Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ల‌ల‌లో 500 కోట్ల మొట్ట మొద‌టి స్టార్ ఎవ‌రు?

టాలీవుడ్ బిగ్ ఫోర్ గా పిలవబడే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ లలో 500 కోట్ల గ్రాస్ సాధించే మొట్టమొదటి సీనియర్ స్టార్ ఎవరనే ఆసక్తికర చర్చ ట్రేడ్ వర్గాల్లో నడుస్తోంది.

By:  Srikanth Kontham   |   28 Jun 2026 5:00 AM IST
సీనియ‌ర్ల‌ల‌లో 500 కోట్ల మొట్ట మొద‌టి స్టార్ ఎవ‌రు?
X

టాలీవుడ్ గ్లోబల్ స్థాయిలో వందల కోట్ల వసూళ్లతో దూసుకుపోతోంది. యంగ్ జనరేషన్ హీరోలు 500 కోట్ల క్లబ్‌ను దాటి వెయ్యి కోట్ల మార్కెట్‌ను టార్గెట్ చేస్తుండగా.. పరిశ్రమను దశాబ్దాలుగా ఏలుతున్న సీనియర్ అగ్ర హీరోలు సైతం ఈ రేసులో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. టాలీవుడ్ బిగ్ ఫోర్ గా పిలవబడే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ లలో 500 కోట్ల గ్రాస్ సాధించే మొట్టమొదటి సీనియర్ స్టార్ ఎవరనే ఆసక్తికర చర్చ ట్రేడ్ వర్గాల్లో నడుస్తోంది. వీరి మార్కెట్ విస్తృతి, ఎంచుకుంటున్న సరికొత్త కథలు, పాన్-ఇండియా అప్పీల్ ఆధారంగా ఈ మైలురాయిని ఎవరు ముందుగా అందుకుంటారనే విశ్లేషణలు ఊపందుకున్నాయి.

ఈ రేసులో అందరికంటే ముందు వరుసలో నిలిచే బలమైన సత్తా మెగాస్టార్ చిరంజీవికి ఉంది. ఆయన బాక్సాఫీస్ స్టామినా - మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చిరంజీవి భారీ బడ్జెట్ సోషియో-ఫాంటసీ - మైథలాజికల్ చిత్రాలపై దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా బాబితో ఓ భారీ మాస్ సినిమా చేస్తున్నారు.

సరైన కంటెంట్ పడితే మెగాస్టార్‌ పవర్‌కు పాన్-ఇండియా స్థాయిలో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా వసూళ్లు రాబట్టి 500 కోట్ల మార్క్‌ను సులువుగా దాటగలరని ట్రేడ్ విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు.

నందమూరి బాలకృష్ణ కొన్ని సంవత్సరాలుగా బాక్సాఫీస్ వద్ద ఊహించని మాస్ విద్వంసాన్ని సృష్టిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్ బస్టర్ కొడుతున్న ఆయన మాస్ ఆడియన్స్‌లో అత్యంత నమ్మకమైన హీరోగా నిలిచారు. తాజాగా క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రకటించిన భారీ ప్రాజెక్ట్ `NBK112` పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అలాగే గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న `NBK111` వంటి చిత్రాలకు స‌రైన కమర్షియల్ హంగులు తోడైతే బాలయ్య మార్కెట్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయం. స‌రైన టాక్ వస్తే ఉత్తర భారతదేశంతో పాటు, ఓవర్సీస్ లోనూ ఈ సినిమాలు 500 కోట్ల రేసులో నిలిచే సత్తా కలిగి ఉన్నవే.

ఇక కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ కూడా తమదైన శైలిలో వైవిధ్యమైన లైనప్‌లతో రేసులోకి దూసుకొస్తున్నారు. నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం `కింగ్ 100` ను దర్శకుడు రా కార్తీక్ పర్యవేక్షణలో అత్యంత భారీగా ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ మైలురాయి చిత్రానికి భారీ తారాగణం -పాన్-ఇండియా అప్పీల్ తోడైంది. మరోవైపు విక్టరీ వెంకటేష్ సైతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న `ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47` పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇప్ప‌టికే వెంకీ కెరీర్ లో సంక్రాంతి వ‌స్తున్నాంతో 300 కోట్లు కొల్ల‌గొట్టారు. ఈ నేప‌థ్యంలో 500 కోట్లు అన్న‌ది వెంకీ కి పెద్ద విష‌యం కాదు.

మొత్తంగా టాలీవుడ్ సీనియర్ల మధ్య నడుస్తున్న 500 కోట్ల రేసు తెలుగు సినిమా మార్కెట్ పరిధిని మరింత విస్తృతం చేస్తోంది. చిరంజీవి భారీ విజువల్ ఎపిక్స్‌తోనూ, బాలకృష్ణ పక్కా మాస్-కమర్షియల్ చిత్రాలతోనూ ముందంజలో కనిపిస్తుండగా, నాగ్-వెంకీలు క్రేజీ కాంబినేషన్లతో సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నలుగురిలో ఎవరు ముందుగా ఆ అద్భుతమైన మైలురాయిని అందుకున్నా? అది ఆ నటుడి రికార్డు మాత్రమే కాదు. టాలీవుడ్ సీనియర్ హీరోల స్టామినాను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పే చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుంది.