స్టార్ హీరో 1500 కుటుంబాల దత్తత దేనికోసం?
వరదలకు పంజాబ్ లోని కొన్ని ప్రాంతాలు దారుణంగా దెబ్బ తిన్నాయి. భారీ వర్షాలకు ఇల్లు కొట్టుకుపోయాయి.
By: Sivaji Kontham | 12 Sept 2025 7:00 PM ISTవరదలకు పంజాబ్ లోని కొన్ని ప్రాంతాలు దారుణంగా దెబ్బ తిన్నాయి. భారీ వర్షాలకు ఇల్లు కొట్టుకుపోయాయి. వ్యవసాయ భూములు నాశనం అయ్యాయి. ప్రజాజీవనం అస్తవ్యస్థమైంది. అమృత్‌సర్, పాటియాలా, ఫాజిల్కా, ఫిరోజ్‌పూర్ సహా చాలా ప్రదేశాలలో ప్రజలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూపులు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే వరద బాధితులను ఆదుకునేందుకు ధాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం కొంతలో కొంత ఊరట. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి చాలా మంది సెలబ్రిటీలు పంజాబ్ వరద బాధితులను ఆదుకునేందుకు అవసరమైన సాయాన్ని అందిస్తున్నారు.
ఇప్పుడు కింగ్ ఖాన్ షారూఖ్ వంతు. ఖాన్ ధాతృసేవలో ఎప్పుడూ వెనకాడరు. ఆయన మంచి మనసు గురించి పరిశ్రమ ప్రజలు గొప్పగా చెబుతారు. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా పంజాబ్ లోని అన్నార్తులు, ఇల్లు కోల్పోయిన బాధితుల కోసం షారూఖ్ ఖాన్ భారీ సాయం అందిస్తున్నారు. ఖాన్ కి చెందిన మీర్ ఫౌండేషన్ ఇప్పుడు పంజాబ్‌లో దాదాపు 1500 బాధిత కుటుంబాలను దత్తత తీసుకుని వారి జీవనాన్ని యథాతథ స్థితికి తేవడానికి సహకరించేందుకు ముందుకు వచ్చింది.
అమృత్ సర్‌లోని రావి నది సమీపంలోని 500 గృహాలకు ఖాన్ కి చెందిన మీర్ ఫౌండేషన్ అండగా నిలుస్తామని ప్రకటించింది. దీనికోసం తక్షణం స్థానిక స్వచ్ఛంద సంస్థ వాయిస్ ఆఫ్ అమృత్‌సర్ తో కలిసి పనిచేయనుంది. వరద ప్రాంతంలో అత్యవసర వస్తువులు, ఆహారాన్ని అందించడమే ధ్యేయంగా ఇరు సంస్థలు కలిసి పని చేయనున్నాయి. ఇందులో రేషన్, బట్టలు, మందులు, నీటి శుద్ధి పరికరాలు వంటి వాటిని అందించేందుకు వారంతా ముందుకు వచ్చారు. ఆయా స్వచ్ఛంద సంస్థలకు స్థానిక ఎయిమ్స్ వైద్యులు సహాయం అందించనున్నారు. నిజానికి ఖాన్‌కి చెందిన మీర్ ఫౌండేషన్ యాసిడ్ దాడి బాధితులను సంరక్షించేందుకు సహకారం అందిస్తోంది. కానీ ఇప్పుడు వరద బాధితుల కష్టాలకు చలించి సేవలకు ముందుకు వచ్చింది. ప్రకృతి వైపరీత్యాల వేళ ప్రభుత్వాలపైనే ఆధారపడితే ప్రజలకు సాయం అందడం అసాధ్యమని మరోసారి ప్రూవైంది. స్వచ్ఛంద సంస్థల సాయం ఇలాంటి సమయంలో ఎంతో అవసరమని రుజువైంది.
