ఇక నుంచి భిన్నమైన ఆదిని చూస్తారు
``ఇప్పటివరకూ చూసిన ఆది వేరు. ఇక నుంచి చూడబోయే ఆది వారు. డిఫరెంట్ ఆదిని చూస్తారు`` అని అన్నాడు ఆది సాయికుమార్.
By: Sivaji Kontham | 30 Dec 2025 12:23 AM IST``ఇప్పటివరకూ చూసిన ఆది వేరు. ఇక నుంచి చూడబోయే ఆది వారు. డిఫరెంట్ ఆదిని చూస్తారు`` అని అన్నాడు ఆది సాయికుమార్. అతడు నటించిన శంబాల సక్సెస్ సాధించిన సందర్భంగా, వేదికపై ఆది సాయికుమర్ ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. ఇక మీదట ఈ సక్సెస్ ని ఇలానే ముందుకు తీసుకెళతానని ఆది అన్నారు. ఈ వేదిక వద్ద సాయికుమార్ కుటుంబం అంతా కొలువు దీరడం మరో కొసమెరుపు. సాయికు మార్ సోదరులు రవిశంకర్, అయ్యప్ప శర్మ తదితరులు వేడుకలో పాల్గొన్నారు.
``ఈ సినిమా చూసిన వారంతా నాకు మెసేజ్‌లు పెడుతున్నారు. చాలా బావుంది అని ప్రశంసిస్తున్నారు. దీనిని మీరంతా థియేటర్లలో చూసి ఆదరించినందుకు ధన్యవాదాలు`` అని అన్నారు ఆది సాయి కుమార్. ఇక ఇదే వేదికపై రవిశంకర్, అయ్యప్ప శర్మ ఆదికి శుభాకాంక్షలు తెలిపారు.
దర్శకనటుడు అయ్యప్ప శర్మ మాట్లాడుతూ-``సినిమాలు వస్తుంటాయ.. వెళుతుంటాయి.. కొన్ని ఆడుతుంటాయి.. నా ఉద్ధేశంలో ``నచ్చిన సినిమాలు నచ్చని సినిమాలే`` ఉంటాయి. శంబాల ఇంత మంచి విజయం సాధించడానికి కారకులు మొదటగా నిర్మాతలు .. వారితోనే సినిమా మొదలవుతుంది. ఒక సినిమా బయటకు వచ్చి సక్సెసైతే , ఆ యూనిట్ ఫ్యామిలీ ఆనందంగా ఉంటారు .. ఇప్పుడు ఆది విజయంతో ఇండస్ట్రీ అంతా సంతోషంగా ఉంది. ఈ సినిమాని ఇంత బాగా తీర్చిదిద్దినది దర్శకుడు. హిట్టివ్వడం సరే కానీ, హిట్టును నిలబెట్టుకోవడమే కష్టం. దానిని నిలబెట్టుకోమని ఆదికి సూచించాను. ఆదికి ఈ సినిమా ఎంత ముఖ్యమో..ఆయన నాన్న(సాయికుమార్) గారికి అంతే ముఖ్యం. బాగా క్రికెట్ ఆడుతూ సినిమాలు చేసాడు. విజయం సాధించాడు`` అని అన్నారు. కేజీఎఫ్ 1 వచ్చేప్పటికి యష్ తో పాటు అందరూ కొత్తవాళ్లే.. ఇప్పుడు ఈ శంబాల స్టేజీ చూసినా కొత్తవాళ్లతో అలాగే కనిపిస్తోంది. ఇకపైనా పెద్దగా ఎదగాలి.. అని అన్నారు. యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ పతాకంపై మహీందర్ రెడ్డి, రాజశేఖర్ నిర్మించారు.
రవిశంకర్ మాట్లాడుతూ-``ఒక కొత్త దర్శకుడిని ఆయన విజన్, కథను- హీరోను నమ్మి నిర్మాతలు రాజీ లేకుండా నిర్మించారు. వారికి శుభాకాంక్షలు. యుగంధర్ ముని మా కుటుంబం చాలా కాలంగా కోరుకుంటున్న విజయం ఇచ్చాడు. ఆయనకు ధన్యవాదాలు. శ్రీచరణ్ సంగీతం అద్భుతం. ఆది చదువుతో పాటు క్రికెట్ కూడా బాగా ఆడాడు. అయితే క్రికెట్ లోకి వెళతాడనుకుంటే, సినిమాల్లోకి వస్తానని అన్నాడు. మమ్మల్ని చూసి నటుడవ్వొద్దు.. హార్డ్ వర్క్ చేయాలని అన్నాను. నటన లో చాలా శ్రమించాడు. ఇప్పుడు మంచి విజయం అందుకున్నాడు`` అని అన్నారు. వేదికపై ఆది సాయికుమార్, సాయికుమార్ సహా చిత్రబృందం పాల్గొంది.
