నెక్ట్స్ 'జేమ్స్ బాండ్ 007' ఒక భారతీయ నటుడు?
నెక్ట్స్ జేమ్స్ బాండ్ మీరేనా? అని ప్రశ్నించగా..లేదు, నాకు ఆ యాస రాదు. నాకు షేకెన్ మార్టిని (బాండ్ ఎంపిక చేసుకునే పానీయాలను సూచిస్తూ) ఇష్టం ఉండదు.
By: Sivaji Kontham | 9 Dec 2025 2:00 AM ISTజేమ్స్ బాండ్ 007 .. ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న యాక్షన్ అడ్వెంచర్ ఫ్రాంఛైజీ ఇది. ఇప్పటివరకూ 25 జేమ్స్ బాండ్ సినిమాలు తెరకెక్కగా ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల డాలర్లు వసూలు చేసాయి. హాలీవుడ్ దిగ్గజ హీరోలు బాండ్ పాత్రలలో అద్భుత నటనతో కట్టి పడేసారు. సీన్ కానరీ, డేవిడ్ నివెన్, జార్జ్ లాజెన్‌బై, రోజర్ మూర్, తిమోతి డాల్టన్, పియర్స్ బ్రాస్నన్, డేనియల్ క్రెయిగ్ వంటి అనేక మంది హాలీవుడ్ తారలు జేమ్స్ బాండ్ పాత్రను పోషించారు. చివరి జేమ్స్ బాండ్ చిత్రం నో టైమ్ టు డై.. ఇందులో డేనియల్ క్రెయిగ్ 007గా నటించారు. తదుపరి బాండ్‌గా ఎవరు నటిస్తారనే దానిపై అధికారిక నిర్ధారణ లేదు. నెక్ట్స్ బాండ్ చిత్రానికి దర్శకత్వం వహించడానికి డెనిస్ విల్లెన్యూవ్ (డూన్‌ను నిర్మించినవాడు) సిద్ధంగా ఉన్నాడు.
అయితే ఇలాంటి సమయంలో ఈ పాత్రలో ఎవరు నటిస్తారు? అన్నదానికి సమాధానం వెతుకుతున్న వారికి ఇంకా సరైన క్లారిటీ రాలేదు. `నో టైమ్ టు డై` తర్వాత డేనియల్ క్రెయిగ్ ఇక కనిపించడనే దానిపై స్పష్ఠత ఉంది. ప్రస్తుతం కాస్టింగ్ ఎంపికలు జరుగుతున్నాయి. ఆరోన్ టేలర్-జాన్సన్ - కల్లమ్ టర్నర్ వంటి పేర్లు బాండ్ పాత్ర కోసం వినిపిస్తున్నాయి. కానీ ఇంతలోనే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ నటిస్తే ఎలా ఉంటుంది? అంటూ ఒక చర్చ మొదలైంది.
ఇదే ప్రశ్న కింగ్ ఖాన్ షారూఖ్ కి ఎదురైంది. లండన్ లో ఇంతకుముందు డిడిఎల్‌జే మూడు దశాబ్ధాల సెలబ్రేషన్స్ లో భాగంగా డిడిఎల్‌జే సిగ్నేచర్ ఫోజ్ తో ఉన్న కాంస్య విగ్రహాన్ని లాంచ్ చేయగా, ఈ వేడుకలో షారూఖ్- కాజోల్ పాల్గొన్నారు. అనంతరం ఖాన్ బీబీసీతో మాట్లాడుతూ.. తాను జేమ్స్ బాండ్ గా నటించేందుకు ఆస్కారం లేదని ధృవీకరించారు. తాను కెరీర్ లో యాక్షన్ సినిమాలు చేయలేదని, తన పక్కనే కాజోల్ ఉండగా అందుకు అవకాశం లేదని సరదాగా మాట్లాడారు షారూఖ్. కాజోల్ తో రొమాంటిక్ చిత్రాల్లో మాత్రమే నటించానని అన్నారు.
నెక్ట్స్ జేమ్స్ బాండ్ మీరేనా? అని ప్రశ్నించగా..లేదు, నాకు ఆ యాస రాదు. నాకు షేకెన్ మార్టిని (బాండ్ ఎంపిక చేసుకునే పానీయాలను సూచిస్తూ) ఇష్టం ఉండదు. నిజానికి నేను ఎక్కువ యాక్షన్ సినిమాలు చేయలేదు. నేను ఎప్పుడూ యాక్షన్ సినిమాలు చేయాలనుకున్నాను.. కానీ కాజోల్ నా జీవితంలో ఉంది.. ఆమె మీ సరసన నటిస్తున్నప్పుడు యాక్షన్ సినిమాలు చేయలేరు. కాబట్టి నేను అన్ని రొమాంటిక్ సినిమాలు చేసాను! అని అన్నారు ఖాన్. మీతో ఇంకా చాలా సినిమాలు చేయాల్సి ఉందని కాజోల్ వ్యాఖ్యానించగా, అవును మనం కలిసి చేసిన సినిమాలు మంచి పేరు తెచ్చాయి... మనం ఎప్పటికీ అలాంటివి చేయగలము. నేను యాక్షన్ సినిమాలు చేసినా దానిని ఆలస్యంగా చేసాను.. నాకు జేమ్స్ బాండ్ తెలియదు.. కానీ సీన్ కానరీ కచ్ఛితంగా తెలుసును అని అన్నారు.
షారూఖ్ నటించిన పఠాన్, జవాన్, డంకీ చిత్రాలు చక్కని విజయాల్ని అందుకున్నాయి. ఇటీవల జవాన్‌లో తన నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. తదుపరి పఠాన్ ఫేం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న `కింగ్`లో కనిపిస్తాడు. ఇందులో అతని కుమార్తె సుహానా ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. 2026లో ఈ చిత్రం విడుదలవుతుంది.
