ఏడాదిలో 2490 కోట్ల నష్టం.. అయినా నం.1 .. 'కింగ్' సింహాసనాన్ని కదిలించే మొనగాడే లేడా?
తాజా హురున్ నివేదిక ప్రకారం.. షారూఖ్ ఖాన్ నికర ఆస్తి విలువ ప్రస్తుతం రూ. 10,000 కోట్లకు చేరింది.
By: Sivaji Kontham | 24 Sept 2026 9:51 AM ISTబాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ఆర్థిక సామ్రాజ్యానికి సంబంధించి హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026 తాజాగా విడుదల చేసిన నివేదిక సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గత సంవత్సరంతో పోలిస్తే ఖాన్ ఆస్తుల విలువలో భారీ తగ్గుదల నమోదైనా కానీ.. దేశంలోనే అత్యంత సంపన్నుడైన నటుడిగా నం.1 స్థానాన్ని పదిలంగా కాపాడుకున్నారు. కోట్లాది రూపాయల నష్టం చవిచూసినా నంబర్ వన్ స్థానానికి ఎలాంటి డోకా లేకపోవడం కింగ్ వ్యాపార సామ్రాజ్య పరిధి ఏపాటిదో తెలియజేస్తోంది.
తాజా హురున్ నివేదిక ప్రకారం.. షారూఖ్ ఖాన్ నికర ఆస్తి విలువ ప్రస్తుతం రూ. 10,000 కోట్లకు చేరింది. అయితే గతేడాది విడుదలైన 2025 జాబితాలో అతడి సంపద విలువ ఏకంగా రూ. 12,490 కోట్లుగా ఉంది. దీన్ని బట్టి చూస్తే కేవలం ఒక్క సంవత్సర వ్యవధిలోనే ఖాన్ సంపద దాదాపు రూ. 2,490 కోట్లు తగ్గినట్లు స్పష్టమవుతోంది. మార్కెట్ ఒడుదొడుకులు.. అసెట్ వాల్యుయేషన్లలో మార్పుల కారణంగా ఈ భారీ వ్యత్యాసం వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
నికర ఆస్తిలో ఈ భారీ క్షీణత ఎదురైనా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మరే ఇతర నటుడు కూడా ఆయన దరిదాపుల్లోకి కూడా రాలేకపోవడం గమనార్హం. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్‌తో పాటు.. ఐపీఎల్ ఫ్రాంచైజీ నైట్ రైడర్స్ స్పోర్ట్స్ వంటి భారీ వ్యాపారాలు అతడి సంపదకు బలమైన పునాదిగా నిలిచాయి. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ -రూ. 4,000 కోట్లు, సల్మాన్ ఖాన్ -రూ. 3,000 కోట్లు, హృతిక్ రోషన్-రూ. 2,500 కోట్లు నికర ఆర్జనతో తర్వాతి స్థానాల్లో ఉన్నా కానీ.. షారూఖ్ ఖాన్ వారందరికంటే ఎంతో ముందంజలో ఉన్నారు.
కేవలం నటనకే పరిమితం కాకుండా ఒక దార్శనిక వ్యాపారవేత్తగా ఖాన్ ఎంచుకున్న రంగాలే ఈ అగ్రస్థానాన్ని ఎప్పటికీ కోల్పోకుండా కాపాడుతున్నాయి. సినిమాలతో పాటు ప్రొడక్షన్, గ్లోబల్ స్పోర్ట్స్ లీగ్స్ సహా పలు వ్యాపార వాణిజ్య రంగాల్లో పెట్టుబడులు కింగ్ ఖాన్ ఆర్థిక స్థిరత్వాన్ని మరింత బలోపేతం చేశాయి. సంపదలో కొంత తగ్గుదల కనిపించినా.. బిజినెస్ వరల్డ్‌లో ఖాన్ దూకుడు, బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదనడానికి ఈ నివేదిక సజీవ సాక్ష్యం.
ఇక వెండితెరపై తన మార్క్ చూపించేందుకు షారూఖ్ ఖాన్ సిద్ధమవుతున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక యాక్షన్ థ్రిల్లర్ `కింగ్` చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్ 24న విడుదల కానున్న ఈ చిత్రంలో సుహానా ఖాన్, దీపికా పదుకొనే వంటి తారలు నటిస్తున్నారు. సంపదలో భారీ కోత పడినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం `కింగ్` సింహాసనాన్ని ఎవరూ కదిలించలేరని మరోసారి ప్రూవైంది. భారతదేశంలో భారీ పాన్ ఇండియా స్టార్లు ఎందరు ఉన్నా కింగ్ ఖాన్ తరహాలో వ్యాపార సామ్రాజ్యాల్ని విస్తరించడం ఇప్పట్లో ఏ ఇతర స్టార్ కి సాధ్యం కాదు కాబట్టి, అతడే ప్రతి సంవత్సరం నంబర్ వన్ స్టార్ గా సింహాసనాన్ని అధిరోహిస్తున్నారని చెప్పొచ్చు.
