లోపాలున్న కార్‌కి ప్రమోషన్.. స్టార్ హీరో హీరోయిన్‌పై FIR
షారూఖ్- దీపిక పదుకొనే బ్రాండ్ అంబాసిడర్లుగా హుందాయ్ కంపెనీకి చెందిన ఒక లోపభూయిష్టమైన కార్ ని ప్రమోట్ చేస్తున్నారని, దాని కారణంగా తన కుటుంబం భద్రత పరంగా చిక్కుల్లో పడింద
By: Sivaji Kontham | 27 Aug 2025 3:00 PM ISTబాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ప్రస్తుతం `కింగ్` అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దీపిక పదుకొనే అతిథి పాత్రలో నటించనుందని గుసగుసలు వినిపించాయి. మరోవైపు దీపిక పదుకొనే అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్ లో రూపొందించనున్న సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ప్రభాస్ తో స్పిరిట్‌లో నటించే అవకాశం కోల్పోయినా అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది.
ఈ సమయంలో షారూఖ్, దీపిక పదుకొనే పేర్లు రాంగ్ రీజన్ తో మీడియా హెడ్ లైన్స్ లోకి రావడం చర్చనీయాంశమైంది. షారూఖ్- దీపిక పదుకొనే బ్రాండ్ అంబాసిడర్లుగా హుందాయ్ కంపెనీకి చెందిన ఒక లోపభూయిష్టమైన కార్ ని ప్రమోట్ చేస్తున్నారని, దాని కారణంగా తన కుటుంబం భద్రత పరంగా చిక్కుల్లో పడిందని కస్టమర్ ఆరోపించడం సంచలనంగా మారింది. వినియోగదారు కోర్టును ఆశ్రయించడంతో హుందాయ్ కంపెనీ ప్రతినిధులు సహా ఈ ఇద్దరు స్టార్లు చిక్కుల్లో పడ్డారు.
హుందాయ్ అల్కజార్ కార్ ని కొనుగోలు చేసిన కస్టమర్ ఒక మహిళా న్యాయవాది. పదే పదే సాంకేతిక లోపాల కారణంగా సమస్యల్ని ఎదుర్కొంటున్నామని షోరూమ్ యాజమాన్యానికి పదే పదే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఖరీదైన కార్ ఎక్సలరేటర్ సహా ఇంజిన్ పరమైన సాంకేతిక సమస్యలను కలిగి ఉంది. దీంతో తమ కుటుంబం భద్రత పరమైన సవాళ్లను ఎదుర్కొంటోందని కస్టమర్ కోర్టులో ఫిర్యాదు చేసారు.
భరత్‌పూర్‌కు చెందిన న్యాయవాది కీర్తి సింగ్ 2022లో సోనిపట్‌లోని మాల్వా ఆటో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి హ్యుందాయ్ అల్కాజార్‌ను కొనుగోలు చేయగా సమస్యల్ని ఎదుర్కొన్నారు. ఆమె రూ. 51,000 అడ్వాన్స్‌గా చెల్లించి, మిగిలినదానికి ఈఎంఐ చెల్లిస్తున్నారు. షోరూమ్ డీలర్ తనకు పూర్తిగా సమస్యలు లేని వాహనాన్ని అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. కానీ కొనుగోలు చేసిన వెంటనే పలుమార్లు ఇంజిన్- ఎక్సలరేటర్ లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో కీర్తి సింగ్ ఫిర్యాదు మేరకు భరత్‌పూర్ కోర్టు మధుర గేట్ పోలీస్ స్టేషన్‌ను ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.
ఈ కేసులో హ్యుందాయ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్సూ కిమ్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్, మాల్వా ఆటో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ల పేర్లు ఉన్నాయి. దీపిక, షారూఖ్ బ్రాండ్ ప్రచారకర్తలుగా ఉన్నందున వారి పేర్లను ఎఫ్.ఐ.ఆర్ లో చేర్చారు. అయితే ఈకేసును సామరస్యంగా షోరూమ్ వర్గాలు పరిష్కరించేందుకు అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తదుపరి పోలీసుల విచారణలో తేలిన అంశాలను బట్టి చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంది.
