Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ న‌టి శార‌ద కాల‌క్షేపం అలా!

సీనియ‌ర్ న‌టి శార‌ద ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దేశంలో అన్ని భాష‌ల్లోనూ న‌టించిన న‌టి.

By:  Srikanth Kontham   |   19 Jan 2026 10:00 AM IST
సీనియ‌ర్ న‌టి శార‌ద కాల‌క్షేపం అలా!
X

సీనియ‌ర్ న‌టి శార‌ద ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దేశంలో అన్ని భాష‌ల్లోనూ న‌టించిన న‌టి. దాదాపు ఆరు ద‌శాబ్దాల సినీ ప్ర‌యాణంలో ఆమె పోషించ‌ని పాత్ర‌లేదు. ప్ర‌తీ పాత్ర‌లోనూ త‌న‌దైన ముద్ర వేసారు. ప్ర‌త్యేకించి తెలుగు ప‌రిశ్ర‌మ‌లో ఓ లెజెండ‌రీ న‌టిగా కొన‌సాగారు. `మ‌న‌షులు మారాలి`, `జ‌స్టిస్ చౌద‌రి`, `స‌ర్దార్ పాపా రాయుడు`, `బొబ్బిలి బ్ర‌హ్మ‌న్న‌`, `ఏవండీ ఆవిడ వ‌చ్చింది`, `అమ్మ రాజీనామా`ఇలా ఎన్నో ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాల్లో న‌టించారు. `స్టాలిన్`, `యోగి` లాంటి చిత్రాల్లోనూ అమ్మ పాత్ర‌లో త‌న‌దైన ముద్ర వేసారు. 1955 లో మొద‌లైన ఆమె ప్ర‌స్థానం 2013 వ‌ర‌కూ కొన‌సాగింది.

అప్ప‌టి నుంచి సినిమాల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించి ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. తాజాగా శార‌ద సినిమాల‌కు దూర‌మ‌వ్వ‌డానికి గ‌ల కార‌ణాల‌ను, ఇంట్లో స‌మ‌యాన్ని ఎలా గ‌డుపుతున్నారు వంటి విష‌యాలు పంచుకున్నారు. భ‌గ‌వంతుడు త‌న‌కిచ్చిన ఈ ప్ర‌యాణం ఎంతో సంతోషాన్నిచ్చింద‌న్నారు. ఇన్నేళ్ల సినీ ప్ర‌యాణంలో హీరోయిన్ గా, స‌హాయ న‌టిగా ఎన్నో విజ‌యవంత‌మైన చిత్రాల్లో న‌టించాన‌న్నారు. ఇక ఇప్పుడు ఇంత‌కు మించిన వేషాలేం వేస్తాం. ఆ కార‌ణంగా సినిమాల నుంచి విరామం తీసుకున్నాన‌న్నారు. న‌టిగా ఫ‌లానా పాత్ర చేయ‌లేక‌పోయాను అనే అసంతృప్తి త‌న‌కేం లేద‌న్నారు.

అన్ని ర‌కాల పాత్ర‌లు పోషించాన‌న్నారు. `మ‌నుషులు మారాలి` సినిమా నాలుగు భాష‌ల్లో తీస్తే వాట‌న్నింటిలోనూ తానే క‌థానాయిక‌గా న‌టించి ప్రేక్ష‌కుల్ని అల‌రించాన‌ని గుర్తు చేసుకున్నారు. అప్ప‌ట్లో అదో రికార్డు. ప్ర‌స్తుతం శార‌ద సినిమాలు కూడా చూడ‌టం మానేసిన‌ట్లు తెలిపారు. `కొన్నాళ్ల క్రితం కంటికి ఆప‌రేష‌న్ జ‌రిగింది. డాక్ట‌ర్లు క‌ళ్ల‌పై ఒత్తిడి ప‌డ‌కుండా చూసుకోమ‌న్నారు. దీంతో సినిమాల‌తో పాటు, టీవీ చూడ‌టం కూడా మానేసా`న‌న్నారు. ఉద‌యం లేచిన వెంట‌నే ధ్యానం చేసుకోవ‌డం..ఆ త‌ర్వాత దైవారాధ‌న‌లో ఎక్కువ స‌మ‌యం గడుపుతున్న‌ట్లు తెలిపారు.

నెల‌కొసారి మాత్రం ఇంటి ద‌గ్గ‌ర్లో ఉన్న గుడికి త‌ప్ప‌నిసరిగా వెళ్తున్న‌ట్లు చెప్పారు. అప్పుడ‌ప్పుడు జాన‌కి, మ‌ణిమా ల‌తో ఫోన్లో మాట్లాడ‌టం మిన‌హా క‌ల‌వ‌డం పెద్ద‌గా చేయ‌డం లేద‌న్నారు. ప్ర‌స్తుతం శార‌ద వ‌య‌సు 80 ఏళ్లు. చెన్నైలో స్థిర‌ప‌డ్డారు. శార‌ద అస‌లు పేరు స‌ర్వ‌స్వ‌తి దేవి. ఆమె ఇండ‌స్ట్రీకి వ‌చ్చే నాటికి చాలా మంది సర‌స్వ‌తి దేవిలు ఉండ‌టంతో? శార‌ద తండ్రి స‌ల‌హాతో స‌రస్వ‌తి అని అర్దం వ‌చ్చేలా శారదాగా మార్చారు. అయితే శార‌ద సినిమాల్లోకి వెళ్ల‌డం తండ్రికి ఎంత మాత్రం ఇష్టం లేదు. తల్లికి సినిమాలంటే ఆసక్తి ఉండ‌టంతో? త‌ల్లి ద్వారా తండ్రిని ఒప్పించి న‌టిగా రంగ ప్ర‌వేశం చేసారు. కానీ ఒప్పించే క్ర‌మంలో శారద త‌ల్లి చాలా ఇబ్బంది ప‌డ్డారు.