శ్రీహరిని 'మగధీర' లో నటించొద్దన్నారా?
దాదాపు పదిహేడేళ్ల క్రితం జక్కన్న తెరకెక్కించిన ఎపిక్ రొమాంటిక్ ఫాంటసీ యాక్షన్ డ్రామా `మగధీర`. గత జన్మల ప్రేమ, ప్రతీకారం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌ని కీలక మలుపు తిప్పింది.
By: Ravindar Gorantla | 29 April 2026 5:00 PM ISTదాదాపు పదిహేడేళ్ల క్రితం జక్కన్న తెరకెక్కించిన ఎపిక్ రొమాంటిక్ ఫాంటసీ యాక్షన్ డ్రామా `మగధీర`. గత జన్మల ప్రేమ, ప్రతీకారం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌ని కీలక మలుపు తిప్పింది. రూ.35 కోట్ల బడ్జెట్‌తో చేసిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించి తెలుగు సినిమా సత్తా ఏంటో ఇండియన్ బాక్సాఫీస్‌కు తెలియజెప్పి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురి చేసింది.
దర్శకుడిగా రాజమౌళి టాలెంట్‌తో పాటు దర్శకుడిగా ఆయనకున్న ప్రొటెన్షియాలిటీని యావత్ సినీ ప్రపంచానికి తెలియజెప్పి `బాహుబలి`కి బాటలు వేసింది. ఈ మూవీ అందించిన సక్సెస్ ధైర్యాన్నివ్వడం వల్లే జక్కన్న ఇండియన్ సినిమా బాక్సాఫీస్ లెక్కల్ని సమూలంగా మార్చేసిన `బాహుబలి`కి అంకురార్పణ చేశారు. ఈ మూవీలో రామ్ చరణ్ భైరవగా, హర్షగా రెండు విభిన్నమైన పాత్రల్లో నటించి ఆకట్టుకోవడమే కాకుండా హీరోగా తన స్టార్‌డమ్‌ని మరో స్థాయికి తీసుకెళ్లడం తెలిసిందే.
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్‌ల సునామీని సృష్టించిన ఈ మూవీలో రియల్ స్టార్ శ్రీహరి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో షేర్ ఖాన్‌గా పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో నటించిన విషయం తెలిసిందే. కీలక యాక్షన్ సీక్వెన్స్‌లో షేర్ ఖాన్‌గా శ్రీహరి పలికించిన హావ భావాలు, ప్రదర్శించిన నటన సినిమాకే హైలైట్‌గా నిలిచి ఆ ఎపిసోడ్‌ని సినిమాకే హైలైట్ అయ్యేలా చేసింది. శ్రీహరి లేకపోతే షేర్ ఖాన్ క్యారెక్టర్‌లో ఎవరినీ ఊహించుకోలేరు. అంతలా ఆ క్యారెక్టర్‌ని తనదైన మేనరిజమ్స్‌తో శ్రీహరి రక్తికట్టించి ఔరా అనిపించారు.
అయితే ఆ క్యారెక్టర్‌లో నటించడం, అసలు మగధీర చేయడమే శ్రీహరి భార్య, నటి శాంతికి ఇష్టం లేదట. అదే విషయాన్ని రీసెంట్‌గా ఓ పోడ్ కాస్ట్‌లో వెల్లడించి షాక్ ఇచ్చింది. శ్రీహరి హీరోగా కాకుండా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయడం తనకు ఇష్టం లేదని, అందుకే `మగధీర` సినిమా చేయొద్దని తన భర్తకు చెప్పానని తెలిపింది శాంతి. `మగధీర` సినిమా అవకాశం వచ్చే సమయానికి శ్రీహరి హీరో క్యారెక్టర్‌లు తగ్గించుకుని సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తున్నారు.
అలా చేయడం నాకు ఇష్టం లేదని తెలిపింది. ఎందుకంటే నేను ఒక హీరో వైఫ్‌ని అని ఊహించుకుంటూ ఉండిపోయాను. హీరో హీరోనే. సపోర్టింగ్ క్యారెక్టర్ సపోర్టింగ్ క్యారెక్టరే అనుకునే దాన్ని` అని తెలిపారు శాంతి. ప్రభుదేవా రూపొందించిన హిందీ మూవీ `ఆర్..రాజ్‌కుమార్` సినిమా కోసం ముంబై వెళ్లిన శ్రీహరి అక్కడే ఆరోగ్యం క్షీణించడంతో 2013, అక్టోబర్ 9న మృతి చెందడం తెలిసిందే. ఆయన అకాల మరణంతో ఇండస్ట్రీతో పాటు ఆయనని అభిమానించే అభిమానులు అంతా షాక్‌కు గురయ్యారు.
