షారూఖ్ షష్ఠిపూర్తికి టాలీవుడ్ నుంచి ఎవరు హాజరవుతున్నారు?
నవంబర్ 2 బిగ్ డే సెలబ్రేషన్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
By: Sivaji Kontham | 31 Oct 2025 10:10 AM ISTబాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ ప్రస్తుతం `కింగ్` చిత్రీకరణలో బిజీబిజీగా ఉన్నారు. ఇంతలోనే అతడి పుట్టినరోజు ఉత్సవాలకు సమయమాసన్నమైంది. అయితే ఈసారి బర్త్ డే చాలా ప్రత్యేకమైనది. నవంబర్ 2 బిగ్ డే సెలబ్రేషన్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఖాన్ వయసు 60ని తాకుతోంది గనుక షష్ఠిపూర్తి ఉత్సవాలకు రెడీ అవుతున్నాడు.
అయితే ఈసారి కింగ్ ఖాన్ ఎప్పటిలాగే `మన్నత్`లో పుట్టినరోజు ఉత్సవాలు జరుపుకునేందుకు ఆస్కారం లేదు. అక్కడ అతడి అభిమానులు సిగ్నేచర్ ఫోజ్ ని చూడాలని ఉత్సాహపడుతున్నా, అందుకు అకాశం లేనే లేదు. ఎందుకంటే బాంద్రా(ముంబై) వెస్ట్ లోని `మన్నత్`కి ఇప్పటికే రిపెయిర్లు జరుగుతున్నాయి. ఇంటికి ఒక వైపున భారీగా విస్తరణ పనులు కూడా సాగుతున్నాయి. కొన్ని కోర్టు సమస్యలు ఉన్నా కానీ ఖాన్ కుటుంబం వాటిని పరిష్కరించుకుంటోందని సమాచారం.
ఇకపోతే కింగ్ ఖాన్ షష్ఠిపూర్తి ఉత్సవాలకు ఎవరెవరు అతిథులుగా హాజరవుతారు? అన్న చర్చ అభిమానుల్లో వేడెక్కిస్తోంది. ఖాన్ మునుపటితో పోలిస్తే తన సంబంధాలను సౌత్ కి కూడా విస్తరించాడు. ఇప్పుడు కేవలం ఖాన్ ల త్రయంలో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ మాత్రమే కాదు, ఇటు దక్షిణాదినా రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్, ప్రభాస్, అల్లు అర్జున్ సహా చాలా మంది దిగ్గజ హీరోలు, దర్శకులతో సత్సంబంధాలను కలిగి ఉన్నాడు. అందువల్ల షష్ఠిపూర్తికి దక్షిణాది నుంచి ఎవరెవరిని ఆహ్వానిస్తాడో చూడాలని ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఉత్సాహం చూపిస్తున్నారు.
ఈసారి తన పుట్టినరోజును షారూఖ్ ఖాన్ అలీబాగ్‌లో జరుపుకుంటారని సమాచారం. ఈటైమ్స్ కథనం ప్రకారం..షారుఖ్ ఖాన్ తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి తన అలీబాగ్ ఇంట్లో పుట్టినరోజు జరుపుకుంటారు. ఇప్పటికే సన్నిహితులకు ఆహ్వానాలు అందాయి. నవంబర్ 1 నాటికి అందరూ అలీబాగ్‌కు చేరుకుంటారని తెలుస్తోంది. ఈ వేడుకల్లో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా మారతారని కూడా భావిస్తున్నారు. అలాగే అంబానీల కుటుంబం నుంచి పలువురు అతిథులుగా హాజరవుతారని తెలుస్తోంది.
మరోవైపు తన పుట్టినరోజును పురస్కరించుకుని ఖాన్ తన అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. అతడు నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `కింగ్` ఫస్ట్ లుక్ నవంబర్ 2న విడుదల కానుంది. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఎక్స్ ఖాతాలో దీని గురించి ఇప్పటికే హింట్ ఇచ్చాడు.
కింగ్ చిత్రంలో అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ, దీపికా పదుకొనే, సుహానా ఖాన్, అనిల్ కపూర్, అర్షద్ వార్సీ, అభయ్ వర్మ, జైదీప్ అహ్లవత్, రాఘవ్ జుయల్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 2026లో గాంధీ జయంతి వారాంతంలో విడుదలవుతుందని కథనాలొస్తున్నా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
