Begin typing your search above and press return to search.

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ పాటలోని బ్యాక్‌గ్రౌండ్ ఫ్రేమ్‌లపై రకరకాల మీమ్స్, ట్రోల్స్ ఎదుర‌వుతున్నాయి.

By:  Sivaji Kontham   |   3 Nov 2026 10:00 AM IST
నాశిర‌కం కింగ్.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు
X

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా, స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం `కింగ్` పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో రెండు పెద్ద సినిమాల నుంచి వైదొలిగి అల్లు అర్జున్ `రాకా` చిత్రంలో న‌టిస్తున్న‌ దీపికా పదుకోణ్ కింగ్ షారూఖ్ స‌ర‌స‌నా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల కింగ్ ప్ర‌మోష‌న్స్ మొద‌ల‌య్యాయి. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ `తు మిల్ జాయే` గ్రాండ్ గా విడుదలైంది. అయితే విడుదలైన కొద్దిసేపటికే ఈ పాట సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆడియో పరంగా ఆకట్టుకున్నా కానీ.. విజువల్స్ విషయంలో మాత్రం ప్రేక్షకులకు ఊహించని షాక్ తగిలింది.

పాటలోని కొన్ని సన్నివేశాలలో విజువల్స్ మ‌రీ నాసిరకంగా ఉన్నాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ సినిమాలంటే అత్యున్నత స్థాయి ప్రొడక్షన్ విలువ‌లు, స్టైలిష్ ప్రెజెంటేషన్ ఉంటాయని ఆశించే ఫ్యాన్స్, ఈ పాటలోని కంప్యూట‌ర్ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ చూసి తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ చాలా స్పష్టంగా.. కృత్రిమంగా కనిపిస్తుండటంతో అసలు ఒక భారతదేశపు అగ్ర కథానాయకుడి సినిమాకు ఇవ్వాల్సిన అవుట్‌పుట్ ఇదేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ పాటలోని బ్యాక్‌గ్రౌండ్ ఫ్రేమ్‌లపై రకరకాల మీమ్స్, ట్రోల్స్ ఎదుర‌వుతున్నాయి. ప్రమోషన్ల హడావుడిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను సరిగ్గా పూర్తి చేయకుండానే కంటెంట్‌ను విడుదల చేయడం వల్ల ఇలాంటి అవుట్‌పుట్ వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఏఐ తో చేయ‌డం వ‌ల్ల ఇలా అయింది! అంటూ కొన్ని కామెంట్లు క‌నిపిస్తున్నాయి. అయితే షారూఖ్ అభిమానులు మాత్రం ఈ పాట ఒక క్లాసిక్ గా నిలుస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఇలాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ప్రాజెక్ట్‌కి ప్రారంభంలోనే ఇలాంటి నెగెటివ్ టాక్ రావడం మేకర్స్‌కు గట్టి ప్రతికూల అంశంగా మారింది.

సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నందున, ఈ విమర్శలను మేకర్స్ ఏమాత్రం తేలికగా తీసుకోకూడదని విశ్లేషకులు సూచిస్తున్నారు. గతంలో కూడా కొన్ని భారీ చిత్రాల విషయంలో విజువల్ ఎఫెక్ట్స్‌పై విమర్శలు వచ్చినప్పుడు టీమ్ తిరిగి రీ-వర్క్ చేసి మంచి ఫలితాలు సాధించింది. `కింగ్` చిత్ర బృందం కూడా వెంటనే స్పందించి.. థియేట్రికల్ వెర్షన్ నాటికి ఈ వీఎఫ్ఎక్స్ లోపాలను సరిదిద్ది మరింత నాణ్యమైన విజువల్స్‌ను అందిస్తారనే అభిమానులు ఆశిస్తున్నారు.

ఐదోసారి షారూఖ్- దీపిక జోడీ:

టాలెంటెడ్ సింగర్ అరిజిత్ సింగ్, మధుబంతి బాగ్చీల స్వరాలు అందించిన‌ `తు మిల్ జాయే` పాటలో గ్లోబల్ పాప్ స్టార్ ఎడ్ షీరన్ పాడిన ఇంగ్లీష్ రాప్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, `పఠాన్` వంటి వరుస బ్లాక్‌బస్టర్‌ల తర్వాత షారూఖ్ ఖాన్ - దీపికా పదుకొణె కాంబినేషన్ మరోసారి ఈ పాటలో తమ మేజిక్‌ను రిపీట్ చేశారు. సచిన్-జిగర్ స్వరపరిచిన ఈ రొమాంటిక్ ట్రాక్‌కి కుమార్ హిందీ లిరిక్స్ అందించగా, ఎడ్ షీరన్ ఇంగ్లీష్ రాప్ లిరిక్స్ రాశారు. 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా `కింగ్` సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.