Begin typing your search above and press return to search.

మాజీ భార్య‌తో మ‌ళ్లీ పెళ్లి అంటే భ‌గ్గుమ‌న్నాడు!

ఈ పుకార్లను సృష్టించి ప్రచారం చేసిన ప్రతి ఒక్కరూ తక్షణమే స్పందించి ఆ వార్తలను తొలగించాలన్నారు.

By:  Srikanth Kontham   |   11 Jun 2026 12:54 PM IST
మాజీ భార్య‌తో  మ‌ళ్లీ పెళ్లి అంటే భ‌గ్గుమ‌న్నాడు!
X

టెలివిజన్ రంగంలో ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న షాలిన్ భానోత్ తన వ్యక్తిగత జీవితంపై వ‌స్తోన్న‌ కొన్ని పుకార్లపై తాజాగా స్పందించారు. ఆయన తన మాజీ భార్య, నటి దల్జీత్ కౌర్‌ను మళ్లీ వివాహం చేసుకో బోతున్నా రంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా ఈ ప్రచారంపై షాలిన్ భానోత్ తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసత్యపు వార్తలను వ్యాప్తి చేస్తున్న సదరు మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అంతేకాదు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ వివాదంపై షాలిన్ భానోత్ అధికారికంగా ఓ ప్రకటన చేశారు. కేవలం క్లిక్‌ల కోసం, వ్యూస్ కోసం కొందరు బాధ్యతారాహిత్యంగా ఇలాంటి సున్నితమైన విషయాలపై అబద్ధాలు అల్లుతున్నారని మండిపడ్డారు. `నా వ్యక్తిగత జీవితాన్ని ఒక జోక్‌గా మార్చేశారు. ఏ విధమైన నిజనిజాలు తెలుసుకోకుండా, నన్ను సంప్రదించకుండా ఇలాంటి వార్తలు రాయడం ఎంతవరకు సమంజసం? ఇది కేవలం నా ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా నా కుటుంబాన్ని కూడా తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోంది` అని త‌న‌ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పుకార్లను సృష్టించి ప్రచారం చేసిన ప్రతి ఒక్కరూ తక్షణమే స్పందించి ఆ వార్తలను తొలగించాలన్నారు. అలాగే బహిరంగంగా తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేనిపక్షంలో లీగల్ టీమ్ ద్వారా కఠినమైన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చ‌రించారు. బాధ్యతాయుతమైన జర్నలిజం విలువలను కాపాడాలని, సెలబ్రిటీల జీవితాలతో ఆటలాడటం ఆపాలని హితవు పలికారు. షాలిన్ భానోత్, దల్జీత్ కౌర్‌ల వివాహ బంధం గతంలోనే ముగిసిపోయింది. వారిద్దరికీ ఒక కుమారుడు ఉన్నాడు. విడాకుల తర్వాత ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందుకు సాగుతున్నారు.

దల్జీత్ కౌర్ తదనంతరం నిఖిల్ పటేల్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నప్పటికీ ఆ బంధం కూడా ఇటీవల వివాదాల్లో చిక్కుకుని విడిపోయే వరకు వచ్చింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దల్జీత్ వ్యక్తిగత జీవితంపై ఇప్పటికే చర్చ జరుగుతుండగా.. మళ్లీ షాలిన్‌తో పెళ్లి అంటూ వ‌స్తోన్న వార్తలు ఇరు పక్షాలకూ ఇబ్బందికరంగా మారాయి. ప్రస్తుతం షాలిన్ భానోత్ కెరీర్‌పై దృష్టి కేంద్రీక రించారు. భవిష్యత్తులో రాబోయే ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన ఇలాంటి అనవసరపు వివాదాలకు తన పేరును వాడుకోవద్దని కోరారు. తన నటన ద్వారా పని ద్వారా మాత్రమే ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటున్నట్లు, వ్యక్తిగత జీవితాన్ని వివాదాల్లోకి లాగొద్దని ఈ సందర్భంగా కోరారు.