Begin typing your search above and press return to search.

భోగి ట్రైల‌ర్ : విలేజ్‌లో ర‌హ‌స్యాన్ని ఛేధించే కుర్రాడి రా అండ్ ఇంటెన్స్ స్టోరి!

శర్వానంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భోగి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. 1960ల నేపథ్యంలో సాగే ఈ కథలో గంగగా శర్వానంద్ కనిపించనున్నారు. గ్రామంలో యువకులు అదృశ్యమవుతున్న మిస్టరీ, భూస్వామి ఆగడాలపై గంగ చేసే పోరాటం ఆసక్తికరంగా ఉంది. అనుపమ, డింపుల్ హయాతి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 27న విడుదల కానుంది.

By:  Sivaji Kontham   |   23 Nov 2026 7:56 AM IST
భోగి ట్రైల‌ర్ : విలేజ్‌లో ర‌హ‌స్యాన్ని ఛేధించే కుర్రాడి రా అండ్ ఇంటెన్స్ స్టోరి!
X

శ‌ర్వానంద్- సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామా- భోగి. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కెకె రాధామోహన్ నిర్మించిన‌ ఈ చిత్రం.. ప్రమోష‌నల్ మెటీరియ‌ల్ కి మంచి స్పంద‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. సస్పెన్స్, రా యాక్షన్, మలుపులతో కూడిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటూ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.





60ల నాటి కాలంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ట్రైలర్‌లో శర్వానంద్‌ను `గంగ` అనే పాత్రలో పరిచయం చేశారు. తన చెల్లెళ్లను కూతుళ్లలా ప్రేమగా చూసుకునే గంగ జీవితం సాఫీగా సాగుతున్న తరుణంలో ఆ ఊరిపై పెత్తనం చెలాయించే భూస్వామి ఆగడాలతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతుంటారు. దీనికి తోడు ఆ గ్రామంలో అమావాస్య మరుసటి రోజు దిష్టి పూజ జరిగిన తర్వాత యువకులు అదృశ్యమయ్యే వింత ఘటనలు కలకలం రేపుతాయి. ఈ మిస్టరీ వెనుక దాగి ఉన్న రహస్యాలను గంగ ఎలా ఛేదించాడనేదే సినిమా ప్రధాన కథాంశం.

ఈ చిత్రంలో గంగ పాత్ర కోసం శర్వానంద్ తనను తాను పూర్తిగా మార్చుకున్నారు. చెల్లెళ్లపై అమితమైన ప్రేమ చూపించే సున్నితమైన వ్యక్తిగా.. అదే సమయంలో ఊరి ప్రశాంతతకు భంగం వాటిల్లినప్పుడు ఉగ్రరూపం దాల్చే వీరుడిగా అత‌డి రా అండ్ ఇంటెన్స్‌ నటన ట్రైల‌ర్ ఆద్యంతం క‌ట్టిప‌డేస్తోంది. అచ్చమైన తెలంగాణ యాసలో శర్వా పలికిన సంభాషణలు.. ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ పాత్రకు మరింత బలాన్ని చేకూర్చాయి. శ‌ర్వా మొదటి నుంచి చెబుతున్న‌ట్టు ఇందులో ర‌క్త‌పాతం, క్రూర‌త్వం అధికంగానే ఉంది. కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ విలేజీ అమ్మాయిగా క‌నిపిస్తుండ‌గా.. డింపుల్ హయాతి కూడా గ్రామీణ యువ‌తిగా క‌నిపిస్తోంది. ట్రైల‌ర్ లో ఆ ఇద్ద‌రి పాత్ర‌ల‌ను కూడా రివీల్ చేయ‌డం ఆస‌క్తిక‌రం.

దర్శకుడు సంపత్ నంది తనదైన శైలిలో గ్రామీణ వాతావరణానికి మిస్టరీ అంశాలను జోడించి ఈ కథను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్షన్ 1960ల నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు పునఃసృష్టించింది. కిషోర్ కుమార్ అరోకియా సినిమాటోగ్రఫీ విజువల్స్‌కు సహజత్వాన్ని తీసుకురాగా.. భీమ్స్ సిసిరోలియో అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌లోని ఉత్కంఠను తారాస్థాయికి చేర్చింది. భారీ అంచనాల మధ్య `భోగి` చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.