలో ఎదగాలంటే కేవలం టాలెంట్ మాత్రమే కాదు.. నిరంతర హార్డ్ వర్క్, క్రమశిక్షణ కూడా ఎంత ముఖ్యమో ఆయన వ్యాఖ్యలు చెబుతున్నాయి. ప్రస్తుతం శర్వా కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, బన్నీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. శర్వా మాట్లాడిన వీడియో కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
