150 ఏళ్ల క్రితం నాటి ఇంట్లో హీరోయిన్ బస!
నేటి ఆధునిక కాలంలో సమాచార మార్పిడి ఎంతో వేగంగా జరుగుతున్నా? ఆనాటి రోజుల్లో మౌనానికి, మాటల్లో వ్యక్తపరచని భావాలకు ఎంతో విలువ ఉండేదని ఆమె భావించింది.
By: Srikanth Kontham | 28 May 2026 5:00 PM ISTనటీనటులు పోషిస్తున్న పాత్రల్లోకి పూర్తిగా లీనమవ్వడం అనేది అద్భుతమైన ప్రక్రియ. ముఖ్యంగా పీరియాడిక్ చిత్రాలలో నటించేటప్పుడు.. ఆనాటి కాలమాన పరిస్థితులను, జీవనశైలిని అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. తాజాగా బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పీరియాడిక్ చిత్రం `మెయిన్ వాపస్ ఆవుంగా` కోసం నటి శర్వరీ వాగ్ సైతం తన పాత్ర కోసం ఇలాంటి వినూత్న ప్రయత్నమే చేస్తోంది. భారతదేశ విభజనకు పూర్వపు రోజులను, ఆనాటి భావోద్వేగాలను ప్రతిబింబించే ఈ చిత్రంలో శర్వరీ 1940ల నాటి యువతిగా ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. దాదాపు ఎనిమిది దశాబ్దాల క్రితం నాటి `జియా` అనే పాతకాలపు అమ్మాయి పాత్రను పోషించడం శర్వరీకి సరికొత్త సవాలుగా నిలిచింది.
నేటి ఆధునిక కాలంలో సమాచార మార్పిడి ఎంతో వేగంగా జరుగుతున్నా? ఆనాటి రోజుల్లో మౌనానికి, మాటల్లో వ్యక్తపరచని భావాలకు ఎంతో విలువ ఉండేదని ఆమె భావించింది. ఆనాటి కాలానికి చెందిన నిశ్శబ్దాన్ని, గాంభీర్యాన్ని తనలో అలవర్చుకోవడానికి అమ్మడు ఎంతో శ్రమించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంతాలలో చాలా వారాల పాటు షూటింగ్ నిర్వహించింది. ఇది ఆమె పాత్ర స్వభావాన్ని ఒంటబట్టించుకోవడానికి ఎంతగానో దోహదపడిందని చెప్పొచ్చు. గ్రామీణ పంజాబ్‌లోని చురాల్ అనే గ్రామంలో షూటింగ్ సమయంలో వారు బస చేసిన ఒక నివాసం శర్వరీ ఆలోచనలను పూర్తిగా మార్చేసిందంది.
దాదాపు 150 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆ పురాతన ఇల్లు ఆమెకు గతాన్ని గుర్తుచేసిందిట. సినిమా కోసం ముందుగా ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్ళి నప్పుడే అక్కడి ఒక గదిలో ఉన్న పాతకాలపు వింటేజ్ డ్రెస్సింగ్ టేబుల్ శర్వరీని ఎంతగానో ఆకట్టుకుందిట. దీంతో షూటింగ్ సమయంలో కొత్తగదా బస లేకుండా? ఆ గదినే తనకు కేటాయించాల్సిందిగా చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా కోరడం గమనార్హం. 1940వ దశకంలో ఒక సాధారణ అమ్మాయి అద్దం ముందు కూర్చుని ఎలా అలంకరించుకునేదో? ఆ అనుభూతిని స్వయంగా అనుభవించాలని శర్వరీ ఆశించింది.
అందుకే రోజూ షూటింగ్‌కు సిద్ధమయ్యేటప్పుడు ఆ పురాతన డ్రెస్సింగ్ టేబుల్ ముందే కూర్చుని తన మేకప్ తానే స్వయంగా వేసుకునేదట. ఈ చిన్న అలవాటు అమ్మడిని మానసికంగా ఆ కాలంలోకి తీసుకెళ్లింది. `జియా` పాత్రతో బలమైన బంధాన్ని ఏర్పరచుకోవడానికి సహాయపడిందని శర్వరీ తెలిపింది. పాత్రల కోసం శర్వరీ మాత్రమే కాదు. ఆమెతో పాటు కథానాయకుడిగా నటిస్తోన్న వేదాంగ్ రైనా కూడా విభిన్నమైన వ్యూహాన్ని అనుసరించారు. 1940ల నాటి సామాజిక వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన ఆనాటి పాటలతో కూడిన ఒక ప్రత్యేకమైన ప్లేలిస్ట్‌ను సిద్ధం చేసుకుని వినేవారుట. చిత్ర విశేషాల గురించి చర్చిస్తున్నప్పుడు శర్వరీ కూడా అదే విధంగా ఆనాటి పాతపాటలను వింటూ పాత్రలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. ఈ విధంగా ఇద్దరు యువ నటీనటులు నాటి కాలపు సంగీతం ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకుని పాత్రలను మరింత రక్తికట్టించారు.
