ఈ వారం టాక్‌కే టికెట్!
అందుకే ఈసారి పెద్ద ఓపెనింగ్ కంటే గురువారం, శుక్రవారం బయటకు వచ్చే టాక్ కీలకం. అందులో ఏ సినిమా ముందుగా పాజిటివ్ టాక్ పట్టుకుంటే వీకెండ్ లో దానికి అడ్వాంటేజ్ దక్కే అవకాశం ఉంది.
By: M Prashanth | 2 Sept 2026 10:01 PM ISTసెప్టెంబర్ మొదటి వారం థియేటర్లలో పెద్ద స్టార్ సినిమా లేకపోయినా కొత్త రిలీజ్‌లు మాత్రం వరుసగా వస్తున్నాయి. సెప్టెంబర్ 3న ‘రోమాంచకం’ ముందుగా బరిలోకి దిగుతోంది. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్నారు. ఇప్పటికే స్పెషల్ ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేయడంతో మొదటి టాక్‌పైనే ఎక్కువ ఫోకస్ పడింది.
సెప్టెంబర్ 4న అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ వస్తోంది. కొంతకాలంగా సీరియస్ పాత్రలు చేస్తున్న నరేష్ మళ్లీ ఫాంటసీ కామెడీ వైపు రావడం ఈ సినిమాకు ప్రత్యేకత. సురభి, వెన్నెల కిషోర్ కూడా ఇందులో ఉన్నారు. అదే రోజు ‘సహా: లైఫ్ ఆఫ్ సంజు’ అనే చిన్న సినిమా కూడా రిలీజ్ అవుతోంది.
తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ మార్కెట్ నుంచి కూడా పోటీ ఉంది. దుల్కర్ సల్మాన్ ‘ఐయామ్ గేమ్’ సెప్టెంబర్ 3న తెలుగు సహా ఐదు భాషల్లో వస్తోంది. ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ తర్వాత దుల్కర్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు ఈ సినిమాకు ఉపయోగపడొచ్చు. ఇది యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది.
మరోవైపు మలయాళంలో ఇప్పటికే పెద్ద హిట్ అయిన ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 4న వస్తోంది. నివిన్ పౌలీ, మమిత బైజు నటించిన ఈ సినిమా మలయాళంలో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ చేసింది. అక్కడ వచ్చిన టాక్‌తో తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు థియేటర్లకు తీసుకొస్తుందో చూడాలి.
సెప్టెంబర్ 4న ‘మీర్జాపూర్: ది మూవీ’ కూడా థియేటర్లలోకి వస్తోంది. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఓటీటీలో మూడు సీజన్లతో పెద్ద ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ కథ, ఇప్పుడు థియేటర్ ఫార్మాట్‌లో ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి.
ఇవే కాకుండా ‘మా రాముడు అందరివాడు’ కూడా సెప్టెంబర్ 4న రిలీజ్ అవుతోంది. కుటుంబ కథకు రాముడి కథ నుంచి కొన్ని అంశాలు తీసుకుని రూపొందించిన చిత్రంగా టీమ్ చెబుతోంది. అంటే ఈ వీకెండ్‌లో ప్రేమకథ, కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ సినిమా అంటూ వేర్వేరు జానర్స్ ఉన్నాయి. అయితే కొత్త సినిమాలకు ఇప్పటికే థియేటర్లలో ఉన్న ‘ఇరుముడి’, ‘టాక్సిక్’ నుంచి స్క్రీన్స్ కోసం పోటీ తప్పదు. అందుకే ఈసారి పెద్ద ఓపెనింగ్ కంటే గురువారం, శుక్రవారం బయటకు వచ్చే టాక్ కీలకం. అందులో ఏ సినిమా ముందుగా పాజిటివ్ టాక్ పట్టుకుంటే వీకెండ్ లో దానికి అడ్వాంటేజ్ దక్కే అవకాశం ఉంది.
