బాద్‌షా సరికొత్త అవతారం!
ఇండస్ట్రీలో అగ్ర నటుడి క్రేజ్ వెండితెరపైనే కాదు. వారు నటించే ప్రకటనలలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
By: Srikanth Kontham | 5 Jun 2026 2:00 PM ISTఇండస్ట్రీలో అగ్ర నటుడి క్రేజ్ వెండితెరపైనే కాదు. వారు నటించే ప్రకటనలలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆధునిక కాలంలో బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి మాత్రమే కాకుండా నటీనటుల మేకోవర్లను .. రాబోయే చిత్రాల శైలిని పరిచయం చేసే వేదికలుగా మారుతున్నాయి. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన ఓ నూతన వాణిజ్య ప్రకటన సోషల్ మీడియాలో సృష్టించిన హల్‌చల్ దీనికి ఉదాహరణగా నిలిచింది. ఓ ప్రముఖ అంతర్జాతీయ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ప్రచారంలో భాగంగా విడుదలైన ఈ లగ్జరీ ట్రావెల్ యాడ్‌లో షారుఖ్ ఖాన్ సరికొత్త అవతారంలో కనిపించారు.
క్లాసిక్ సాంగ్ `పైసా యే పైసా` రీమిక్స్ నేపథ్యంతో సాగే రెండున్నర నిమిషాల ప్రకటనలో షారుక్ రాయల్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా షారుక్ ధరించిన స్టైలిష్ దుస్తులు.. గడ్డం.. సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్ స్టైల్ ఆయనలోని రగ్గడ్ -క్లాసిక్ చార్మ్‌ను అద్భుతంగా ఎలివేట్ చేశాయి. ఈ ప్రకటన విడుదలైన నిమిషాల్లోనే నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ చేయడం ప్రారంభించారు. అరవై ఏళ్ల వయసులో కూడా షారుఖ్ ఖాన్ మెయింటైన్ చేస్తున్న అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
అయితే ఈ లుక్ కేవలం యాడ్ కోసమే చేసింది కాదని, ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ `కింగ్ ` లోని మెయిన్ లుక్ ఇదేనంటూ ఇంటర్నెట్‌లో రకరకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి. అభిమానుల అంచనాల ప్రకారం.. `కింగ్` ఒక హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ కానుంది. హాలీవుడ్ క్లాసిక్ `లియోన్: ది ప్రొఫెషనల్` స్ఫూర్తితో ఒక పరిణతి చెందిన, కఠినమైన హిట్ మాన్ పాత్రలో షారుఖ్ కనిపించబోతున్నారని గతంలోనే వార్తలొచ్చాయి. తాజా ప్రకటనలో షారుక్ గంభీరమైన రూపం, ఆ పాత్రకు కావలసిన డార్క్ -రగ్గడ్ వైబ్‌ను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.
ఈ నేపథ్యంలోనే `కింగ్` సినిమాకు ఒక రకమైన అఫీషియల్ కాని టీజర్‌గా భావించొచ్చని అభిమానులు భావి స్తున్నారు. ఒక ప్రమోషనల్ యాడ్ ద్వారా కూడా కోట్లాది మంది ప్రేక్షకులలో సినిమాపై అంచనాలను స్కై-హై లెవెల్‌కు తీసుకెళ్లడం షారుఖ్ ఖాన్‌కే సాధ్యమంటూ ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. అధికారిక ప్రచార చిత్రాలు రాకముందే కార్పొరేట్ బ్రాండ్లను వాడుకుంటూ సినిమా హైప్‌ను పెంచే ఈ సరికొత్త ట్రెండ్ రాబోయే రోజుల్లో భారతీయ సినిమా మార్కెటింగ్ విధానాన్ని మరింతగా ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
