శర్వా అంటే ఏంటో.. అభిలాష్ చూపించాడు!
హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ లో తాజాగా అభిమానులతో కలిసి సినిమా చూసిన ఆయన, అక్కడే ఉన్న తెరకు సాష్టాంగ నమస్కారం చేయడం ప్రత్యేకంగా నిలిచింది.
By: M Prashanth | 5 April 2026 4:14 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ మూవీ బైకర్.. ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇండియాలోనే తొలి మోటోక్రాస్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన చిత్రంగా ఆ మూవీపై రిలీజ్ కు ముందే ఆసక్తి నెలకొంది. ఇప్పుడు విడుదల తర్వాత కూడా సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లలో సందడి కనిపిస్తోంది.
గుడ్ ఫ్రైడే కానుకగా ఏప్రిల్ 3న విడుదలైన బైకర్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. కథ, యాక్షన్ సీన్స్, రేసింగ్ ఎపిసోడ్స్ కు మార్కులు పడుతున్నాయి. ముఖ్యంగా శర్వానంద్ నటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విజయంతో శర్వానంద్ భావోద్వేగానికి లోనయ్యారు.
హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ లో తాజాగా అభిమానులతో కలిసి సినిమా చూసిన ఆయన, అక్కడే ఉన్న తెరకు సాష్టాంగ నమస్కారం చేయడం ప్రత్యేకంగా నిలిచింది. తెరను ముట్టుకుని ముద్దు పెట్టుకున్న శర్వానంద్ కాసేపు భావోద్వేగంతో కనిపించారు. ఆ మూమెంట్స్ చూసిన అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ, తాను చేసిన సినిమాల్లో కొన్ని ప్రేక్షకులకు నచ్చాయని, మరికొన్ని నచ్చలేదని తెలిపారు. కానీ బైకర్ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పారు. దర్శకుడు అభిలాష్ రెడ్డి తనను మళ్లీ నిలబెట్టారని అన్నారు. దర్శకుడు హీరోను ఎంతగా ప్రేమిస్తే, ఆ ప్రేమ సినిమాల్లో ఎలా కనిపిస్తుందో ఈ చిత్రంతో నిరూపించారని కొనియాడారు.
"మంచి సినిమాలు చేశా.. కొన్ని మీకు నచ్చినవి చేశా.. మరికొన్ని నచ్చనవి చేశా.. కానీ అభిలాష్ నన్ను మళ్లీ తీసుకొచ్చి నిల్చుబెట్టి శర్వా ఏంటో.. డైరెక్టర్ హీరోను ప్రేమిస్తే ఏంటో.. నా తమ్ముుడు, బంగారం, ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అభిలాష్ చూపించాడు" అంటూ డైరెక్టర్ పై ప్రశంసలు కురిపించారు. "ఇది నా సినిమా.. నా దేవత. నాకు కలలు ఇచ్చిన తల్లిలాంటి థియేటర్ కు నమస్కరిస్తున్నా" అంటూ శర్వా భావోద్వేగంతో మాట్లాడారు.
ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోను అభిమానులు పెద్దఎత్తున షేర్ చేస్తూ, సినిమాపై ఆయనకు ఉన్న ప్రేమకు అభినందనలు తెలుపుతున్నారు. అయితే బైకర్ సినిమాలో శర్వానంద్ బైక్ రేసర్ గా కనిపించగా, ఆయనకు జోడీగా మాళవిక నాయర్ నటించారు. అలాగే సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో, హీరోకు తండ్రిగా కనిపించారు. వీరి ముగ్గురి పాత్రలు కూడా కథకు బలం చేకూర్చాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
బైకర్ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు ప్రమోద్, వంశీ నిర్మించారు. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిన సినిమా విజువల్ పరంగా కూడా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రేసింగ్ సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఏదేమైనా బైకర్ శర్వానంద్ కెరీర్ లో మరో హిట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాజిటివ్ టాక్ కొనసాగితే, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం శర్వానంద్ ఎమోషనల్ వీడియో, ఆయన కామెంట్స్ నెట్టింట ట్రెండింగ్ లో నిలిచాయి.
