Begin typing your search above and press return to search.

వెంకీ, బాలయ్య, చిరు.. ప్లానింగ్ ఎలా ఉందంటే?

కొత్త వాళ్లతో కథా చర్చలు నడుస్తున్నా, వెంటనే సెట్స్ పైకి వెళ్లే సినిమాల విషయంలో మాత్రం తమకు ఆల్రెడీ హిట్ ఇచ్చిన దర్శకులకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.

By:  M Prashanth   |   15 Aug 2026 2:36 PM IST
వెంకీ, బాలయ్య, చిరు.. ప్లానింగ్ ఎలా ఉందంటే?
X

టాలీవుడ్ సీనియర్ హీరోల లైనప్ చూస్తే ఒక క్లియర్ పాటర్న్ కనిపిస్తోంది. కొత్త వాళ్లతో కథా చర్చలు నడుస్తున్నా, వెంటనే సెట్స్ పైకి వెళ్లే సినిమాల విషయంలో మాత్రం తమకు ఆల్రెడీ హిట్ ఇచ్చిన దర్శకులకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలకృష్ణ వీరసింహారెడ్డి తర్వాత మళ్లీ గోపీచంద్ మలినేనితో NBK111 పట్టాలెక్కించాడు. చిరంజీవి వాల్తేరు వీరయ్య సక్సెస్ ఇచ్చిన బాబీ కొల్లితో మెగా 158 పనులు మొదలుపెట్టాడు. వెంకటేష్ కూడా అనిల్ రావిపూడితో ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్లీ కొత్త సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

అయితే సీనియర్ స్టార్స్ కొత్త దర్శకులను పూర్తిగా పక్కన పెట్టేశారని కాదు. చిరంజీవి ఇప్పటికే న్యూ జనరేషన్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో అధికారికంగా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ బాలకృష్ణను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందనే ప్రచారం నడుస్తోంది, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. వెంకటేష్ గతంలో యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలనుతో సైంధవ్ చేశాడు. నాగార్జున నా సామి రంగతో విజయ్ బిన్నీకి ఛాన్స్ ఇవ్వడమే కాకుండా, కొత్త వాళ్లు కొత్త కథలతో అన్నపూర్ణ స్టూడియోస్ కి రావాలని ఈ ఆగస్టులోనే ఓపెన్ పిలుపునిచ్చాడు.

కొత్త దర్శకుడితో సినిమా అంటే కథ నచ్చడం ఒక్కటే సరిపోదు. సీనియర్ స్టార్‌ను ఎలా ప్రెజెంట్ చేయాలి, థియేటర్లలో అభిమానులు ఏం కోరుకుంటున్నారు అన్న పల్స్ కూడా దర్శకుడికి పట్టుబడాలి. హీరో ఇమేజ్, బాక్సాఫీస్ మార్కెట్, బడ్జెట్ రికవరీ లాంటి లెక్కలు చాలా ఉంటాయి. కొత్త దర్శకుడు మంచి కథ తీసుకొచ్చినా, ఈ కమర్షియల్ హంగులను ఎలా బ్యాలెన్స్ చేస్తాడనే విషయంలో హీరోలకు పూర్తి క్లారిటీ రావాల్సి ఉంటుంది.

ఇదే సమయంలో ఆల్రెడీ హిట్ ఇచ్చిన దర్శకుడైతే హీరో బాడీ లాంగ్వేజ్, ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ పై ఒక ఐడియా ఉంటుంది. ఇద్దరి మధ్య ఒక వర్కింగ్ ఈక్వేషన్ ముందే ఉండటం వల్ల కథను సెట్స్ మీదకు తీసుకెళ్లడం కాస్త సులువు కావచ్చు. ఎలాంటి సీన్స్ రాస్తే స్క్రీన్ మీద పేలుతాయి, ఎక్కడ కామెడీ వర్కౌట్ అవుతుంది అన్నది టెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే ఒక క్లారిటీ ఉంటుంది.

అయితే ఈ రిపీట్ కాంబినేషన్లు ఎప్పుడూ హిట్ గ్యారెంటీ ఇవ్వలేవు. గతంలో ఒక పెద్ద హిట్ వచ్చింది కదా అని మళ్లీ కలిస్తే ఆడియన్స్ కచ్చితంగా థియేటర్లకు వచ్చేస్తారనే గ్యారెంటీ సినిమా బిజినెస్‌లో ఉండదు. కాంబినేషన్ క్రేజ్ ఉన్నా, సినిమాలో కంటెంట్ వీక్ అయితే రిస్క్ తప్పదు. గతంలో ఒకే కాంబోలో వచ్చిన కొన్ని సీక్వెల్స్, నెక్స్ట్ ప్రాజెక్టులు తేలిపోయిన సందర్భాలు కూడా ఇండస్ట్రీలో ఉన్నాయి.

ఇప్పుడు సీనియర్ హీరోల ప్లానింగ్ చూస్తే తెలిసిన ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుల వైపు ఒక అడుగు ఎక్కువ వేస్తున్నట్టు కనిపిస్తోంది. కొత్త వాళ్లకు అవకాశాలు లేవని కాదు కానీ, తక్కువ టైమ్‌లో ప్రాజెక్ట్ లాక్ చేయడానికి ప్రూవ్డ్ కాంబినేషన్లే ప్రస్తుతానికి వాళ్లకు ఈజీ ఆప్షన్‌గా మారుతున్నాయి. చివరకు ఏ కాంబినేషన్ అయినా స్క్రీన్ మీద కొత్తదనం చూపిస్తేనే బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుంది.