Begin typing your search above and press return to search.

అంతర్జాతీయ వేదికలపై భారతీయ సంగీత విప్లవం!

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సంగీతానికి లభిస్తున్న ఆదరణపై ఆస‌క్తిక‌ర‌ విషయాలను పంచుకున్నారు.

By:  Srikanth Kontham   |   22 Jun 2026 8:15 AM IST
అంతర్జాతీయ వేదికలపై భారతీయ సంగీత విప్లవం!
X

జూన్ 21 ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సంగీతానికి లభిస్తున్న ఆదరణపై ఆస‌క్తిక‌ర‌ విషయాలను పంచుకున్నారు. గ్లోబల్ మ్యూజిక్ స్టేజ్‌పై భారతీయ కళాకారులు అద్భుతాలు సృష్టిస్తు న్నారని.. మన సంస్కృతి.. సంగీత శైలి ప్రపంచాన్ని అమితంగా ఆకట్టుకుంటోందని ఎంతో గర్వంగా చెప్పుకొచ్చారు.

ఒకప్పుడు భారతీయ సంగీతం అంటే కేవలం సినిమా పాటలకే పరిమితమనే భావన ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని శంకర్ మహదేవన్ అభిప్రాయపడ్డారు. సాంప్రదాయ శాస్త్రీయ సంగీతం (క్లాసికల్ మ్యూజిక్) నుండి సమకాలీన ఫ్యూజన్ మ్యూజిక్ వరకు ప్రతి ఒక్క శైలి అంతర్జాతీయ శ్రోతలను అలరిస్తోంది. విదేశీయులు సైతం మన రాగాలు, తాళాల పట్ల ఆకర్షితులవుతుండటం భారతీయ సంగీత సత్తాకు నిదర్శనమని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారతీయ కళాకారుల ప్రతిభకు దక్కిన గౌరవానికి ఇటీవల సాధించిన అవార్డులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గ్రామీ అవార్డ్స్ వంటి ప్రతిష్టాత్మక వేదికలపై శంకర్ మహదేవన్ భాగస్వామిగా ఉన్న శ‌క్తి బ్యాండ్ సాధించిన విజయం.. ఇతర భారతీయ సంగీతకారుల గ్లోబల్ ప్రదర్శనలు ప్రపంచ వేదికపై మన స్థాయిని మరింత పెంచాయన్నారు.

ఈ రకమైన అంతర్జాతీయ గుర్తింపులు యువ తరం మ్యుజీషియన్లకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయని శంక‌ర్ మ‌హ‌దేవ‌న్ స్పష్టం చేశారు. భారతీయ సంగీతకారులలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే? వారికున్న లోతైన శాస్త్రీయ సంగీత పునాది. ఈ బలమైన పునాది వల్లే ప్రపంచంలోని ఏ రకమైన సంగీత శైలితోనైనా సులభంగా కలిసిపోగలరని శంకర్ మహదేవన్ వివరించారు. జాజ్, పాప్, వెస్ట్రన్ క్లాసికల్ వంటి విదేశీ ప్రక్రియలతో మన కర్ణాటక లేదా హిందుస్తానీ సంగీతాన్ని మిళితం చేసినప్పుడు పుట్టే సరికొత్త ధ్వని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజిక్ లవర్స్‌కు సరికొత్త అనుభూతిని ఇస్తోందన్నారు.

ప్రస్తుత డిజిటల్ విప్లవం, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి రావడం వల్ల సరిహద్దులనేవి పూర్తిగా చెరిగిపోయాయని శంకర్ మహదేవన్ పేర్కొన్నారు. ఒకప్పుడు తమ సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేదని.. కానీ నేడు ఇంటర్నెట్ సాయంతో స్వతంత్ర కళాకారుడు కూడా తన ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి నేరుగా చేర వేయగలుగుతున్నాడన్నారు. ఈ సాంకేతిక మార్పు భారతీయ సంగీత వ్యాప్తికి ఎంతో దోహదపడుతోందని అభిప్రాయపడ్డారు.

అలాగే యువ సంగీతకారులకు శంక‌ర్ ఓ ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. మన మూలాలను, సాంప్రదాయాలను ఎప్పటికీ మరువకుండానే సరికొత్త ప్రయోగాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వేదికలపై భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగురవేయడానికి రాబోయే తరాల వారు మరింత సృజనాత్మకతతో ముందుకు సాగాలని, భారతీయ సంగీత భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉండబోతోందని శంకర్ మహదేవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.