అర్జున్ రెడ్డి బ్యూటీకి స్టార్ హీరో సినిమాలో ఛాన్స్
టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా చేసిన హంగామా అంతా ఇంతా కాదనేది మళ్లీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By: Sravani Lakshmi Srungarapu | 17 Aug 2025 11:56 AM ISTటాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా చేసిన హంగామా అంతా ఇంతా కాదనేది మళ్లీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన అర్జున్ రెడ్డి రిలీజ్ తర్వాత సంచలనాల్ని సృష్టించింది. హీరోగా విజయ్ కెరీర్ ను ఈ సినిమా మలుపు తిప్పింది. అర్జున్ రెడ్డి సక్సెస్ తో డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగా మంచి పేరు తెచ్చుకోగా, విజయ్ టైర్2 హీరోల లిస్ట్ లోకి అడుగుపెట్టాడు.
ఒక్కమాటలో చెప్పాలంటే అర్జున్ రెడ్డి సినిమాకు వర్క్ చేసిన ప్రతీ ఒక్కరి జీవితాలను ఆ సినిమా మార్చేసింది. కానీ ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ ను హీరోయిన్ షాలినీ పాండే మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది. అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతిగా నటించి తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించిన షాలినీకి ఆ సినిమా తర్వాత అవకాశాలైతే చాలానే వచ్చాయి కానీ స్టోరీ సెలెక్షన్ లో జరిగిన పొరపాట్ల వల్ల అవేమీ అమ్మడికి స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టలేకపోయాయి.
బాలీవుడ్‌లోనూ చుక్కెదురు
ఆ తర్వాత షాలినీ బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేసింది. కానీ అక్కడ కూడా అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు. గతేడాది ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో కలిసి మహారాజ్ అనే ఓటీటీ ఫిల్మ్ చేస్తే అది కూడా షాలినీకి నిరాశనే మిగిల్చింది. దీంతో షాలినీ ప్రస్తుతం ఓ సాలిడ్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే షాలినీకి ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది.
హీరోయిన్‌గా కాదు
కోలీవుడ్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ మూవీ ఇడ్లీ కడై సినిమాలో షాలినీ ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. అయితే ఆ సినిమాలో షాలినీ హీరోయిన్ గా నటిస్తుందని ముందు అన్నారు కానీ అందులో ఏ మాత్రం నిజం లేదట. ఇడ్లీకడై సినిమాలో షాలినీ ధనుష్ కు చెల్లిగా కనిపించనుందని, చెల్లి క్యారెక్టరే అయినా కథలో ఆ పాత్ర చాలా కీలకంగా ఉంటుందంటున్నారు.
ఆరేళ్ల తర్వాత తిరిగి కోలీవుడ్‌లో..
సినిమాలో ధనుష్, షాలినీ కాంబినేషన్లో వచ్చే సీన్లు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయంటున్నారు. అయితే ఈ మూవీలో షాలినీకి భర్త పాత్రలో అరుణ్ విజయ్ కనిపిస్తారంటున్నారు. కాగా షాలినీ 2019లో 100% కాదల్, గోరిల్లా సిఇనమాలు చేసింది. ఆ తర్వాత కోలీవుడ్ లో సినిమాలు చేయలేదు. ఇప్పుడు మళ్లీ ఆరేళ్ల తర్వాత ఇడ్లీకడై సినిమాతో తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న షాలినీ ఈ సినిమాతో ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇడ్లీకడై తప్పక తనకు మంచి కంబ్యాక్ ఇస్తుందని ఎంతో నమ్మకంగా ఉంది షాలినీ. అక్టోబర్ 1న ఇడ్లీ కడై రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
