ఐదెకరాల్లో కళ్లు చెదిరేలా సీనియర్ నరేష్ కొత్త ఇల్లు
సీనియర్ నరేష్ ఏం చేసినా అది ప్రత్యేకంగా ఉంటుంది. నటుడిగా అతడి ఎంపికలే కాదు, ఇప్పుడు అభిరుచి మేరకు తన కొత్త ఇంటిని నిర్మించుకున్న తీరు కూడా చర్చగా మారింది.
By: Sivaji Kontham | 23 Aug 2025 7:00 AM ISTసీనియర్ నరేష్ ఏం చేసినా అది ప్రత్యేకంగా ఉంటుంది. నటుడిగా అతడి ఎంపికలే కాదు, ఇప్పుడు అభిరుచి మేరకు తన కొత్త ఇంటిని నిర్మించుకున్న తీరు కూడా చర్చగా మారింది. అతడు ఏకంగా ఐదెకరాల్లో రాజభవనం లాంటి అద్భుతమైన ప్యాలెస్ నిర్మించాడు. ఈ ఇంటికి ఎంట్రన్స్ మొదలు, మాస్టర్ బెడ్ రూమ్ లు, కిచెన్, జిమ్ స్పేస్, వరండాలు .. ఇలా ప్రతిదీ పరిశీలిస్తే వారెవ్వా అనకుండా ఉండలేం. ఇక ఈ ఇంట్లో తన అభిరుచి మేరకు ఒక వరల్డ్ మ్యాప్ ని కూడా అతడు వరండాలో ఏర్పాటు చేసుకున్నాడు.
ఇటీవలి లాంచింగ్ కార్యక్రమంలో పరిశ్రమ దిగ్గజాలు పాల్గొన్నారు. సీనియర్ నటుడు మురళి మోహన్, అలీ సహా పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ఈ ఇంటిని సందర్శించిన వారిలో ఉన్నారు. నరేష్ - పవిత్ర లోకేష్ జంట తమ కొత్త ఇంటికి విచ్చేసిన అతిథులను సాదరంగా ఆహ్వానిస్తూ ఎంతో సందడిగా కనిపించిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.
ఐదెకరాల్లో ఖరీదైన ఈ ఇల్లు నగరం నడిబొడ్డున కొలువు దీరి ఉంది. ఇక ఈ కొత్త ఇంటిని నిర్మించుకున్న తరుణంలో నరేష్ సొంత ఇంటి ఖరీదు, ఆస్తుల విలువ గురించి వాడి వేడిగా చర్చ సాగుతోంది. మేటి కథానాయిక, దర్శకనిర్మాత దివంగత విజయనిర్మల ఒక్కగానొక్క కొడుకు కావడంతో వారి నుంచి వచ్చిన ఆస్తులన్నీ నరేష్ సొంతమయ్యాయి. నటుడిగా సినీపరిశ్రమలో సుదీర్ఘ ప్రస్థానంలో నరేష్ బాగానే ఆర్జించాడు. పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకునే సహాయనటుల్లో నరేష్ కూడా ఉన్నారు. ఇక అతడికి వారసత్వం గా వచ్చిన సంపదల విలువ అపారమైనది.
నరేష్ ఆస్తుల విలువ సుమారుగా రూ.400 కోట్లకు పైగానే ఉంటుందని ఒక అంచనా. విజయనిర్మల సంపాదించిన విప్రో సర్కిల్ (గచ్చిబౌలి) సమీపంలోని 5 ఎకరాల ఫాం హౌస్ ఖరీదు సుమారు 300కోట్లు. దీంతో పాటు మొయినాబాద్, శంకరపల్లి దగ్గరలో సుమారు 30 ఎకరాల మేర ఫాం హౌస్ లు ఉన్నాయి. వీటి ఖరీదు 100 కోట్లు పైమాటే. నగరం నడిబొడ్డున ఉన్న ఐదెకరాల్లో నరేష్ ఇంద్ర భవనాన్ని తలపించే కొత్త ఇంటిని నిర్మించడంతో ఇది ప్రత్యేక ఆకర్షణగా మారింది.
