Begin typing your search above and press return to search.

ముఖేష్ ఖన్నా విమర్శలు ప్రమోషన్ వ్యూహమేనా?

90వ దశకంలో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అంద‌ర్నీ అలరించిన ఈ ధారావాహికను వెండితెరపై భారీ బడ్జెట్‌తో పునఃసృష్టి చేయడానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి

By:  Srikanth Kontham   |   8 Jun 2026 1:00 AM IST
ముఖేష్ ఖన్నా విమర్శలు ప్రమోషన్ వ్యూహమేనా?
X

టెలివిజన్ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించిన సూపర్ హీరో సిరీస్ `శక్తిమాన్`. 90వ దశకంలో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అంద‌ర్నీ అలరించిన ఈ ధారావాహికను వెండితెరపై భారీ బడ్జెట్‌తో పునఃసృష్టి చేయడానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఐకానిక్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించబోతున్నారనే వార్తలు రావడం.. ఆ వెంటనే ప్రాజెక్ట్ చుట్టూ రకరకాల వివాదాలు, ప్రకటనలు ముసు రుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి శక్తిమాన్ ఒరిజినల్ సృష్టికర్త, నటుడు ముఖేష్ ఖన్నా ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి.

రణ్‌వీర్ సింగ్ ఈ పాత్రకు సరిపోరని ఆయనను తాను రిజెక్ట్ చేశానని ముఖేష్ ఖన్నా బహిరంగంగా ప్రకటించారు. ఒక సూపర్ హీరో పాత్రకు ఉండాల్సిన హుందాతనం, ఇమేజ్ రణ్‌వీర్ సింగ్‌కు లేవంటూ ఆయన చేసిన విమర్శలు ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్నే రేపాయి. ప్రతిష్టాత్మక చిత్రం పట్టాలెక్కక ముందే ఇలాంటి వ్యతిరేక ప్రకటనలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఇదే సీరియ‌ల్ లో నెగటివ్ పాత్ర పోషించిన‌ సీనియర్ నటుడు లలిత్ పరిమూ భిన్నమైన కోణంలో స్పందించారు.

ముఖేష్ ఖన్నా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం వేరే ఉందని విశ్లేషించారు. రణ్‌వీర్ సింగ్‌ను తిరస్కరించడం అనే అంశం కేవలం పబ్లిసిటీ గిమ్మిక్ మాత్రమే అయ్యే అవకాశం ఉందని లలిత్ పరిమూ అభిప్రాయపడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. సినిమా రంగంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ లేదా పాత్ర గురించి నిరంతరం చర్చ జరగాలన్నా? ప్రజల్లో ఆసక్తి సజీవంగా ఉండాలన్నా? ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు ఒక వ్యూహంగా ఉపయోగపడుతుంటాయి. ముఖేష్ ఖన్నాకు శక్తిమాన్ బ్రాండ్‌ను ఎలా ప్రమోట్ చేయాలో బాగా తెలుసని.. అందుకే ప్రాజెక్ట్ వార్తల్లో నిలిచేలా చేయడానికి ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని పరిమూ అభిప్రాయ‌ప‌డ్డారు.

నిజానికి రణ్‌వీర్ సింగ్‌ను ఈ ప్రాజెక్ట్ నుండి పూర్తిగా పక్కన పెట్టే అవకాశం ఉండకపోవచ్చని ప‌రిమూ అంచనా వేశారు. రణ్‌వీర్ సింగ్ నటన - ప్రతిభను లలిత్ పరిమూ ఈ సందర్భంగా సమర్థించారు. రణ్‌వీర్ అద్భుతమైన నటుడని, వర్సటాలిటీ కలిగిన నటుడిగా తనను తాను ఇప్పటికే నిరూపించుకున్నాడని కొనియాడారు. నటన పరంగా రణ్‌వీర్ సామర్థ్యాన్ని తక్కువంచనా వేయలేమని దర్శకుడు - స్క్రిప్ట్ సరిగ్గా కుదిరితే ఆయన శక్తిమాన్ పాత్రకు ఖచ్చితంగా న్యాయం చేయగలరనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ముఖేష్ ఖన్నా వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగానే నటుడిని నిర్ధారించలేమని స్పష్టం చేశారు. మ‌రి ఈ అభ్యంత‌రాలు..నిర‌భ్యంత‌రాల మ‌ధ్య భారీ ప్రాజెక్ట్ భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.