Begin typing your search above and press return to search.

కొడుకుల ఎఫైర్ల గురించి ప్ర‌శ్నిస్తే సింపుల్‌గా..!

బాలీవుడ్ లో ఆ ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్ న‌టులుగా ట్యాలెంటెడ్ అని నిరూపించుకున్నారు. అయితే ఆ ఇద్ద‌రూ వ్య‌క్తిగ‌త ఎఫైర్ల కార‌ణంగాను నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చారు.

By:  Sivaji Kontham   |   2 Jan 2026 1:00 AM IST
కొడుకుల ఎఫైర్ల గురించి ప్ర‌శ్నిస్తే సింపుల్‌గా..!
X

బాలీవుడ్ లో ఆ ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్ న‌టులుగా ట్యాలెంటెడ్ అని నిరూపించుకున్నారు. అయితే ఆ ఇద్ద‌రూ వ్య‌క్తిగ‌త ఎఫైర్ల కార‌ణంగాను నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చారు. బ్ర‌ద‌ర్స్ ఎఫైర్ల గురించి వారి త‌ల్లినే సూటిగా ప్ర‌శ్నిస్తే, అట్నుంచి వ‌చ్చిన స‌మాధానం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆ ఇద్ద‌రు హీరోలు ఎవ‌రు? అంటే... షాహిద్ క‌పూర్- ఇషాన్ ఖ‌త్త‌ర్. యుక్త‌వ‌య‌సులో షాహిద్ కపూర్ ప‌లువురు క‌థానాయిక‌ల‌తో ఎఫైర్లు న‌డిపించాడు. ఇండ‌స్ట్రీ టాప్ హీరోయిన్స్ క‌రీనాక‌పూర్, ప్రియాంక చోప్రాల‌తో డీప్ గా ప్రేమాయ‌ణాలు సాగించాడు. కానీ ఆ త‌ర్వాత అన్ని ప్రేమ క‌థ‌లు బ్రేక్ అయ్యాయి.

ఇషాన్ ఖ‌ట్ట‌ర్ కూడా త‌న అన్న షాహిద్‌నే ఫాలో అయ్యాడు. అత‌డు కెరీర్ ప్రారంభించి న‌టించిన‌ది మూడు నాలుగు సినిమాలే అయినా ఎఫైర్ల‌తో నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తున్నాడు. అత‌డు త‌న క‌థానాయిక‌ల‌తో డేటింగులు చేసాడంటూ ప్ర‌చార‌మైంది. `ధ‌డ‌క్` చిత్రంతో ఆరంగేట్రం చేసిన ఇషాన్ ఆ సినిమా క‌థానాయిక జాన్వీతో డేటింగ్ చేసాడంటూ క‌థ‌నాలొచ్చాయి. ఆ త‌ర్వాత `ఖ‌లీ పీలీ`లో అన‌న్య పాండేతో క‌లిసి న‌టించాడు. ఆ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఎఫైర్ కొన‌సాగింద‌ని ప్ర‌చార‌మైంది.

అయితే ఇదే విష‌యాన్ని షాహిద్- ఇషాన్ బ్ర‌ద‌ర్స్ కి త‌ల్లి అయిన నీలిమా అజీమ్‌ని ప్ర‌శ్నించ‌గా, త‌ను ఇచ్చిన స‌మాధానం చాలా సింపుల్‌గా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ``ఒక‌రి వ్య‌క్తిగ‌త జీవితాల గురించి తాను మాట్లాడ‌లేన‌ని, నా వ్య‌క్తిగ‌త జీవితం గురించి ఎన్ని ప్ర‌శ్న‌లు వేసినా జ‌వాబు చెబుతాను అని నీలిమా అన్నారు. ఎదిగొచ్చిన పిల్ల‌ల‌కు వ్య‌క్తిత్వాలు ఉంటాయ‌ని, వారి వ్య‌క్తిగ‌త జీవితాల గురించి తాను మాట్లాడ‌లేన‌ని అన్నారు నీలిమా. షాహిద్ పెద్ద‌వాడ‌య్యాడు.. పెళ్ల‌యింది. పిల్ల‌లు ఉన్నారు. అత‌డి గురించి నేను మాట్లాడ‌ను అని అన్నారు. అలాగే 23 ఏళ్ల వ‌య‌సులో అత‌డు ఇంటిని వ‌దిలి వెళ్లాడు. న‌టుడిగా కెరీర్ ప్రారంభించి పెద్ద ఎత్తుకు ఎదిగాడు. ఇక్క‌డ ఉన్న‌ప్పుడు త‌ల్లితోనే పెరిగాడు. ముంబై వెళ్లాక స్వ‌తంత్య్రంగా ఎదిగాడు అని తెలిపారు.

ఇషాన్ కూడా దాదాపు అదే వయస్సు(23)లో ఇంటిని విడిచి వెళ్ళాడు. వారు సొంతంగా పరిణితి చెందారు. వారు తమ మార్గాలను కళాత్మక సత్యాలను కనుగొన్నారు. వారు తమకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఇది మంచి విషయం.. ఎందుకంటే ఆ ఇద్ద‌రూ తమ జీవిత భాగస్వాములకు న‌చ్చే మ‌గాళ్లుగా ఉంటారు! అని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఒక గతం ఉంటుంది.. ప్రతి ఒక్కరికీ సంబంధాలు ఉంటాయి. వారి గురించి అన్ని విషయాలు నాతోనే చెబుతారు. కానీ నేను దానిని మరెవరితోనూ చెప్ప‌ను! అని నీలిమ అన్నారు.

ఇషాన్ కూడా తనతో అన్నీ చెబుతాడని, అయితే అతడి వ్యక్తిగత విషయాలను మీడియా ముందు బయటపెట్టనని నీలిమా క‌పూర్ చెప్పారు. కుటుంబంలో మా జీవితాల గురించి ఒకరికొకరం ఒక తెరిచిన పుస్తకంలా ఉంటామ‌ని అన్నారు. నేను వారిని గౌరవిస్తాను.. వారు పెద్దవాళ్ళు. వారికి చాలా బలమైన వ్యక్తిత్వాలు ఉన్నాయి.. నా గురించి నేను మాట్లాడగలను.. కానీ వారి జీవితాల గురించి మాట్లాడ‌ను.. వారు గోప్యంగా ఉంటారు! అని అన్నారు.

త‌న భ‌ర్త పంక‌జ్ క‌పూర్ నుంచి విడిపోవ‌డానికి కార‌ణ‌మేమిటో కూడా నీలిమా క‌పూర్ మాట్లాడారు. ఆ స‌మ‌యంలో తాను ఢిల్లీలో ఉన్నాన‌ని, అత‌డు ముంబైలో ఉన్నాడ‌ని `దూరాభారం` త‌మ‌ను విడ‌దీసింద‌ని అన్నారు. తాను త‌ల్లిదండ్రుల‌తోనే ఉన్నాన‌ని అన్నారు. అత‌డు న‌న్ను, షాహిద్ ను వ‌దిలి వెళ్లాల్సింది కాద‌ని కూడా వ్యాఖ్యానించారు.