నిశబ్దం తర్వాత శబ్దమే లేదే!
'అర్జున్ రెడ్డి' విజయం తర్వాత షాలిని పాండే వరుసగా పెద్ద ప్రాజెక్టులను సొంతం చేసుకుంటుందని అంతా భావించారు.
By: Srikanth Kontham | 20 July 2026 8:00 PM ISTఒకే ఒక్క సినిమాతో సంచలనం సృష్టించిన నటీమణులలో షాలిని పాండే ఒకరు. 'అర్జున్ రెడ్డి' చిత్రంలో ప్రీతి పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు, ఆ సినిమా సాధించిన ఘనవిజయం అమ్మడికి స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టాయి. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న షాలిని ఆ తర్వాత మరిన్ని విజయాలను అందుకోవడంలో వెనుకబడటం అంతే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చివరిగా 'నిశ్శబ్దం' లో నటించింది. కానీ ఆ తర్వాత టాలీవుడ్‌లో సరైన అవకాశాలు అందుకోలేకపోయింది.
'అర్జున్ రెడ్డి' విజయం తర్వాత షాలిని పాండే వరుసగా పెద్ద ప్రాజెక్టులను సొంతం చేసుకుంటుందని అంతా భావించారు. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు అమ్మడి కెరీర్ గ్రాఫ్‌ను ఆశించిన స్థాయిలో ముందుకు తీసుకెళ్లలేకపోయాయి. కమర్షియల్ సక్సెస్‌లు దక్కకపోవడమో? లేక కథల ఎంపికలో జరిగిన లోపాలో? ఏదైతేనేం టాలీవుడ్ అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలు షాలిని సంప్రదించడంలో వెనకడుగు వేశాయి. ఇది ఆమె కెరీర్‌ను కొంతకాలం పాటు నిశ్శబ్దంలోకి నెట్టేసింది.
ప్రస్తుతం షాలిని దృష్టి కోలీవుడ్ .. బాలీవుడ్ వైపు మళ్లించింది. అక్కడ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. హిందీలో కొన్ని భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ ప్రతిభను చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. భాష ఏదైనా? అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలన్న తపన అమ్మడిలో బలంగా ఉంది. తెలుగులో గ్యాప్ వచ్చినప్పటికీ ఇతర భాషల్లో నిలదొక్కుకోవడం ద్వారా ఉనికిని చాటుకోవాలని చూస్తోంది.
నటి కెరీర్‌లో ఒడిదుడుకులు సహజం. అయితే 'అర్జున్ రెడ్డి' లాంటి ఐకానిక్ చిత్రం తర్వాత దానికి మించిన పాత్రలను ఎంచుకోవడం కష్టంతో కూడుకున్న పనే. బహుశా షాలిని పాండే అదే సవాలును ఎదుర్కొంటున్నట్లు అనిపిస్తుంది. పాత్ర ఏదైనా? అందులో కొత్తదనం కోసం అన్వేషిస్తోంది. ఇది అభినందించదగ్గ విషయమే అయినా? పరిశ్రమకు కావాల్సిన కమర్షియల్ సక్సెస్‌ను అమ్మడు అందించలేకపోవడమే సమస్యగా మారింది.
సమయం కలిసి రానప్పుడు ఎంతటి ప్రతిభ ఉన్నా? నిలదొక్కుకోవడం సవాలుగా మారుతుంది. షాలిని పాండే విషయంలోనూ ఇదే జరిగి ఉండొచ్చు. ఎంచుకున్న ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలుకావడం, సరైన సమయంలో సరైన హిట్ పడకపోవడం పరిశ్రమలో వెనుకబడేలా చేశాయి. అయితే ఆమెలో ఉన్న నటన పట్ల అంకితభావం, గ్లామర్‌తో పాటు పర్ఫార్మెన్స్ చేయగల సామర్థ్యం మళ్ళీ రేసులోకి తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదు.
తెలుగు పరిశ్రమలో షాలిని క్రేజ్ ఇంకా పూర్తిగా చెరిగిపోలేదు. సరైన స్క్రిప్ట్ దొరికితే మళ్ళీ సత్తా చాటడానికి ఎంతో కాలం పట్టదు. హిందీ .. తమిళ పరిశ్రమల్లో అమ్మడు పడుతోన్న కష్టం త్వరలోనే ఫలితాన్నిచ్చి ఆమెను తిరిగి విజయపథంలో నడిపిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. షాలిని టాలీవుడ్ లో గొప్ప కమ్-బ్యాక్ కోసం ఎదురు చూస్తోంది.
