కంబ్యాక్ అయినా సీనియర్లకి కలిసి రాలేదే!
ఒకప్పటి హీరోయిన్లు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కంబ్యాక్ అవుతోన్న సంగతి తెలిసిందే. అమ్మ, అక్క , అత్త,చెల్లి పాత్రల్లో మెరుస్తున్నారు.
By: Srikanth Kontham | 10 Oct 2025 1:00 AM ISTఒకప్పటి హీరోయిన్లు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కంబ్యాక్ అవుతోన్న సంగతి తెలిసిందే. అమ్మ, అక్క , అత్త,చెల్లి పాత్రల్లో మెరుస్తున్నారు. ఇప్పటికే స్నేహ, ఆమని, భూమిక, నదియా, రాశీ లాంటి సీనియర్ నటీమణులు సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరి వీరిలో ఎంత మంది బిజీ అయ్యారంటే? ఒకరిద్దరు మాత్రమే కనిపిస్తున్నారు. మిగతా వారంతా రీలాంచ్ అయినా అనుకున్న స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతున్నారు. ఆమని లాంగ్య్ గ్యాప్ తర్వాత `మధ్నాహ్నం హత్య` సినిమాతో కంబ్యాక్ అయ్యారు.
అటుపై `ఆ నలుగురులో` మంచి పాత్రతో సరైన కంబ్యాక్ ఇచ్చారనిపించింది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో నటించారు. కానీ ఆమనికి మాత్రం అంతగా పేరు రాలేదు. పేరుకే తప్ప ఆ చిత్రాలు కూడా పెద్దగా ఎవరికీ తెలియనివే. గతేడాది ఐదారు సినిమాలు చేసారు. ఈ ఏడాది కూడా మూడు నాలుగు సినిమాలు చేసారు. కానీ ఆమని ఎక్కడా హైలైట్ అవ్వలేదు. స్నేహ కెరీర్ కూడా దాదాపు ఇలాగే సాగింది. `సన్నాఫ్ సత్యామూర్తి`, `వినయ విధేయ రామ` లాంటి చిత్రాలు మినహా కంబ్యాక్ లో చెప్పుకోదగ్గ పాత్రలేవి కనిపించలేదు.
ప్రస్తుతం లైనప్ లో ఏ చిత్రం లేదు. భూమిక ఛావ్లా అయితే `బటర్ ప్లై` తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో కనిపించలేదు. నాలుగేళ్ల క్రితం `పాగల్` లో నటించారు. కానీ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు. ప్రస్తుతం తమిళ్ లో ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. వీళ్లందరికంటే నదియా సెకెండ్ ఇన్నింగ్స్ మాత్రం గొప్పగా సాగిందని చెప్పొచ్చు. `మిర్చి`తో కంబ్యాక్ ఇచ్చిన నదియా ఆ సినిమా తర్వాత చేసిన కొన్ని చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. కంబ్యాక్ అనంతరం రెండేళ్ల క్రితం వరకూ బిజీగానే కనిపించారు.
కానీ రెండేళ్లగా ఆమె కూడా తెరపై కనిపించలేదు. ప్రస్తుతం ఏ భాషలో కూడా నదియా సినిమాలు చేయలేదు. కావాలనే ఆమె వెండి తెరకు దూరంగా ఉంటున్నారు? అన్న వాదన కూడా వినిపిస్తోంది. సెకెండ్ ఇన్నింగ్స్ లో కూడా నదియా ఐకానిక్ పాత్రలు మాత్రమే పోషించారు. నటిగా తన పాత్ర హైలైట్ అవుతుందంటేనే ఒకే చెప్పేవారు. లేదంటే పారితోషికం ఎంత ఆఫర్ చేసినా వాటికి నో చెప్పేవారు అన్న మాట అప్పట్లో వినిపించేది. `మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్` సినిమాతో అందాల రాశీ కూడా కంబ్యాక్ ఇచ్చారు. కానీ కెరీర్ ఆశించిన విధంగా సాగలేదు. అగ్ర హీరోల చిత్రాలు వేటిలోనూ రాశీ ఛాన్సులు అందుకోలేకపోయారు. వాస్తవానికి రాశీ సెకెండ్ ఇన్నింగ్స్ లో బిజీ అవుతుందని భావించారు కానీ అలా జరగలేదు.
