Begin typing your search above and press return to search.

ఈ వారం బాక్సాఫీస్.. ఎవరి స్టార్ట్ ఎలా ఉంది?

ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు ఐదు సినిమాలు వచ్చాయి.

By:  M Prashanth   |   12 Sept 2026 8:03 PM IST
ఈ వారం బాక్సాఫీస్.. ఎవరి స్టార్ట్ ఎలా ఉంది?
X

ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు ఐదు సినిమాలు వచ్చాయి. కార్తి సర్దార్ 2, సూరిసుహాస్ మండాడి సెప్టెంబర్ 10న రిలీజ్ కాగా, ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’, సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’, మాధవ్ ‘మారెమ్మ’ తర్వాతి రోజు వచ్చాయి. ఒకేసారి ఇన్ని సినిమాలు రావడంతో మొదటి వీకెండ్‌లో షోలలో పోటీ కనిపించింది. ఇక సినిమాలన్నీ మౌత్ టాక్ మీద ఆధారపడాల్సి వచ్చింది.

ఇప్పటివరకు కలెక్షన్స్ పరంగా ‘మండాడి’ ముందుంది. తొలి రోజు మంచి ఓపెనింగ్ తీసుకున్న ఈ సినిమా రెండో రోజు మరింత పెరిగింది. సూరి లీడ్ రోల్‌తో పాటు సుహాస్ కీలక పాత్రలో ఉండటం తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెంచింది. తమిళనాడులో వచ్చిన పాజిటివ్ టాక్ రెండో రోజు కలెక్షన్స్‌కు ఉపయోగపడింది. తెలుగు వెర్షన్ కూడా శుక్రవారం రూ.1 కోటి మార్క్ దాటినట్లు ట్రాకింగ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

‘సర్దార్ 2’ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. కార్తికి తెలుగు రాష్ట్రాల్లో రెగ్యులర్ మార్కెట్ ఉండటంతో మొదటి రోజు మంచి ఓపెనింగ్ వచ్చింది. కానీ రెండో రోజు ఇండియా నెట్ కలెక్షన్స్ దాదాపు సగానికి తగ్గాయి. తెలుగు వెర్షన్‌కు కూడా షోలు ఉన్నా, ‘మండాడి’తో పోలిస్తే రెండో రోజు గ్రోత్ కనిపించలేదు. రెండో రోజు తెలుగు నుంచి సుమారు రూ.70 లక్షల నెట్ వచ్చినట్లు అంచనా.

డైరెక్ట్ తెలుగు సినిమాల్లో ‘ఎపిక్’ బెటర్ స్టార్ట్ తీసుకుంది. బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మళ్లీ కలిసి రావడం ఓపెనింగ్‌కు ప్లస్ అయింది. అయితే సెకండాఫ్, క్లైమాక్స్‌పై మిక్స్‌డ్ టాక్ రావడంతో వీకెండ్ ఆడియన్స్ ఎంతవరకు వస్తారన్నది కీలకం. ‘మహేంద్రగిరి వారాహి’, ‘మారెమ్మ’కు మాత్రం మొదటి రోజు పరిమిత వసూళ్లే వచ్చాయి. తమిళ సినిమాలకు రెండు రోజుల రన్ పూర్తికాగా ఈ మూడు తెలుగు సినిమాలకు ఒక్కరోజు కలెక్షన్స్ మాత్రమే ఉన్నాయి.

ఇప్పటివరకు వచ్చిన ఇండియా నెట్ అంచనాలు ఇలా ఉన్నాయి:

మండాడి: 2 రోజులకు రూ.11.40 కోట్లు

సర్దార్ 2: 2 రోజులకు రూ.6.95 కోట్లు

ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్: తొలి రోజు రూ.2.10 కోట్లు

మహేంద్రగిరి వారాహి: తొలి రోజు రూ.32 లక్షలు

మారెమ్మ: తొలి రోజు రూ.27 లక్షలు

ఇక ఇప్పటి నుంచే అసలు వీకెండ్ టెస్ట్ మొదలవుతుంది. ‘మండాడి’కి రెండో రోజు వచ్చిన జంప్ కొనసాగుతుందా, ‘సర్దార్ 2’ తిరిగి పికప్ అవుతుందా అన్నది చూడాలి. ‘ఎపిక్’కు మొదటి రోజు ఆసక్తి తర్వాత మౌత్ టాక్ ఎంతవరకు కలెక్షన్స్‌ను నిలబెడుతుందో తేలనుంది. చిన్న సినిమాలైన మహేంద్రగిరి వారాహి, మారెమ్మకు షోలు నిలవాలంటే వీకెండ్‌లో పికప్ అవసరం.