Begin typing your search above and press return to search.

సంక్రాంతి ఓకే.. మరి బోగి సంగతేంటి శర్వా?

శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న 'భోగి'ని ఆగస్టు 28న విడుదల చేస్తామని గతంలో అధికారికంగా అనౌన్స్ చేశారు.

By:  M Prashanth   |   14 Aug 2026 11:00 PM IST
సంక్రాంతి ఓకే.. మరి బోగి సంగతేంటి శర్వా?
X

శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న 'భోగి'ని ఆగస్టు 28న విడుదల చేస్తామని గతంలో అధికారికంగా అనౌన్స్ చేశారు. అయితే రిలీజ్ సమయానికి కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో అసలు సినిమా చెప్పిన తేదీకి వస్తుందా లేదా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేసిన భారీ చిత్రానికి ఈ సమయానికి పబ్లిసిటీ ఓ రేంజ్ లా నడవాలి. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి పెద్ద ప్రమోషనల్ అప్‌డేట్స్ సౌండ్ అయితే లేదు.

దర్శకుడు సంపత్ నంది రీసెంట్ గా ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నామని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. అయితే ఆ పోస్ట్‌లో రిలీజ్ డేట్ గురించి ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. ఇప్పటికే ఈ చిత్రం కోసం 800 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో ఏకంగా 22 రోజుల పాటు ఒక భారీ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్‌ను పూర్తి చేశారు. ప్రొడక్షన్ పనులు చురుగ్గానే సాగుతున్నా, థియేటర్లలోకి రావాల్సిన తేదీ దగ్గర పడుతుండటంతో ఆడియన్స్‌లో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది.

1960ల నాటి తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో శర్వానంద్ 'గంగా' అనే సరికొత్త రగ్గడ్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయాలనే ప్లాన్ ఉండటంతో సరైన బజ్ రావాల్సిన అవసరం కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే, శర్వానంద్ తన తర్వాతి ప్రాజెక్ట్‌ను మాత్రం చాలా వేగంగా లైన్‌లో పెట్టేశాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్న 'జార్జ్ క్రిష్' సినిమాను రీసెంట్‌గా ప్రారంభించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి పండుగ బరిలో నిలపబోతున్నట్లు ముందే పక్కాగా ప్రకటించారు. ఫెస్టివల్ సీజన్‌ను టార్గెట్ చేస్తూ రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ చాలా ప్లానింగ్‌తో ఉంది.

ఈ రెండు కథలు కూడా ఒకదానితో ఒకటి అస్సలు సంబంధం లేని పూర్తి భిన్నమైన జోనర్లు. ఒకవైపు యాక్షన్, రా లుక్‌తో సాగే పాన్ ఇండియా పీరియడ్ సినిమా చేస్తుంటే, వెంటనే మరోవైపు కుటుంబ ప్రేక్షకులను నవ్వించే పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌ను సెట్ చేసుకున్నాడు. ఒక నటుడిగా ఇలాంటి వైవిధ్యమైన లైనప్ సెట్ చేసుకోవడం ఆయన కెరీర్‌కు మంచి ప్లస్ పాయింట్.

అయితే వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాకు పక్కా డేట్ ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి చేతిలో ఉన్న 'భోగి' పరిస్థితిపైనే అందరి కళ్లు ఉన్నాయి. అధికారికంగా తేదీ మారలేదు కాబట్టి చెప్పిన సమయానికే వస్తుందా లేక కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తారా అనేది చిత్ర యూనిట్ తేల్చాల్సి ఉంది. పండుగ రేసును ముందే లాక్ చేసుకున్న శర్వా, ఈ పీరియడ్ డ్రామాతో ఎప్పుడు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాడో చూడాలి.