టాప్ స్టోరి: ఆ భయంతోనే ఖాన్‌ల త్రయం ఇప్పుడిలా!
ఒకరి తర్వాత ఒకరుగా సౌత్ టెక్నీషియన్లు- స్టార్ డైరెక్టర్లతో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపుతుండటం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
By: Sivaji Kontham | 12 Sept 2026 7:00 PM ISTబాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దశాబ్దాలుగా తమ హవా సాగించిన ఖాన్‌ల త్రయం (షారుఖ్, సల్మాన్, అమీర్) ఇప్పుడు తమ వ్యూహాలను పూర్తిగా మార్చేసింది. నార్త్ మార్కెట్‌పైనే కాకుండా సౌతిండియా బాక్సాఫీస్‌పై పట్టు సాధించేందుకు ఈ ముగ్గురు స్టార్లు దక్షిణాది దర్శకుల వైపు చూస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరుగా సౌత్ టెక్నీషియన్లు- స్టార్ డైరెక్టర్లతో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపుతుండటం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
షారుఖ్ ఖాన్ తన తదుపరి సినిమాల కోసం సౌత్ దర్శకులపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఇప్పటికే అట్లీతో `జవాన్` వంటి బ్లాక్‌బస్టర్ అందుకుని సిద్ధార్థ్ ఆనంద్ `కింగ్` సినిమాలో నటిస్తున్నాడు. తర్వాత మరోసారి సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రశాంత్ నీల్, సుకుమార్, రాజమౌళి వంటి టాలీవుడ్ అగ్ర దర్శకులతో సినిమాలు చేయాలని షారుఖ్ ఉవ్విళ్లూరుతున్నారు. తెలుగు, తమిళ కమర్షియల్ ఫిలింమేకర్స్ (మైత్రి మూవీమేకర్స్ కూడా ఉంది) ట్రాక్‌ను ఫాలో అవుతూ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకోవాలని ఆయన భావిస్తున్నారు.
మరోవైపు సల్మాన్ ఖాన్ కూడా టాలీవుడ్ బాట పట్టారు. ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి- నిర్మాత దిల్ రాజు కాంబినేషన్‌లో ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఆయన నటిస్తున్నారు. వంశీ ప్రాజెక్ట్ విజయవంతం అయిన తర్వాత టాలీవుడ్‌లోని ఇతర ప్రముఖ డైరెక్టర్లతో కూడా సినిమాలు చేసేందుకు సల్మాన్ ఆసక్తిగా ఉన్నారు. బాలీవుడ్ కమర్షియల్ ఫార్ములాలకు సౌత్ మాస్ ఎలివేషన్స్ జోడిస్తేనే పాన్ ఇండియాలో వర్కౌట్ అవుతుందని కండల హీరో గట్టిగా నమ్ముతున్నారు.
ఇక మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సైతం సౌత్ మేకర్స్‌తో భారీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక హై-ఆక్టేన్ సూపర్ హీరో సినిమాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `మహాభారత్`ను దక్షిణాది నటులు, టెక్నీషియన్లతో చేయాలని భావిస్తున్న ఆయన రాజమౌళి లేదా ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో పనిచేసే అవకాశాల కోసం కూడా ఎదురుచూస్తున్నారు.
ఈ ముగ్గురు ఖాన్‌లు ఇలా ఒక్కసారిగా సౌత్ దర్శకుల వెంట పడటానికి ప్రధాన కారణం బాక్సాఫీస్ వసూళ్లేనని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇటు ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి సౌత్ హీరోలు పాన్-ఇండియా రేసులో దూసుకుపోతుండగా... అటు రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్ వంటి యంగ్ హీరోలు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ పోటీలో తాము వెనుకబడిపోతామనే భయంతోనే ఖాన్‌ల త్రయం ఇప్పుడు సౌత్ డైరెక్టర్లను నమ్ముకుంటూ పావులు కదుపుతోంది. ఎంత పెద్ద హీరోలు అయినా పోటీ ప్రపంచంలో జీవించాలంటే, ముందుకు సాగాలంటే భయంతో జీవించాలని మరోసారి ప్రూవ్ అయినట్టే!
